logo

చెక్‌పోస్టుల వద్ద నిఘా కన్ను..!

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల చెక్‌ పోస్టుల వద్ద నిఘా కెమెరాలు ఏర్పాటుచేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై పన్నును ఒకటి నుంచి రెండు శాతానికి పెంచి వసూలు చేస్తున్నారు.

Published : 30 Sep 2022 06:32 IST

ఆమదాలవలసలోని మార్కెట్‌ కమిటీ చెక్‌ పోస్టు

న్యూస్‌టుడే, పొందూరు, పాతపట్నం: వ్యవసాయ మార్కెట్‌ కమిటీల చెక్‌ పోస్టుల వద్ద నిఘా కెమెరాలు ఏర్పాటుచేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులపై పన్నును ఒకటి నుంచి రెండు శాతానికి పెంచి వసూలు చేస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తులు పన్ను వసూళ్లలో పారదర్శకత పెంపునకు ఏయే వాటి వద్ద వీటిని ఏర్పాటుచేయాలనే దానిపై సమగ్ర సర్వే చేస్తున్నారు. జాతీయ, రాష్ట్రీయ రహదారుల చెంతనున్న వాటి నుంచే ఆదాయం అధికంగా వస్తున్న తరుణంలో అక్కడి నుంచే సీసీ కెమెరాల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్నారు. జిల్లాలోని అన్ని చెక్‌పోస్టుల్లో వీటిని అమర్చనున్నారు. ఇప్పటికే టోల్‌గేట్‌ పరిధిలో ఉన్న మడపాం, ఇచ్ఛాపురం, ఎచ్చెర్ల వద్ద ఉన్న వాటిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. మిగతా వాటిల్లో కూడా అమర్చేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

ప్రయోజనాలివీ... మార్కెట్‌ కమిటీ చెక్‌పోస్టుల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో ఎన్నో ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల పన్ను వసూళ్లతో పాటు వాటి పరిస్థితిపై నిఘా పెంచవచ్చు. జిల్లాలో వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు రహదారుల పక్కనే అధికంగా ఉండటంతో వీటి పరిధిలో రూ.లక్షల విలువ చేసే వ్యవసాయ ఉత్పత్తుల లావాదేవీలు జోరుగా సాగుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని అధికారులు నిఘా కెమెరాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ః చెక్‌పోస్టుల వద్ద నిఘా కెమెరాల ఏర్పాటుతో రుసుముల వసూళ్లలో పారదర్శకత ఉంటుంది. ః అనధికార లావాదేవీలను అరికట్టవచ్చు. ః దళారులు ఆగడాలకు పాల్పడకుండా ఉండేందుకు వీలుంటుంది. ః పనిచేసే సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చూడటం.
ప్రతిపాదనలు పంపించాం.. మార్కెట్‌ యార్డు చెక్‌పోస్టుల పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపించాం. ఇప్పటికే టోల్‌గేటు పరిధిలో ఉన్న మూడు చెక్‌పోస్టుల వద్ద ఏర్పాటుచేశాం. మిగతా చోట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నాం. వీటిని అమర్చడం ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల లావాదేవీలు, ఇతర పనుల్లో పారదర్శకత పెరుగుతుంది.

- ఎం.కాళీశ్వరరావు, మార్కెట్‌ కమిటీ ఎ.డి., శ్రీకాకుళం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని