logo

ఈ-క్రాప్‌ ధ్రువీకరణలో వెనుకబాటు

పలాస మండలంలో మొత్తం 11,213 మంది రైతులు 12,992 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశారు. ఇప్పటివరకూ గ్రామ వ్యవసాయ సహాయకులు 8,420 ఎకరాలకు ఈ క్రాప్‌ చేశారు. ఇందులో కేవలం 271 ఎకరాలకు సంబంధించిన 175 మంది రైతులకు మాత్రమే ఈ-కేవైసీ పూర్తయింది. ఇంకా 11,038 మంది ఈ-కేవైసీ పెండింగులో ఉంది.

Published : 03 Oct 2022 02:50 IST

నేటితో ముగియనున్న గడువు

పలాస మండలంలో మొత్తం 11,213 మంది రైతులు 12,992 ఎకరాల్లో వివిధ పంటలు సాగుచేశారు. ఇప్పటివరకూ గ్రామ వ్యవసాయ సహాయకులు 8,420 ఎకరాలకు ఈ క్రాప్‌ చేశారు. ఇందులో కేవలం 271 ఎకరాలకు సంబంధించిన 175 మంది రైతులకు మాత్రమే ఈ-కేవైసీ పూర్తయింది. ఇంకా 11,038 మంది ఈ-కేవైసీ పెండింగులో ఉంది.

ఈ-క్రాప్‌ ధ్రువీకరణలో కంచిలి: గోకర్ణపురంలో రైతులతో ఈ-కేవైసీ చేయిస్తున్న సిబ్బంది

ఈనాడు డిజిటల్‌, శ్రీకాకుళం: అన్నదాతలకు విత్తనాల నుంచి పంట అమ్మకం వరకూ అన్నిటికీ ప్రభుత్వం ఈ-క్రాప్‌ నమోదుతో ముడిపెట్టింది. ఇందుకు గ్రామ వ్యవసాయ సహాయకులతో పాటు గ్రామ రెవెన్యూ అధికారికి జాయింట్ అజమాయిషీ ఇచ్చారు. వీరి ధ్రువీకరణకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. కానీ అథెంటికేషన్‌ పూర్తయ్యేలా కనిపించడం లేదు. గడువు పొడిగిస్తారా అనే దానిపైనా స్పష్టతలేదు. వీఏఏ తర్వాత వీఆర్వో ధ్రువీకరణ పూర్తయితేనే ఈక్రాప్‌ బుకింగ్‌ పూర్తిస్థాయిలో జరిగినట్లు లెక్క. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయి సిబ్బంది మెరుపు వేగంతో పనిచేయాల్సి ఉంది.

తప్పని జాప్యం
జిల్లా మొత్తం మీద 3.75 లక్షల మంది రైతులు పంటలు సాగుచేస్తున్నారు. వీరందరికీ ఈకేవైసీ పూర్తిచేయాలి. ఆయా పంటలు సాగు చేస్తున్నది తామేనని చెప్పుకోవడమే దీని ఉద్దేశం. దీనికి ఈనెల 10 వరకూ సమయం ఉన్నా... ఇప్పటివరకు 2.5 శాతమే ఈకేవైసీ పూర్తయింది. ఈక్రాప్‌ జరిగినా ఈకేవైసీ పూర్తికాకపోతే రైతులకు ఇబ్బందులు తప్పవు.

వెనుకబడిన మండలాలు ఇలా...
వీఏఏ ధ్రువీకరణలో జలుమూరు, పలాస, జి.సిగడాం, పాతపట్నం, నందిగాం, కొత్తూరు, టెక్కలి, హిరమండలం, కోటబొమ్మాళి, రణస్థలం మండలాలు వెనుకబడ్డాయి. ఇవన్నీ 80 శాతం లోపే ఉన్నాయి. జలుమూరు, పలాస, జీ.సిగడాం మండలాలయితే 70 శాతం కూడా దాటలేదు. వీఆర్వో ధ్రువీకరణ అత్యల్పంగా కొత్తూరులో 26 శాతం, లావేరు 34 శాతం, జలుమూరు 38, పలాస 38, జి.సిగడాం 39 శాతం మేరకే పూర్తయింది.

నమోదుపై సామాజిక తనిఖీ
కొందరు సిబ్బంది క్షేత్రస్థాయికి వెళ్లి పంటను చూసి ఈక్రాప్‌ బుకింగ్‌ చేశారు. ఇంకొందరు మాత్రం కార్యాలయాల్లోనే కూర్చుని బుకింగ్‌లు పూర్తిచేశారు. దీనివల్ల కొన్ని తప్పులు దొర్లే అవకాశం లేకపోలేదు. ఏ రైతు ఏ పంట వేసినట్లు ఈక్రాప్‌లో బుక్‌ చేశారు అనే అంశాన్ని రైతులే స్వయంగా తెలుసుకోవచ్చు. ఈనెల 11 నుంచి గ్రామ సచివాలయాల్లో లేదా ఆర్బీకేల్లో ఈ వివరాలు అందుబాటులో ఉంచనున్నారు. అక్కడి నుంచి ఏడు రోజుల పాటు రైతుల నుంచి అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిని పరిశీలించి మార్పులు, చేర్పులు చేస్తారు. తుది జాబితాను అక్టోబరు 31న ప్రదర్శిస్తారు.

లక్ష్యం మేరకు పూర్తి చేస్తాం
- కె.శ్రీధర్‌, జేడీఏ

సర్వర్‌ సమస్యల వల్ల జాప్యం జరుగుతోంది. సెప్టెంబరు 30 అర్ధరాత్రితో ఈక్రాప్‌ గడువు ముగిసింది. వీఏఏ, వీఆర్వో ధ్రువీకరణ సోమవారంతో ముగుస్తుంది. నమోదు చేసేది సిబ్బందే కాబట్టి ధ్రువీకరణకు ఎక్కువ సమయం పట్టదు. ఆ తర్వాత రైతుల ఈ-కేవైసీ పునఃప్రారంభిస్తాం. మధ్యలో కొన్ని రోజులు సర్వర్‌ సమస్య వల్ల నెమ్మదించింది. నేటి నుంచి వేగంగా జరుగుతుంది. గడువులోగా పూర్తిచేస్తాం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని