logo

Srikakulam: పోలీసులమని చెప్పి దోచేశారు..!

మంచిగా మాట్లాడారు.. జాగ్రత్తలు చెప్పారు. పోలీసులమని నమ్మించారు. ఆ మాయగాళ్ల మాయలో పడి నిలువునా మోసపోయింది పాపం వృద్ధురాలు.. ఒకటి కాదు, రెండు కాదు 13 తులాల బంగారు ఆభరణాలు

Updated : 22 Sep 2022 08:38 IST

వృద్ధురాలి నుంచి 13 తులాల బంగారం అపహరణ

రెండో పట్టణ పోలీసు స్టేషన్‌ వద్ద బాధితురాలు నిర్మలకుమారి

శ్రీకాకుళం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: మంచిగా మాట్లాడారు.. జాగ్రత్తలు చెప్పారు. పోలీసులమని నమ్మించారు. ఆ మాయగాళ్ల మాయలో పడి నిలువునా మోసపోయింది పాపం వృద్ధురాలు.. ఒకటి కాదు, రెండు కాదు 13 తులాల బంగారు ఆభరణాలు ఆమె నుంచి అపహరించారు. ఈ ఘటన జిల్లా కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సారవకోట మండలం బుడితి గ్రామానికి చెందిన పి.నిర్మలకుమారి అనే 65 ఏళ్ల వృద్ధురాలు ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఆసుపత్రికి వచ్చింది. వైద్యులు పరీక్షలు చేయించాలని సూచించడంతో సమీపంలోని ల్యాబ్‌కు వెళ్లి రక్తం ఇచ్చింది. అక్కడి నుంచి డే అండ్‌ నైట్‌ కూడలి వద్ద ఉన్న గణపతి ఆలయానికి వెళ్లింది. దర్శనానంతరం తిరిగి ఆసుపత్రికి వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమెను పిలిచారు. ‘అమ్మా.. మెడలో.. చేతికి ఇంత బంగారం వేసుకుని తిరగొద్దు. వెంటనే తీసేసి బ్యాగులో వేసుకోండి.’ అని చెప్పారు. ఆమె వారి మాటలను నమ్మి బంగారాన్ని వారి చేతికిచ్చి బ్యాగులో వేయాలని కోరింది. వేశామని వృద్ధురాలిని నమ్మించిన వారు ఆమెను అక్కడ నుంచి పంపించేశారు. కొంత దూరం వెళ్లాక ఆమె బ్యాగులో చూడగా బంగారం లేదు. స్థానికుల సాయంతో రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ జరిపారు. వృద్ధురాలి చేతికి వేసుకున్న 8 బంగారం గాజులు, పుస్తెలతాడు, నల్లపూసలు అపహరించుకుపోయారని, వాటి విలువ రూ.8 లక్షల వరకు ఉంటుందని సీఐ ఈశ్వరప్రసాద్‌ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని