logo

ఫిర్యాదు చేస్తే ఆక్రమణలపై చర్యలు

జిల్లాలో జలవనరుల్లో ఆక్రమణలు దారుణంగా పెరిగిపోయాయి. 8 వేల చెరువులుంటే వాటిలో 4 వేల మేర గత కొన్నేళ్లుగా ఆక్రమణకు గురయ్యాయి. ప్రస్తుతం కబ్జాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. అలా చేస్తున్నారని ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటాం’

Updated : 27 Sep 2022 06:45 IST

- ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం

జిల్లాలో జలవనరుల్లో ఆక్రమణలు దారుణంగా పెరిగిపోయాయి. 8 వేల చెరువులుంటే వాటిలో 4 వేల మేర గత కొన్నేళ్లుగా ఆక్రమణకు గురయ్యాయి. ప్రస్తుతం కబ్జాలకు అడ్డుకట్ట వేస్తున్నాం. అలా చేస్తున్నారని ఎవరు ఫిర్యాదు చేసినా వెంటనే స్పందించి చర్యలు తీసుకుంటాం’ అని నీటి పారుదల శాఖ ఎస్‌ఈ సుధాకరరావు స్పష్టం చేశారు. పాత ఆక్రమణల తొలగింపునకు కార్యాచరణ రూపొందిస్తున్నామని, త్వరలో దాన్ని అమలు చేస్తామంటున్న ఆయన ‘ఈనాడు’ ముఖాముఖిలో పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు.  

ప్రశ్న: శివారు ప్రాంతాలకు ఇంకా నీరందని పరిస్థితి. ఎప్పుడు ఇస్తారు.?
ఎస్‌ఈ : నారాయణపురం ఆనకట్ట పరిధిలోని శివారు ప్రాంతాలకు పూర్తిస్థాయిలో నీరు అందించలేకపోతున్నాం. ప్రస్తుతానికి నాకాబందీ పద్ధతిలో ఒక్కో ప్రాంతానికీ నీరు ఇస్తున్నాం. విడతల వారీగా అన్ని గ్రామాలకూ సాగునీరు ఇచ్చేందుకు కృషి చేస్తున్నాం. పొన్నాడ కాలువకు నాలుగు రోజులు ఇచ్చి ఇప్పుడు, కొంగరాం, భగీరథపురం తదితర గ్రామాలకు విడుదల చేశాం. ఆయకట్టు కింద ఉన్న ప్రతి ఎకరాకూ నీరందించేందుకు కృషి చేస్తున్నాం.

మడ్డువలస ఫేజ్‌-2 పనుల్లో జాప్యం జరుగుతూనే ఉంది?
మడ్డువలస విస్తరణలో 60 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలినవి ఫేజ్‌-2 కింద చేసేందుకు రూ.26 కోట్లకు అనుమతులు మంజూరయ్యాయి. ఇప్పటికే రెండుసార్లు టెండర్లు పిలిచినా స్పందన లేదు. మూడోసారి పిలిచాం. నిర్ణీత సమయం తర్వాత తెరుస్తాం. నిబంధనల ప్రకారం కాంట్రాక్టు అప్పగించి పనులు చేయిస్తాం.

పొలాలు నదీ గర్భంలో కలిసిపోతున్నాయి, పరిష్కారం చూపుతారా?

జిల్లాలో ఇది అతిపెద్ద సమస్యగా మారింది. తక్షణం నాగావళి, వంశధార నదులపై కొన్నిచోట్ల అత్యవసరంగా రక్షణ గోడలు నిర్మించాలని ప్రభుత్వానికి నివేదించాం. ఈ రక్షణ గోడల నిర్మాణానికి నాగావళి నదికి రూ.37.5 కోట్లు, వంశధార నదికి భూసేకరణతో కలిపి రూ.130 కోట్లు విడుదల చేయాలని ప్రతిపాదనలు పంపించాం. అవి ఇంకా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. ఇటీవల ఆమదాలవలస పరిధిలో కలెక్టర్‌ కేటాయించిన నిధులతో పనులు చేస్తున్నాం.

జైకా నిధులతో చేపట్టిన పనుల సంగతేంటి?

జైకా నిధులతో నారాయణపురం ఆనకట్ట, కుడి, ఎడమ కాలువల ఆధునికీకరణ పనులు చేపట్టాం. సాగునీరు విడిచిపెట్టక ముందు వరకూ పనులు ముమ్మరంగా జరిగాయి. తర్వాత ఆటంకాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం పనులు జరగడం లేదు. ఇప్పటివరకూ చేసినవాటికి రెండు ప్యాకేజీలకు మొత్తం రూ.18 కోట్ల బిల్లులు విడుదల కావాల్సి ఉంది. ఈ సీజన్‌లోగా బిల్లులు విడుదలవుతాయని ఆశిస్తున్నాం.

అభివృద్ధి ప్రక్రియ మూలకు చేరినట్లేనా..?

జిల్లాలో మొత్తం ఎనిమిది ప్యాకేజీల కింద చెరువుల అభివృద్ధి పనులు చేపట్టాం. రెండేళ్ల కిందట వరకూ 50 శాతం పనులు పూర్తిచేశాం. వాటికి సంబంధించిన కొన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ అంశంపై ఉన్నతాధికారులకు నివేదించాం. త్వరలోనే బిల్లులు విడుదలవుతాయని చెప్పారు. మిగిలిన వాటిని ప్రణాళిక ప్రకారం పూర్తి చేయిస్తాం. తద్వారా చెరువులను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం.

చెరువులు పూర్తిస్థాయిలో నింపలేకపోతున్నారు..?

జిల్లాలో కేవలం 2 వేల చెరువులు మాత్రమే ప్రాజెక్టులు, కాలువలకు అనుసంధానంలో ఉన్నాయి. వాటన్నిటినీ ఇప్పటికే నింపాం. వర్షాధారంగా ఉన్నవాటిలో దాదాపు 80 శాతానికి పైగా నిండాయి. వచ్చే నెలలో పూర్తిగా నిండే అవకాశముంది. ఆయా చెరువులకు సంబంధించిన కాలువల్లో నీటి మళ్లింపునకు ఆటంకం లేకుండా పూడికలు తీయిస్తున్నాం.

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts