logo

రారండోయ్‌.. అమ్మ జాతర చూసొద్దాం

కోరిన కోర్కెలు తీర్చే అమ్మగా.. కోటబొమ్మాళి ప్రజల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కొత్తమ్మతల్లి జాతర వచ్చేసింది.. మూడురోజుల పాటు ఉత్సవ శోభతో అలరారనుంది. ఇందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు.

Published : 27 Sep 2022 06:27 IST

నేటి నుంచి కొత్తమ్మతల్లి ఉత్సవాలు


విద్యుద్దీపాలంకరణలో ఆలయ గోపురం, (అంతర చిత్రంలో)అమ్మవారు

న్యూస్‌టుడే, కోటబొమ్మాళి  : కోరిన కోర్కెలు తీర్చే అమ్మగా.. కోటబొమ్మాళి ప్రజల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న కొత్తమ్మతల్లి జాతర వచ్చేసింది.. మూడురోజుల పాటు ఉత్సవ శోభతో అలరారనుంది. ఇందుకోసం ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. భక్తుల కోసం ప్రత్యేకంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మూడు రోజుల పాటు జాతరను ఘనంగా నిర్వహించనున్నట్లు అధికారులు, ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. కోటబొమ్మాళిలో కొలువైన కొత్తమ్మతల్లి ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. నిర్మానుష్య ప్రాంతంలో 1925లో అదృశ్యమైన ఓ ముత్తయిదువ గ్రామాన్ని రక్షించేందుకు కొత్తమ్మతల్లిగా వెలిసిందని గ్రామస్థులు చెబుతుంటారు. నాటి నుంచి పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం నిత్యం భక్తుల రాకపోకలతో రద్దీగా మారింది. ఏటా పోలాల అమావాస్య తర్వాత వచ్చే గురువారం అమ్మవారి జాతరకు ఆఖరిరోజుగా పరిగణించి పండగ నిర్వహిస్తుంటారు. మంగళవారం నుంచి 29 (గురువారం) వరకు ఉత్సవాలు జరగనున్నాయి. జాతర సందర్భంగా విశాఖపట్నానికి చెందిన పెద్దబాబు సహకారంతో రప్పించిన పూలతో గర్భగుడి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు.

సమీప ప్రాంతాల భక్తుల దర్శనం..

ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు మంగళవారం ముందుగా దేవదాయశాఖ నేతృత్వంలో పూజలు నిర్వహిస్తారు. ప్రముఖులు అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం ఆలయం నుంచి జంగిడి బయలుదేరి కమ్మకట్టు చినఅప్పలనాయుడు ఇంటికి వెళ్తుంది. మూడు రోజులపాటు జిల్లా నుంచే కాక ఇతర ప్రాంతాల భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులు తీసుకువచ్చిన ముర్రాటలను గర్భగుడిలో పూజారుల చేతులమీదుగా అమ్మవారికి సమర్పిస్తారు. గురువారం మధ్యాహ్నం తర్వాత గ్రామంలోని ప్రతీ వీధి నుంచి ఘటాలు బయలుదేరి మేళతాళాలు, డప్పుల మోతల మధ్య జంగిడితో ఆలయానికి చేరుకుంటాయి. మూడు రోజులూ వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేస్తారు. ఉత్సవాలకు 406 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు. ఈ ఏడాది కొవిడ్‌ నిబంధనలు సడలించడంతో ఎక్కువమంది భక్తులు హారవుతారని అంచనా. పోలీసులు, ఇతర శాఖల సహకారంతో భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్ల ఇన్‌ఛార్జి ఈవోసూర్యనారాయణ తెలిపారు

ఇదీ చరిత్ర... కోటబొమ్మాళి గ్రామానికి చెందిన కమ్మకట్టు చినఅప్పలనాయుడు ప్రతి గురువారం నేరేడివలస(నారాయణవలస) వారపు సంతలో క్రయవిక్రయాలకు ఎడ్లబండిపై రాకపోకలు సాగించేవారు. ఈ క్రమంలో ఓసారి తిరిగొస్తుండగా మార్గమధ్యంలో ఓ ముత్తయిదువ ఆపి కోటబొమ్మాళి వరకు వస్తానని చెప్పి బండి ఎక్కింది. గ్రామానికి ముందు పట్నాయకుని వెంకటేశ్వరరావు మామిడితోట వద్ద నిర్మానుష్య ప్రాంతంలో దిగి అదృశ్యమైంది. అదే రోజు చిన్నఅప్పలనాయుడు కలలో కనిపించి బండి దిగిన ప్రాంతంలోనే కొత్తమ్మ తల్లిగా వెలిశానని చెప్పింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని