logo

కలెక్టరు చెప్పినా ఇంతేనా..?

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భవనాల నిర్మాణాల్లో వేగం పెరగాల్సింది పోయి రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. గ్రామస్థాయిలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం(ఆర్బీకే), డిజిటల్‌ లైబ్రరీ, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్‌ భవనాలు నిర్మిస్తున్నారు.

Published : 30 Sep 2022 06:32 IST

టెక్కలి మండల కేంద్రంలోని సచివాలయం-3 భవన నిర్మాణం పరిస్థితి ఇది. పునాదుల కోసం గోతులు తవ్వి వదిలేశారు. టెక్కలి మండల కేంద్రంలో మొత్తం ఐదు నిర్మించాల్సి ఉండగా ఒక్కటీ పూర్తి కాలేదు. ఇసుక కొరత, పనుల్లో జాప్యం వల్ల వివిధ దశల్లోనే నిలిచిపోయాయి.


రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న భవనాల నిర్మాణాల్లో వేగం పెరగాల్సింది పోయి రోజురోజుకూ తగ్గుతూ వస్తోంది. గ్రామస్థాయిలో గ్రామ సచివాలయం, రైతుభరోసా కేంద్రం(ఆర్బీకే), డిజిటల్‌ లైబ్రరీ, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్‌ భవనాలు నిర్మిస్తున్నారు. గ్రామాభివృద్ధికి చిహ్నంగా వీటిని చూపాలని ప్రభుత్వం యోచిస్తోంది. నిర్మాణాలు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయాయి. వీటన్నిటినీ ఎలాగైనా పూర్తిచేయాలని కలెక్టర్‌ శ్రీకేష్‌ బి లఠ్కర్‌ ప్రతి సమావేశంలో పంచాయతీరాజ్‌, రెవెన్యూ సిబ్బందిని ఆదేశిస్తున్నారు. నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి, సస్పెన్షన్‌, షోకాజ్‌ నోటీసులు కూడా ఇచ్చారు. అయినా నిర్మాణ వేగంలో చెప్పుకోదగిన మార్పు ఏమీ కనిపించడం లేదు.

- ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం, న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం, జలుమూరు

భూ కేటాయింపు ఎక్కడ...?
అందరికీ అందుబాటులో ఉండే ప్రదేశంలో వీటికి స్థలం కేటాయించాల్సిన బాధ్యత రెవెన్యూ శాఖపై ఉంది. స్పీకర్‌ సీˆతారాం ప్రజాప్రతినిధిగా ఉన్న ఆమదాలవలస నియోజకవర్గంలో ఓ మండలంలో ఇప్పటికీ 11 భవనాలకు అసలు స్థలమే కేటాయించలేదు. పైగా వాటిలో కొన్ని భవనాలు పునాదులస్థాయిలో ఉన్నట్లు గతంలోనే అధికారులు నమోదు చేసేశారు. మరో మండలంలో 12 భవనాలకు స్థలాలు ఇంకా ఇవ్వనట్లు సమాచారం. పని చేయడానికి ఏజెన్సీల ఎంపిక జరగలేదు. పునాదుల స్థాయిలో ఉన్నట్లు చూపిస్తున్న లెక్కలో 25-30 శాతం నిర్మాణాలకు అసలు స్థలమే ఇవ్వలేదు. ఉన్నతాధికారుల ఒత్తిళ్లు ఎక్కువవడంతో అన్నిచోట్లా పనులు ప్రారంభించేసినట్లు, అవి పునాదుల స్థాయిలో ఉన్నట్లు మండల అధికారులు చెబుతున్నారు.
వేధిస్తున్న సిమెంటు కొరత
భవనాల నిర్మాణాలకు అవసరమైన సిమెంట్ కొరత అడ్డంకిగా మారింది. అధికారులు ఇండెంట్ పెట్టిన రెండు, మూడు నెలలకు కూడా ఒక్కోసారి సిమెంటు సరఫరా కావడం లేదు. ఒక్క శ్రీకాకుళం డివిజన్‌కే దాదాపు 1800 టన్నుల అత్యవసరంగా కావాలి. జిల్లా నుంచి గతంలో పెట్టిన ఇండెంట్లో 3 వేల టన్నులు, ఇటీవల పెట్టిన ఇండెంట్లో 4,400 టన్నులు కలిపి మొత్తం 7,400 టన్నులు సరఫరా కావాల్సి ఉంది.
ఇసుక కోసం ఎన్ని రోజులో..
నిర్మాణాలకు సిమెంటు, ఇనుముతో పాటు ఇసుకా అత్యంత కీలకం. ఇండెంట్ పెట్టిన ఒకటి, రెండు రోజుల్లో ఇసుక సరఫరా చేయాలి. కొన్నిచోట్ల 20-25 రోజుల సమయం పడుతోంది. దీనివల్ల పనులకు ఆటంకం కలుగుతోంది. ప్రభుత్వ భవనాలు, జగనన్న కాలనీల్లో నిర్మాణాలకు ప్రాధాన్యతా క్రమంలో సరఫరా చేస్తున్నామని  అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అలా లేదు. ఉన్న కొద్ది మొత్తాన్నీ జగనన్న కాలనీ ఇళ్ల లబ్ధిదారులకు మాత్రమే సరఫరా చేస్తున్నారు.
నెలలుగా బిల్లుల పెండింగ్‌
మార్చి నెల వరకూ పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఆగస్టులో విడుదలయ్యాయి. మార్చి బిల్లులు ఆగస్టులో విడులైతే ఈ మధ్యలో నాలుగు నెలలు పనులు చేయడానికి డబ్బులు ఎలా తీసుకొస్తామని కొందరు గుత్తేదారులు వాపోతున్నారు. ఈ నిర్మాణాలకు మెటీరియల్‌ కాంపొనెంట్ నిధులదే మెజారిటీ వాటా. కచ్చితంగా ఆ గ్రామానికి చెందిన వారే పనిచేయాలి. అధికార పార్టీకి చెందిన సర్పంచులే దాదాపు పనులు చేస్తున్నారు. వారిలో చాలా మంది ఆర్థికంగా బలమైన వారూ కాదు.
ప్రత్యేక దృష్టి పెట్టాం.. గ్రామస్థాయిలో నిర్మాణాల్లో కొన్ని ఇబ్బందులున్నాయి. వీలైనంత వేగంగా పరిష్కారాలు వెతికి పనులు ముందుకు కదిలేలా చొరవ తీసుకుంటున్నాం. సిమెంటు కొరత వల్ల నిర్మాణాలు ఆగకుండా చూస్తున్నాం. స్థల కేటాయింపులు చాలా వరకూ పూర్తయ్యాయి. - ఎం.విజయసునీత, జాయింట్ కలెక్టర్‌


జలుమూరు మండలం మర్రివలసలో రూ.40 లక్షల అంచనా వ్యయంతో సచివాలయ భవన నిర్మాణం ప్రారంభించి ఇలా వదిలేశారు. ఏడాది కిందటి నుంచీ ఇదే దుస్థితి. సామగ్రి కొరత, బిల్లుల్లో జాప్యం, ఏజెన్సీ ఆర్థిక ఇబ్బందుల వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఏడాది గడచినా పనులు పునఃప్రారంభం కాలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని