logo

రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

ఇచ్ఛాపురం పట్టణంలోని కొండివీధికి చెందిన ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఈ ప్రమాదం ఎలా సంభవించిందో తెలియలేదు.

Published : 05 Oct 2022 05:31 IST


బచ్చు పరశురామ్‌ (పాత చిత్రం)

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం పట్టణంలోని కొండివీధికి చెందిన ఓ యువకుడు ద్విచక్ర వాహనంపై వెళ్తూ ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఈ ప్రమాదం ఎలా సంభవించిందో తెలియలేదు. పట్టణ ఎస్సై కె.గోవిందరావు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బచ్చు పరశురామ్‌(22) ఇంటర్మీడియట్‌ పూర్తిచేసి, తండ్రి పాపారావు, తల్లి హేమలకు వ్యాపారంలో సహాయపడుతున్నాడు. సోమవారం బ్రహ్మపుర వెళ్లేందుకు తన ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. రాత్రి పట్టణ పొలిమేరల్లోని సినీ ధియేటర్‌ వద్ద రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో పడి ఉన్న అతడిని అటుగా వచ్చినవారు చూసి తమ ద్విచక్ర వాహనంపై ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి తరలించారు. తల, చేతులు, గుండెపై తీవ్ర గాయాలతో ఉన్న అతడికి ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం బ్రహ్మపుర ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా పరిస్థితి విషమించడంతో మంగళవారం వేకువ జామున విశాఖపట్నానికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.


కోనేరులో పడి వ్యక్తి మృతి

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: పలాసలోని ముత్యాలమ్మ కోనేరు (నెహ్రూ పార్కు)లో మంగళవారం జారిపడి ఓ వ్యక్తి(40) మృతి చెందాడు. స్థానిక సీఐ శంకరరావు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలికి చెందిన బొమ్మాళి మధు గత కొన్నాళ్లుగా పలాసలో ఉంటున్నాడు. కోనేరులో స్నానానికి దిగి జారి పడటంతో మృతి చెందాడు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు సీఐ తెలిపారు.


రైలు ఢీకొని వృద్ధురాలు..

కాశీబుగ్గ, న్యూస్‌టుడే: పలాస మండలం కిష్టుపురం సమీపంలో మంగళవారం రైలు ఢీకొని వృద్ధురాలు(70) మృతి చెందింది.  జీఆర్పీ హెచ్‌సీ కోదండరావు తెలిపిన వివరాల ప్రకారం.. నందిగాం మండలం పెద్దలవునిపల్లికి చెందిన ఎస్‌.రాజేశ్వరి కిష్టుపురంలోని తన కుమార్తె మహలక్ష్మి ఇంటిలో గత మూడు నెలలుగా ఉంటుంది. ఉదయం బహిర్భూమికి వెళ్లగా రైలు ఢీకొనడంతో మృతి చెందింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని