logo

పలాస.. పేరుకే డివిజన్‌!

జిల్లాల పునర్విభజనలో పాలకొండ రెవెన్యూ డివిజన్‌ మన్యం జిల్లాలోకి వెళ్లిపోవడంతో జిల్లాలో కొత్తగా ఓ డివిజన్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ‘టెక్కలి’లో ఉన్న ఇచ్ఛాపురం నుంచి నందిగాం వరకు ఎనిమిది మండలాలను వేరుచేసి పలాస రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం ప్రకటించింది.

Published : 03 Oct 2022 02:50 IST

ఏర్పాటు కాని కార్యాలయాలు

భర్తీకాని కీలక పోస్టులు

న్యూస్‌టుడే, పలాస

డ్వామా భవనంలో తాత్కాలికంగా నడుస్తున్న ఆర్డీఓ కార్యాలయం

జిల్లాల పునర్విభజనలో పాలకొండ రెవెన్యూ డివిజన్‌ మన్యం జిల్లాలోకి వెళ్లిపోవడంతో జిల్లాలో కొత్తగా ఓ డివిజన్‌ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన వచ్చింది. ఈ నేపథ్యంలో అప్పటి వరకు ‘టెక్కలి’లో ఉన్న ఇచ్ఛాపురం నుంచి నందిగాం వరకు ఎనిమిది మండలాలను వేరుచేసి పలాస రెవెన్యూ డివిజన్‌ను ప్రభుత్వం ప్రకటించింది. తాత్కాలికంగా పరాయి పంచన ఆర్డీవో కార్యాలయం ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. మౌలిక సదుపాయాల కల్పన, అధికారులు, ఉద్యోగుల నియామకం, సొంత భవనాలు వంటివి సమకూర్చకపోవడంతో పలాస పేరుకే డివిజన్‌గా ఉండిపోయింది.

మమ.. అనిపించేశారు..
ఈ ఏడాది ఏప్రిల్‌ 4న మంత్రి సీదిరి అప్పలరాజు చేతుల మీదుగా ఆర్డీవో కార్యాలయాన్ని ప్రారంభించారు. తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఉండే డ్వామా భవనంలో ఇందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేశారు. ఇంతవరకు శాశ్వత భవనానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలూ లేవు. ఆర్డీవో కార్యాలయంతో పాటు ట్రాన్స్‌కో, ఆర్‌అండ్‌బీ, గృహనిర్మాణం, విద్య, పశుసంవర్ధక, నీటిపారుదల, అటవీ, డీఎల్‌డీవో, ఎస్సీ, బీసీ సంక్షేమం తదితర శాఖల ప్రత్యేక కార్యాలయాలు ఏర్పాటు కావాలి. ఇప్పటి వరకు వాటికి సంబంధించి ఊసే లేదు. ఇటు కార్యాలయాల ఏర్పాటుగానీ అటు అధికారులు, సిబ్బంది భర్తీగానీ జరగడంలేదు.

సదుపాయాలూ లేవాయే..
తాత్కాలిక ఆర్డీఓ కార్యాలయంలో మౌలిక సదుపాయాలు లేక అధికారులు, ఉద్యోగులతో పాటుగా కార్యాలయానికి వచ్చే ప్రజలకు అవస్థలు తప్పడంలేదు. తాగునీటి వ్యవస్థ, మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవటంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయ నిర్వహణకు ప్రభుత్వం నుంచి ఒక్క పైసా కూడా నిధులు ఇవ్వకపోవటంతో జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో రూ.10 లక్షలు కేటాయించారు. కార్యాలయంలో వసతుల కల్పనకు శ్రీకారం చుట్టినా తాగునీరు, మరుగుదొడ్లు, ప్రహరీ నిర్మాణాలకు నిధుల లేమి పీడిస్తోంది. వాహనాలు నిలిపేందుకు, ప్రజలు నిరీక్షించేందుకు కనీసం షెల్టర్లు కూడా లేవు. ఆరుబయటే వాహనాలు నిలుపుదల చేయాల్సి వస్తోంది. కార్యాలయానికి సింగిల్‌ ఫేస్‌ విద్యుత్తు సరఫరా చేస్తుండటంతో నిత్యం లోవోల్టేజి, సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది. త్రీఫేజ్‌ విద్యుత్తు సరఫరా కోసం విన్నవించినా నేటికీ సమకూరక ఇన్వర్టర్లతోనే కాలం వెళ్లదీయాల్సి వస్తోంది.

ఎవరూ లేకపోవడంతో..
ఆర్డీవో కార్యాలయంలో ఆర్డీఓతోపాటు డీఏవో, డీఐవో, ఈడీఎం, డీఎస్‌డీవో, ముగ్గురు సీనియర్‌ అసిస్టెంట్లు, ఆరుగురు చొప్పున జూనియర్‌ అసిస్టెంట్లు, అడెండర్లు, ఇద్దరు కంప్యూటర్‌ ఆపరేటర్లు ఉండాలి. ప్రధానమైన డివిజనల్‌ అడ్మినిస్ట్రేషన్‌ అధికారి పోస్టే ఖాళీగా ఉంది. దీంతో కింది స్థాయి ఉద్యోగులు, అధికారులపై పనిభారం పడుతోంది. వీరితో పాటుగా డీఎస్‌డీవో, జూనియర్‌ అసిస్టెంట్లు, అటెండర్లను నియమించాల్సి ఉంది. వాచ్‌మేన్‌ కూడా లేకపోవటంతో రాత్రివేళ మందుబాబులకు అడ్డాగా మారుతోంది.

దస్త్రాలను భద్రపరిచేదెలా..
ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటై 6 నెలలు కావస్తుండటంతో అధికార యంత్రాంగం పలాస డివిజన్‌కు చెందిన దస్త్రాలను టెక్కలి నుంచి తరలించారు. 8 మండలాలతో పాటుగా, పలాస, ఇచ్ఛాపురం పురపాలక సంఘాలకు చెందిన ప్రాముఖ్యత కలిగిన దస్త్రాలకు సరైన రక్షణ లేకుండా పోతోంది. కార్యాలయానికి ప్రహరీ లేకపోవటం, రాత్రి వేళల్లో భద్రత లేకపోవడంతో విలువైన దస్త్రాల రక్షణ అధికారులు, ఉద్యోగులకు ఇబ్బందికరమవుతోంది.

ఇబ్బంది లేకుండా నిర్వహణ
-టి.సీతారామమూర్తి, ఆర్డీఓ, పలాస

వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలకు ఇబ్బంది లేకుండా సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నాం. సొంత కార్యాలయ భవనం, సిబ్బంది నియామకం తదితర విషయాలు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వస్తే స్థలం సేకరించి నూతన కార్యాలయం కోసం చర్యలు తీసుకుంటాం. మౌలిక సదుపాయాల కల్పనపైనా దృష్టి సారించాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని