logo
Updated : 17 Aug 2022 06:53 IST

ఆక్రమిస్తే అడిగేదెవరు..?

 అటవీ భూముల్లో యథేచ్ఛగా రొయ్యల చెరువులు       

ఎం.కొత్తూరులో 20 ఎకరాల పైనే కబ్జా

ఎం.కొత్తూరు సమీపంలో ఆక్వా సాగు..

ప్రభుత్వ స్థలం అంటే చాలు అందరికీ చులకనే.. అందుకే.. ఆక్రమిస్తే అడిగేదెవరు అన్నట్లుగా కబ్జాదారులు  చెలరేగిపోతారు.. అది సెంటు స్థలమైనా ఎకరాలైనా బెదురే లేదు..  రాజకీయ, అధికార బలంతో దురాఘతాలకు పాల్పడతారు.. ఇందుకు ఉదాహరణ సంతబొమ్మాళి మండలంలోని  తీర ప్రాంతాల్లో జరుగుతున్న దందానే.. తంపర మొదలు   అటవీభూముల వరకు ఆక్రమించని ప్రాంతమంటూ లేదు.. తాజాగా ఎస్బీకొత్తూరు పంచాయతీలో ఎం.కొత్తూరు గ్రామ పరిధిలో దాదాపు 20 ఎకరాల అటవీభూమి కబ్జాకోరల్లోకి వెళ్లిపోయింది. అంతేకాదు రొయ్యల చెరువులుగానూ మారిపోయింది.. పాలన గ్రామీణ స్థాయికి చేరిన రోజుల్లో కూడా ఇది యంత్రాంగానికి తెలియకపోవడం గమనార్హం.

ఎం.కొత్తూరు గ్రామ పరిధిలో తీరాన్ని ఆనుకుని రెవెన్యూ, అటవీ శాఖ భూములు దాదాపు వంద హెక్టార్ల పైనే ఉంటుంది. ఇవన్నీ ఒకప్పుడు మట్టి, ఇసుక దిబ్బలతోనే ఉండేవి. అయితే ఆక్వాసాగుకు ఇటీవల అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో అక్రమార్కుల కన్ను వీటిపై పడింది. సర్వే నంబరు-77లో 35 ఎకరాల మేర ప్రభుత్వ భూమి ఉంది. దీన్ని ఇసుకదిబ్బగా నోటిఫై చేశారు. ఇది అటవీశాఖ పరిధిలో కొన్నేళ్లుగా ఉంది. తర్వాత రొయ్యల చెరువులను నిర్మించేశారు. గత ఆరు నెలల వ్యవధిలోనే దాదాపు 20 ఎకరాల్లో భూములు చెరువులుగా మారిపోయాయంటే ఎంతజోరుగా దందా సాగిపోయిందో అర్థం చేసుకోవచ్చు.  

రెవెన్యూ, అటవీశాఖల మధ్య కొరవడిన సమన్వయం..
ఇక్కడున్న భూముల్లో కొంత రెవెన్యూ, మరికొంత అటవీశాఖ పరిధిలో ఉంది. ఎవరిది ఎంత అన్న స్పష్టత ఇరు శాఖల అధికారుల వద్దా లేదు. దీంతో ఈ భూములపై పర్యవేక్షణ లేకపోవడంతో ఆక్రమణదారులు చెలరేగిపోతున్నారు. అప్పనంగా భూమికి విద్యుత్తు సౌకర్యం కల్పించుకున్నారు. అవసరమైన ఇతర సౌకర్యాలూ సమకూరాయి. ఒకరిని చూసి మరొకరు 20 ఎకరాల వరకు రొయ్యల చెరువులు నిర్మించేశారు. ఒక్కో ఎకరాలో నాలుగు చెరువుల వరకు ఏర్పాటు చేశారు. ఇదే ప్రాంతంలో ఎకరా విలువ సుమారుగా రూ.15 లక్షల వరకు ఉంటుందని స్థానికులు పేర్కొంటున్నారు.

సర్వేలో గుర్తించి తొలగిస్తాం..  
జగనన్న సమగ్ర భూసర్వే జరుగుతోంది. ఇందులో భూమి హద్దులు స్పష్టమవుతాయి. ఆక్రమణల్లో రెవెన్యూ, అటవీ భూమి స్థలం కొంత ఉందని తేలింది. ఎంతవరకు ఎవరి భూమి ఉందని గుర్తించాక చర్యలు తీసుకొంటాం. ఇప్పటికే మండలాల వారీగా నోడల్‌ అధికారులను నియమించాం. సర్వే పూర్తయ్యాక నోటిఫై చేసి ఆక్రమణలు తొలగిస్తాం.
- అమ్మన్నాయుడు, అటవీశాఖ రేంజ్‌ అధికారి, టెక్కలి

నిబంధనలు గాలిలో..  
సాధారణంగా రొయ్యల చెరువులు ఏర్పాటు చేయాలంటే రెవెన్యూ, మత్స్య శాఖల నుంచి అనుమతులు తీసుకోవాలి. తొలుత తహసీల్దారు, మత్స్యకార సహాయకుడికి దరఖాస్తు చేసుకోవాలి. సీవోసీ సర్టిఫికెట్‌ వీఆర్వో నుంచి తీసుకోవాలి. నిర్మించేస్థలం జిరాయితీలోని సర్వే నంబరును పేర్కొంటూ జియో ట్యాగింగ్‌ చేసుకోవాలి. సాగుదారు ఆధార్‌ నంబరు లింకు చేయాలి. ఇవన్నీ ఉంటేనే ఏపీ ఆక్వా డెవలప్‌మెంట్‌ అథారిటీ ప్రకారం సాగుకు అవకాశం ఉంటుంది. కానీ ఇవేమీ ఇక్కడ అవసరం లేదు. విద్యుత్తు లైన్‌ అనధికారికంగా ఇచ్చేస్తున్నారు. పంటలు పండని మురుగునీటి కాలువ సౌకర్యమున్న ప్రాంతాల్లోనే చెరువు తవ్వాలి. అలాంటివి లేకపోయినా ఆక్వా సాగైపోతోంది.

 

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని