logo

పాఠకులకు మెరుగైన సేవలే ధ్యేయం

పాఠకుల అవసరాలు తీర్చడంతో పాటు వారికి మెరుగైన సేవలందించడమే ధ్యేయంగా జిల్లా గ్రంథాలయ సంస్థ పనిచేస్తుందని సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్‌రాజు పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా ఆయన ఇటీవల ఉద్యోగ

Published : 15 Aug 2022 06:29 IST

జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి కుమార్‌రాజు

శ్రీకాకుళం సాంస్కృతికం, న్యూస్‌టుడే: పాఠకుల అవసరాలు తీర్చడంతో పాటు వారికి మెరుగైన సేవలందించడమే ధ్యేయంగా జిల్లా గ్రంథాలయ సంస్థ పనిచేస్తుందని సంస్థ కార్యదర్శి బుర్రి కుమార్‌రాజు పేర్కొన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శిగా ఆయన ఇటీవల ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఆయన పరిశీలించిన అంశాలు, చేపట్టనున్న కార్యకలాపాలను ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో వివరించారు. అవి ఆయన మాటల్లోనే...

ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు

జిల్లాలో కేంద్రగ్రంథాలయంతో పాటు 44 శాఖాగ్రంథాలయాలు, 5 గ్రామీణ గ్రంథాలయాలు, 96 పుస్తక నిక్షేప కేంద్రాలు ఉన్నాయి. వాటన్నింటిలో పాఠకులకు ఇబ్బంది లేకుండా మంచినీరు, మరుగుదొడ్ఢి. ఇలా అన్ని సౌకర్యాలు తప్పకుండా ఉండేలా చూస్తున్నాం. శుక్రవారం సెలవు అయినప్పటికీ పాఠకుల అభ్యర్థన మేరకు కేంద్రగ్రంథాలయంలో శుక్రవారం ఆడిటోరియం, మ్యాగజైన్‌, పత్రికా విభాగాలు తెరిచి ఉంచుతున్నాం. ఏమైనా సమస్యలు ఎదురైతే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తాం.

అన్ని అంశాల్లో..

ఆజాదీకా అమృత్‌ మహోత్సవ్‌ సందర్భంగా జిల్లావ్యాప్తంగా అన్ని శాఖాగ్రంథాలయాల్లో ఇటీవల పింగళి వెంకయ్య జయంతిని పురస్కరించుకుని విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించాం. ఆగస్టు 15న బహుమతులు ప్రదానం చేస్తాం. అన్ని గ్రంథాలయాల్లో త్రివర్ణపతాకం రెపరెపలాడేలా చర్యలు తీసుకుంటాం.

డిజిటల్‌ లైబ్రరీ..

జిల్లాలో ఇటీవల నేషనల్‌ డిజిటల్‌ లైబ్రరీ సేవలను ప్రారంభించాం. ఇందులో వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి. పాఠకులు వీటిని వినియోగించుకునేందుకు కేంద్రగ్రంథాలయంలో 3 కంప్యూటర్లు ఉన్నాయి. మరో 10 కంప్యూటర్లు ఏర్పాటు చేయనున్నాం. త్వరలో శాఖా గ్రంథాలయాలకు కంప్యూటర్లను సమకూరుస్తాం. ప్రభుత్వం ఏర్పాటు చేసే డిజిటల్‌ లైబ్రరీలకు వీటికి సంబంధం లేదు.

బకాయిలు రూ.5కోట్లు

2021-22 సంవత్సరంలో ఇప్పటి వరకు స్థానిక సంస్థల నుంచి గ్రంథాలయాలకు సెస్సు బకాయి రూ.కోటి ఇరవై మూడు వసూలైంది. 2022-23 సంవత్సరానికిగాను రూ.23 లక్షలు మాత్రమే వచ్చింది. మొత్తం కలిపి ఇంకా సుమారు రూ.5 కోట్ల వరకు రావాల్సి ఉంది. జిల్లాలో గ్రామ పంచాయతీల నుంచే ఎక్కువ శాతం రావాలి.

అందుబాటులో అన్ని పుస్తకాలు...

వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని పుస్తకాలు గ్రంథాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. ఈ మధ్యనే సుమారు రూ.40లక్షలతో పుస్తకాలు కొనుగోలు చేసి ఒక్కో శాఖాగ్రంథాలయానికి 600 చొప్పున పంపిణీ చేశాం. మరికొన్ని పుస్తకాల కొనుగోలుకు రూ.8 లక్షలతో ప్రతిపాదనలు పెట్టాం. అవసరమైన పుస్తకాలు తెప్పించేందుకు ప్రయత్నిస్తాం. అంతేకాకుండా సుమారు 54 వేల పుస్తకాలు, పత్రికలు కంప్యూటరీకరించి అందుబాటులో ఉంచాం.

వేధిస్తున్న సిబ్బంది కొరత..

జిల్లాలోని పలు శాఖాగ్రంథాలయాలను ఇటీవల సందర్శించాను. సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. మొత్తం అన్ని గ్రంథాలయాల్లో 108 మంది ఉద్యోగులు ఉండాల్సింది. కేవలం 40 మంది మాత్రమే ఉన్నారు. ఒప్పంద ప్రాతిపదికన 11 మంది పని చేస్తున్నారు. కొన్ని గ్రంథాలయాలు అటెండర్లతో నడపాల్సిన పరిస్థితి ఉంది. ఒక్కొక్కరు రెండు, మూడు గ్రంథాలయాల బాధ్యతలు చూడాల్సి వస్తోంది. కోటబొమ్మాళి, కొత్తూరు, వజ్రపుకొత్తూరు గ్రంథాలయాలకు సొంత భవనాలు లేవు. 2022-23 బడ్జెట్‌లో జిల్లా కేంద్రగ్రంథాలయానికి అదనపు భవనం, పొందురు శాఖా గ్రంథాలయం సొంత భవనానికి కలిపి రూ.80 లక్షలు నిధులు మంజూరయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని