logo

కాళ్లరిగేలా తిరుగుతున్నా... స్పందన లేదు..!

గ్రామ, మండల, డివిజన్‌, జిల్లాస్థాయిలో అధికారులు ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తమ వేదన వినాలని... న్యాయం చేయాలని అర్జీదారులు అధికారులు ముందు గోడు వెళ్లబోసుకుంటున్నారు. అధికారులు సైతం సమస్యలను వింటున్నారు.

Published : 27 Sep 2022 06:40 IST
భారీగా దరఖాస్తుల రీఓపెన్‌
- ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, కలెక్టరేట్‌,  బృందం

రేషన్‌ కార్డులో సదర్‌ వయసు తప్పుగా నమోదైంది ఇలా...

గ్రామ, మండల, డివిజన్‌, జిల్లాస్థాయిలో అధికారులు ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తమ వేదన వినాలని... న్యాయం చేయాలని అర్జీదారులు అధికారులు ముందు గోడు వెళ్లబోసుకుంటున్నారు. అధికారులు సైతం సమస్యలను వింటున్నారు. కానీ పరిష్కారం దొరక్కపోవడంతో మళ్లీమళ్లీ స్పందన గడప తొక్కుతున్నారు. పదేపదే ప్రాథేయపడుతున్నారు. కానీ ఎవరూ కనికరం చూపడం లేదు. దీంతో వేల సంఖ్యలో పాత దరఖాస్తులు మళ్లీ
పునఃపరిశీలించాల్సి వస్తోంది.


కనికరం లేదాయె..

ఎచ్చెర్ల మండలం తోటపాలెంకి చెందిన ఈయన పేరు కె.పాపారావు. నాలుగేళ్ల నుండి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారు. కనీసం నడవలేని స్థితిలో ఉన్నారు. పింఛను కోసం స్థానికంగా ఎన్నిసార్లు దరఖాస్తు చేసిన ఎవరూ పట్టించుకోలేదని పాపారావు తల్లి వాపోయారు. జూన్‌లో స్పందన కార్యక్రమంలో ఇదే విషయమై అర్జీ పెట్టుకున్నామని, అయినా ఫలితం లేదని ఆవేదన చెందుతున్నారు. దీన్ని సోమవారం అధికారులకు మరోసారి విన్నవించారు.


అక్కడ లేదని ఇక్కడకు...

జిల్లా కేంద్రంతో పాటు శ్రీకాకుళం, టెక్కలి, పలాస డివిజన్‌, మండల స్థాయి, గ్రామస్థాయిలో స్పందన కార్యక్రమం నిర్వహించి ప్రజల సమస్యలకు పరిష్కారాలు చూపాలి. మండలస్థాయిలో పని జరగనప్పుడు ప్రజలు డివిజన్‌ కేంద్రానికి వెళ్తున్నారు. అక్కడ అర్జీ తీసుకుని ఏమాత్రం పట్టించుకోకుండా మండలానికి పంపిస్తున్నారు. దీంతో డివిజన్‌ స్థాయిలో దరఖాస్తు ఇవ్వడం ప్రజలకు వృథా ప్రయాసగా మారుతోంది. జిల్లా కేంద్రంలో కలెక్టర్‌, జాయింట్ కలెక్టర్‌కి వస్తున్న అర్జీలనువారు అక్కడే ఉన్న జిల్లాస్థాయి అధికారులకు మళ్లిస్తున్నారు. అసలు ఆ అర్జీ గ్రామ, మండల, డివిజన్‌ స్థాయిని దాటుకుని జిల్లా వరకూ ఎందుకొచ్చిందనే అంశంపై సంబంధిత అధికారులెవరూ దృష్టి సారించడం లేదు.


పరిష్కారం... లెక్కలకే పరిమితం...

వచ్చిన సమస్యలను వచ్చినట్లే పరిష్కరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. లెక్కల్లో అంతా సవ్యంగానే ఉందని వివరిస్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అలా లేదు. గ్రామ, మండల స్థాయిలో ప్రజల సమస్యలు తీరడం లేదు. అసలు వినతుల స్వీకరణే సక్రమంగా సాగని పరిస్థితి నెలకొంటోంది. అందుకే ప్రజలంతా వ్యయప్రయాసలకోర్చి కి.మీ.లు ప్రయాణించి జిల్లా కేంద్రానికి వస్తున్నారు. ఇక్కడ కూడా వస్తున్న అర్జీలు ఏమవుతున్నాయి? ఎంత మేరకు పరిష్కారమవుతున్నాయి?తదితర అంశాలపై ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించకపోవడంతో ఇబ్బంది ఎదురవుతోంది. ఒక అర్జీని సంబంధితశాఖకు పంపిస్తే అది పరిష్కారమైపోయినట్లు చూపుతున్నారు. అందుకే లెక్కల్లో బాగానే ఉన్నా సమస్యలు అలాగే ఉంటున్నాయి. గడచిన ఏడాదిన్నర కాలంలో 2,614 మంది తమ సమస్యలకు దక్కిన పరిష్కారాలతో సంతృప్తి చెందక మరోసారి పరిశీలన కోరారంటే స్పందన అమలు తీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.


ఈ పిల్లాడి వయసు 77 ఏళ్లట...!

తండ్రి వెంకటరావుతో బాలుడు

ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి హిరమండలం బొడ్డగూడ గ్రామానికి చెందిన సవర వెంకటరావు. ఈయన కుమారుడు సవర సదర్‌ మానసిక వికలాంగుడు. పిల్లాడు పుట్టిన తేదీ 2016 ఫిబ్రవరి 23. ఆధార్‌ కార్డు, జనన ధ్రువపత్రంలోనూ ఇదే తేదీ ఉంది. కానీ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన బియ్యం కార్డులో సాధరకు 77 ఏళ్లని, 1945 జనవరి 1న పుట్టాడని సిబ్బంది తప్పుగా నమోదు చేశారు. దీంతో పింఛను అందడం లేదు. గ్రామ సచివాలయం, మండల కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా.. స్పందనలో వినతులిచ్చినా ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఏ అధికారీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఒంటరి బతుకు .. ఆసరా కరవు

టెక్కలి మండలం మేఘవరం గ్రామానికి చెందిన ఈ వృద్ధురాలి పేరు బి.పోలమ్మ. భర్త మరణించి నాలుగేళ్లయింది. ఒంటరి మహిళ పింఛనుకు అర్హురాలైనా, సచివాలయంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకూ మంజూరు కాలేదు. ఆమె వయసు ప్రస్తుతం 61. మండలస్థాయిలో అధికారుల్ని అడిగితే ఎవరూ స్పందించడం లేదు. అందుకే జిల్లా కేంద్రంలోని స్పందనకు వచ్చారు.


పరిహారం కోసం... ఇంతదూరం..

కవిటి మండలం బల్లిపుట్టుగ గ్రామానికి చెందిన ఈయన పేరు కాళ్ల కృష్ణారావు. తిత్లీ తుపాను సమయంలో తన కొబ్బరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. మొదటి విడతలో ప్రభుత్వ సహాయం అందింది. రెండో విడతలో అతని పేరు వచ్చింది. అయినా ఇంతవరకూ అదనపు పరిహారం మంజూరు కాలేదు. దీనిపై సోమవారం స్పందన కార్యక్రమానికి వచ్చి అర్జీ పెట్టుకున్నారు. గ్రామ, మండల స్థాయిలో అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో 170 కిలోమీటర్లు ప్రయాణించి జిల్లా కేంద్రానికి వచ్చి తన సమస్యను విన్నవించుకున్నారు.


అధికారులకు నోటీసులు..

- శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, కలెక్టర్‌, శ్రీకాకుళం

పెండింగ్‌, రీఓపెన్‌ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. వీటికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. స్పందనలో వచ్చిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో అధికారులు తప్పనిసరిగా పరిశీలించాలి. దానిపై పూర్తి విచారణ జరిపి... సంబంధిత ఫొటోలు యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని ఆదేశించాం. అలా చేయని అధికారులకు నోటీసులు ఇస్తాం.

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts