logo

జలాలు ఊరిస్తూనె ఉన్నాయ్‌

ఉద్దానం వాసులకు వచ్చే వేసవికైనా వంశధార జలాలు అందుతాయా అంటే.. పనుల తీరు చూస్తే అనుమానమే వ్యక్తం చేయాల్సి వస్తోంది. వాస్తవానికి ఈ ఆగస్టు నాటికే నీటిని అందించాల్సి ఉంది.

Published : 30 Sep 2022 06:32 IST

నత్తనడకన ఉద్దానం మెగా తాగునీటి  పథకం పనులు
తప్పని ఎదురుచూపులు

న్యూస్‌టుడే, సోంపేట: ఉద్దానం వాసులకు వచ్చే వేసవికైనా వంశధార జలాలు అందుతాయా అంటే.. పనుల తీరు చూస్తే అనుమానమే వ్యక్తం చేయాల్సి వస్తోంది. వాస్తవానికి ఈ ఆగస్టు నాటికే నీటిని అందించాల్సి ఉంది. మెగా తాగునీటి పథకం పనులు ఆశించిన స్థాయిలో జరగకపోవడంతో గడువు పొడిగించాల్సి వచ్చింది. దీంతో కిడ్నీవ్యాధుల నుంచి బారిన పడకుండా ఉండాలనుకుంటున్న ఉద్దానాన్ని ఉపరితల జలాలు ఇంకా ఊరిస్తూనే ఉన్నాయి.

నీరే ప్రాథమిక కారణం..
ఉద్దానం కిడ్నీ సమస్యలకు ఇక్కడ వినియోగించే నీరే ప్రాథమిక కారణమని పలు అధ్యయనాల్లో తేలడంతో ప్రభుత్వం వంశధార జలాలు తరలించేందుకు మెగా తాగునీటి పథకాన్ని చేపట్టింది. ఏడు మండలాలైన పలాస, వజ్రపుకొత్తూరు, మందస, సోంపేట, కవిటి, కంచిలి, ఇచ్ఛాపురంలతో పాటు మెళియాపుట్టిలో కొన్ని గ్రామాలకు నీటి సరఫరా చేయాల్సి ఉంది. గొట్టాబ్యారేజి నుంచి నీటిని సేకరించి మెళియాపుట్టి వద్ద శుద్ధిపరిచి అక్కడ నుంచి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లకు పంపిస్తారు. గ్రామాల్లోని ట్యాంకుల ద్వారా వచ్చి అనంతరం ఇంటింటా కుళాయిలకు నీటి సరఫరా అవుతుంది.

మార్చి నాటికి అందిస్తాం..
మార్చి 2023 నాటికి ఉద్దానం గ్రామాలకు నీళ్లిచ్చేలా చర్యలు చేపడుతున్నాం. భారీవర్షాల కారణంగా పనులు కొంతమేర ఆలస్యమయ్యాయి. డిసెంబరు నాటికి పనులు పూర్తయితే అక్కడ నుంచి మూడు నెలల పాటు నిర్వహణ పరమైన అంశాలు చూసి అనంతరం గ్రామాలకు నీటిసరఫరా జరుగుతుంది. ఇప్పటివరకు 70 శాతానికి పైగానే పనులు పూర్తయ్యాయి. ఇంటింటా కుళాయి పనులు జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా జరుగుతాయి. - టి.ఎస్‌.ప్రసాద్‌, ఎస్‌ఈ, గ్రామీణ నీటి సరఫరా

ఇదీ తీరు..
* గొట్టా బ్యారేజీ నుంచి ఇచ్ఛాపురం వరకు నేరుగా 140.42 కి.మీ పొడవునా ప్రధాన పైపులైను నిర్మాణం చేపట్టాల్సి ఉండగా 80 కి.మీ. వరకు పనులు జరిగాయి. కంచిలి, ఇచ్ఛాపురం, సోంపేట మండలాల పరిధిలో స్థల వివాదాలు, మిగిలిన మండలాల పరిధిలో భారీ వర్షాలతో ఇబ్బందుల మూలంగా పనులు ఆలస్యమవుతున్నాయి.
* పైపులైను వేసిన చోట కూడా అనుసంధాన పనులు ఇంకా పూర్తి చేయాల్సి ఉంది.
* అనంతగిరి, కేదారిపురం, మామిడిమెట్టు, రఘునాథపురం, పాలవలస, సోంపేట, బలియాపుట్టి, జలంత్రకోట, సహలాలపుట్టుగ, ఇచ్ఛాపురం క్లస్టర్లుగా విభజించి ఆయా ప్రాంతాల్లో నీటి నిల్వకు ఆరు గ్రౌండులెవెల్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లు, మరో ఆరు ఓవర్‌హెడ్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్ల నిర్మాణం జరుగుతోంది.
* క్లస్టర్‌ ప్రాంతం నుంచి గ్రామాలకు నీటి సరఫరాకు 866.08 కి.మీ.ల మేర అంతర్గత పైపులైను నిర్మాణం జరగాల్సి ఉంది. సహలాలపుట్టుగ క్లస్టర్‌లో 70 కి.మీ., బలియాపుట్టుగలో 35 కి.మీ., జలంత్రకోటలో 25 కి.మీ., సోంపేటలో 20 కి.మీ., ఇచ్ఛాపురంలో 25 కి.మీ. మేర పనులు చేయాల్సి ఉంది. ఇప్పటివరకు 466 కి.మీ. పనులు పూర్తయ్యాయి.
* గ్రామాలకు నీటి సరఫరాకు 807 ఓవర్‌ హెడ్‌ సర్వీస్‌ రిజర్వాయర్లు అవసరం కాగా గతంలో నిర్మించిన కొన్ని ట్యాంకులను వినియోగిస్తూ, కొత్తగా మరో 571 ట్యాంకుల నిర్మాణం జరుగుతున్నాయి. వీటిలో 70 శాతానికిపైగా వివిధ దశల్లో ఉన్నాయి.
మెళియాపుట్టి వద్ద నిర్మాణంలో ఉన్న మెగా తాగునీటి పథకం నీటిశుద్ధి ప్రధాన ట్యాంకు ఇది. దీనిని ప్రారంభించి ఇప్పటికి రెండేళ్లయింది. అధికారులు మాత్రం ఇక్కడ 70 శాతం పనులు జరిగినట్టు చెబుతున్నా ఈ మేరకు కన్పించడంలేదు. మరో మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తామంటున్నారు. పనులిలా జరిగితే అది సాధ్యమా అన్నదే ప్రశ్న. - న్యూస్‌టుడే, మెళియాపుట్టి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని