logo

అరకొరగా ఎరువులు.. ఇబ్బందుల్లో రైతులు!

మండలంలో 30 పంచాయతీల్లో 64 రెవెన్యూ గ్రామాలు 16 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. సచివాలయాల పరిధిలో ఉన్న 16 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. 12,493 ఎకరాల్లో 11,772 ఎకరాల విస్తీర్ణంలో సుమారు వెయ్యి మంది రైతులు వరి

Published : 15 Aug 2022 06:29 IST

పెద్దపేట వద్ద ఎరువులు అందిస్తున్న వ్యవసాయ

సిబ్బంది, పాల్గొన్న ప్రజాప్రతినిధులు, రైతులు

బూర్జ, న్యూస్‌టుడే: మండలంలో 30 పంచాయతీల్లో 64 రెవెన్యూ గ్రామాలు 16 గ్రామ సచివాలయాలు ఉన్నాయి. సచివాలయాల పరిధిలో ఉన్న 16 రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. 12,493 ఎకరాల్లో 11,772 ఎకరాల విస్తీర్ణంలో సుమారు వెయ్యి మంది రైతులు వరి పంటను వెదలు, నాట్లు వేసి సాగు చేస్తున్నారు. ప్రభుత్వం వాటి ద్వారా రైతులకు అవసరమైన వివిధ రకాల విత్తనాలు, ఎరువులు వంటివి అందించాల్సి ఉంది. అయితే ఆర్‌బీకేల ద్వారా రాయితీ విత్తనాలు, ఎరువులు అరకొరగా అందుతున్నాయని పలువురు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం వరి, తదితర పంటలకు అవసరమైన యూరియా, డీఏపీలను ప్రైవేటు దుకాణాల్లో అధిక ధరలకు కొనుక్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. దీంతో అదనపు ఆర్థిక భారం తమపై పడుతోందని రైతులంతా వాపోతున్నారు. మండలంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో వరితో పాటు చెరకు, పత్తి, గోగు, మొక్కజొన్న పంటలను రైతులు సాగుచేస్తున్నారు. వ్యవసాయశాఖ ఆదేశాల మేరకు రైతు భరోసా కేంద్రాలు, పరపతి సంఘాల ద్వారా రైతులకు 50 శాతం ఎరువులను పంపిణీ చేపట్టాల్సి ఉందని, మిగిలిన 50 శాతం ప్రైవేటు దుకాణాల ద్వారా అందిస్తున్నట్లు సంబంధిత అధికారులు చెబుతున్నారు. మండలానికి 750 మెట్రిక్‌ టన్నుల యూరియా, 625 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 325 మెట్రిక్‌ టన్నుల పొటాష్‌ అవసరం. యూరియా 290, డీఏపీ 545, పొటాష్‌ 285 మెట్రిక్‌ టన్నులు మండలానికి రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా పక్క మండలాల్లో వారికి కొందరు నాయకులు చాటుమాటుగా సరఫరా చేస్తుండటంతో వీటి కొరత సమస్య ఏర్పడిందని రైతులు పేర్కొంటున్నారు. ఇదే అదనుగా మండలంలోని ప్రైవేటు డీలర్లు ఎరువులను ఉన్న ధర కంటే అధిక ధరలకు విక్రయిస్తున్నారని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

డీఏపీ ఊసే లేదు..

మండలంలోని 16 రైతు భరోసా కేంద్రాల్లో డీఏపీ జాడే లేదని రైతులు పేర్కొంటున్నారు. బూర్జ పీఏసీఎస్‌లో ఇస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అల్లెన, డొంకలపర్త, పాలవలస, పెద్దపేట, అప్పలపేట, నీలాదేవిపురం, బూర్జ, తోటవాడ రైతు భరోసా కేంద్రాల ద్వారా అరకొరగా రైతులకు అందాయి. మిగిలిన 6 రైతు భరోసా కేంద్రాలకు యూరియా తప్ప డీఏపీ రాలేదని ఆ పరిధిలో రైతులు వాపోతున్నారు. యూరియా, డీఏపీ సమయానికి అందక బయట దుకాణాల్లో రూ.150 నుంచి రూ.450 వరకు అదనంగా చెల్లించి కొనుగోలు చేయాల్సి వస్తుందని చెబుతున్నారు.

మండలంలోని రైతులకు ఎరువుల కొరత ఏర్పడకుండా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నాం. రైతు భరోసా కేంద్రాల ద్వారా యూరియా 400 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ, పోటాష్‌లు 40 మెట్రిక్‌ టన్నులు, అదేవిధంగా పీఏసీఎస్‌ ద్వారా యూరియా 60 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 40 మెట్రిక్‌ టన్నులు అందించాం. కొందరు రైతులు పంటకు అవసరమైన దాని కంటే అధిక మొత్తంలో ఎరువును వేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. - ఎన్‌.శ్రీనివాసరావు, వ్యవసాయాధికారి, బూర్జ మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని