logo

అయ్యో.. దేవుడా.!

చూడచక్కని కుటుంబం..  ముచ్చటగొలిపే చిన్నారులు.. రెక్కలకష్టం విలువ తెలిసినవారు.. హాయిగా సాగిపోతున్న వీరిని చూసి ఆ విధికే కన్నుకుట్టిందేమో.. కారు రూపంలో కుటుంబం మొత్తాన్నే చిదిమేసింది.. నాలుగు నిండు ప్రాణాలను తీసుకెళ్లిపోయింది..

Updated : 27 Sep 2022 09:08 IST
కుటుంబాన్నే మింగేసిన ప్రమాదం
ఏలూరు జిల్లాలో ఘటనతో తురకపేటలో విషాదం
న్యూస్‌టుడే, నూజివీడు రూరల్‌,ఎల్‌.ఎన్‌.పేట
ఉమామహేశ్వరరావు, రేవతి, షర్మిల, దుర్గాప్రసాద్‌ (పాత చిత్రాలు)

చూడచక్కని కుటుంబం..  ముచ్చటగొలిపే చిన్నారులు.. రెక్కలకష్టం విలువ తెలిసినవారు.. హాయిగా సాగిపోతున్న వీరిని చూసి ఆ విధికే కన్నుకుట్టిందేమో.. కారు రూపంలో కుటుంబం మొత్తాన్నే చిదిమేసింది.. నాలుగు నిండు ప్రాణాలను తీసుకెళ్లిపోయింది.. అభంశుభం ఎరుగని చిన్నారులపైనా దయచూపలేదు.. గుండెలు పిండేసిన ఈ ఘోర ప్రమాదం ఆదివారం రాత్రి ఏలూరు జిల్లాలో చోటుచేసుకుంది.. బతుకుదెరువు కోసం ఎల్‌ఎన్‌పేట మండలం తురకపేట నుంచి ఏలూరు జిల్లాకు వలసవెళ్లిన నూక గణపతి కుటుంబం రోడ్డు ప్రమాదంలో ఛిన్నాభిన్నమైంది. కుమారుడు, కోడలు, ఇద్దరు పిల్లలు మృతిచెందారనే గుండెపగిలే వార్తతో స్వగ్రామంలో విషాదఛాయలు   అలముకున్నాయి.

గణపతి కుమారుడు నూక ఉమామహేశ్వరరావు ఓ దారాల పరిశ్రమలో క్వాలిటీ కంట్రోల్‌ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. మొక్కులు చెల్లించుకునేందుకని కుటుంబం మొత్తం విజయవాడలోని కనకదుర్గ, ద్వారకా తిరుమల ఆలయాలకు వెళ్లి దైవదర్శనం చేసుకున్నారు. సోమవారం సొంతూరు శ్రీకాకుళం వెళ్లాల్సి ఉందని ఇప్పుడే గుబ్బల మంగమ్మ ఆలయానికి వెళ్లిరావాలని తండ్రి చెప్పడంతో ఆయన మాట కాదనలేక మంగమ్మ దర్శనానికి ఆదివారం ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగొస్తుండగా మృత్యువు కారు రూపంలో కబళించింది. ఘటనలో ఉమామహేశ్వరరావు, షర్మిల, దుర్గాప్రసాద్‌ మృతిచెందారు. విజయవాడలో చికిత్స పొందుతూ సోమవారం ఉమామహేశ్వరరావు భార్య రేవతి కూడా కన్నుమూశారు. సాయంత్రం మృతదేహాలను నూజివీడు మండలం మర్రిబంధం గ్రామం తీసుకురావడంతో బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. జీవిత చరమాంకంలో ఉన్న తమను తీసుకెళ్లకుండా కుటుంబాన్నే లేకుండా చేశావా దేవుడా అంటూ ఆ వృద్ధ దంపతులు విలపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని