logo

వంశధార ఉగ్రరూపం

వంశధార ఆదివారం రాత్రి 12 గంటల సమయానికి 73 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లోతో ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం 6 గంటలకు గొట్టాబ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 30,387 క్యూసెక్కులు నమోదైంది. దీంతో 11 గేట్లు ఎత్తివేసి అధికారులు

Published : 15 Aug 2022 06:29 IST

వంశధార నది నుంచి గొట్టాబ్యారేజీ వద్ద దిగువకు వెళ్తున్న నీరు

కలెక్టరేట్‌(శ్రీకాకుళం), హిరమండలం, న్యూస్‌టుడే: వంశధార ఆదివారం రాత్రి 12 గంటల సమయానికి 73 వేల క్యూసెక్కుల అవుట్‌ఫ్లోతో ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం 6 గంటలకు గొట్టాబ్యారేజీ వద్ద ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో 30,387 క్యూసెక్కులు నమోదైంది. దీంతో 11 గేట్లు ఎత్తివేసి అధికారులు నీటిని దిగువకు విడిచిపెట్టారు. ప్రవాహం నెమ్మదిగా పెరుగుతూ మధ్యాహ్నం 3 గంటల సమయంలో 35 వేల క్యూసెక్కులకు, సాయంత్రానికి 40 వేల క్యూసెక్కుల చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీచేశారు. 20 గేట్లు ఎత్తేశారు. రాత్రికి మరింత ప్రమాద స్థాయికి చేరింది. దీంతో దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. డీఈఈ క్రాంతికుమార్‌, ఏఈలు బి.సత్యనారాయణ, పరిశుద్ధబాబులు బ్యారేజీ వద్ద పరిస్థితిని పరిశీలించారు.

ప్రజలను అప్రమత్తం చేయండి: కలెక్టర్‌

అల్పపీడన ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ తెలిపారు. ఒడిశాలో కురుస్తున్న వర్షాల కారణంగా నదుల్లో వరద నీరు రానుందని, వెంటనే తీరప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం మండల అధికారులతో కలెక్టర్‌ టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికే వంశధార నదిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు వివరించారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. కొత్తూరు, భామిని, హిరమండలం, ఎల్‌.ఎన్‌.పేట, సరుబుజ్జిలి, పోలాకి, ఆమదాలవలస, జలుమూరు, నరసన్నపేట మండల తహసీల్దార్లు వారి పరిధిలోని ముంపు ప్రాంతాల ప్రజలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమావేశంలో జేసీ ఎం.విజయసునీత, ఎస్పీ జి.ఆర్‌.రాధిక పాల్గొన్నారు.

సగటు వర్షపాతం 15.9 మి.మీ.

ఆదివారం ఉదయం నుంచి జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. జిల్లా సగటు వర్షపాతం 15.9 మి.మీ.లుగా నమోదైంది. పలాసలో 47.4, మెళియాపుట్టి 31.4, ఇచ్ఛాపురం 29.8, వజ్రపుకొత్తూరు 29.6, కంచిలి 28.8, కవిటి 28.6, ఎల్‌.ఎన్‌.పేట 26, సోంపేట 24.2, సారవకోట 22.4 మిల్లీమీటర్లు చొప్పున వర్షం కురవగా.. మిగిలిన చోట్ల ఓ మోస్తరుగా పడింది.

కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూం నంబరు 9491222122

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని