logo

చేతల్లో ఆ ఊపేది?

ఉద్దానం ప్రాంతంలోని 807 కిడ్నీ వ్యాధి పీడిత గ్రామాలకు వంశధార జలాలు అందించాలనే ఉద్దేశంతో రూ.700 కోట్లతో చేపడుతున్న మెగాతాగునీటి పథకం పనులు సాగుతూనే ఉన్నాయి.

Updated : 28 Nov 2022 06:04 IST

మెగా తాగునీటి పథకం పనులు వెనక్కి
ఇలాగైతే ఇంకా కొద్ది నెలలు ఆగాల్సిందే..


మెళియాపుట్టి వద్ద నిర్మాణంలో ఉన్న ప్రధాన నీటి శుద్ధి కేంద్రం ఇది. దీని నిర్మాణం ఇప్పటికే పూర్తయి ఉండాలి. కానీ ఇక్కడ ఇంకా కొన్ని పనులు పురోగతిలో ఉన్నాయి. విద్యుత్తు పనులు ఇంకా మొదలవనేలేదు. ప్రధాన పైపులైను పలు ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉంది.


ఉద్దానం ప్రాంతంలోని 807 కిడ్నీ వ్యాధి పీడిత గ్రామాలకు వంశధార జలాలు అందించాలనే ఉద్దేశంతో రూ.700 కోట్లతో చేపడుతున్న మెగాతాగునీటి పథకం పనులు సాగుతూనే ఉన్నాయి. అధికారులు ఇదిగో అదిగో అంటున్నా వెనక్కిపోతూనే ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనుల తీరు పరిశీలిస్తే ట్రయల్‌ రన్‌ నిర్వహించాలన్నా కనీసం మరో రెండు, మూడు నెలల సమయం పడుతుందని నిపుణులు అంటున్నారు.

న్యూస్‌టుడే, పాతపట్నం, హిరమండలం, మెళియాపుట్టి, వజ్రపుకొత్తూరు

అధికారులు చెబుతున్నా..: డిసెంబరు నెలాఖరుకు అనంతగిరి, కేదారిపురం క్లస్టర్ల పరిధిలోని సుమారు 136 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేస్తామని అధికారులు ప్రకటించినా అది అసాధ్యమే. తాజాగా అధికారులు జనవరి మొదటి వారంలో ట్రయల్‌ రన్‌ నిర్వహిస్తామంటున్నా.. అదీ సాధ్యమయ్యేలా కన్పించడంలేదు. హిరమండలం వద్ద ప్రధాన రెగ్యులేటరీ, రివర్‌క్రాసింగ్‌ తదితర పనులు కొనసాగుతూనే ఉన్నాయి. మెళియాపుట్టి వద్ద నీటి శుద్ధి యంత్రం అమరిక, ప్రధాన పైపులైన్ల నిర్మాణ పనులు ఊపందుకోవాల్సి ఉంది. మెళియాపుట్టి నుంచి కొరసవాడ వరకు 15 కిలోమీటర్లు కాగా ఇంకా నాలుగు కిలోమీటర్లకు పైగా పైపులైన్లు వేయాల్సి ఉంది. ఇలా పలు ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్నాయి.

సాగుతున్నాయి...: హిరమండలం వద్ద వంశధార రిజర్వాయర్‌ నుంచి నుంచి నీటిని తీసుకుని పాతపట్నం మీదుగా మెళియాపుట్టి తరలించి అక్కడ శుద్ధిచేసి ఉద్దానం ప్రాంతానికి సరఫరా చేయాల్సి ఉంది. హిరమండలంలో ప్రధాన హెడ్‌ రెగ్యులేటరీ నుంచి పాతపట్నం మండలం కాగువాడ కొండపై ఉన్న సంప్‌వెల్‌కు మోటార్ల ద్వారా పంపింగ్‌ జరుగుతుంది. అక్కడి నుంచి గ్రావిటీ ఫోర్స్‌తో మెళియాపుట్టిలో ఉండే నీటి శుద్ధి కేంద్రానికి నీరు వెళుతుంది. శుద్ధి అనంతరం ఉద్దానం ప్రాంతంలోని ఆయా క్లస్టర్లకు తాగునీటిని పైప్‌లైన్‌ ద్వారా అందిస్తారు. ప్రస్తుతం పైప్‌లైన్‌, హెడ్‌ రెగ్యులేటరీ, నీటిశుద్ధి యంత్రాల అమర్చాల్సి ఉంది. హిరమండలం నుంచి కాగువాడ వరకు పైప్‌లైన్‌ నిర్మాణ పనులు పూర్తిచేశారు. పాతపట్నం, తిడ్డిమి, మామిడిగుడ్డి, సుందరాడ, సిరియాకండి గ్రామాల్లో పైప్‌లైన్‌ పనులు చేపడుతున్నారు. మెళియాపుట్టిలో ఉన్న నీటి శుద్ధి యంత్రాలను ఇంకా అమర్చాల్సి ఉంది. విద్యుదీకరణ పనులు చేపట్టాల్సి ఉంది. ఇవన్నీ పూర్తయితేనే వంశధార నీరు ఉద్దానం తలుపుతట్టేది.

అక్కడా అంతే..

మొదటి దశలో అనంతగిరి, కేదారపురం క్లస్టర్ల పరిధిలోని 136 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయాలనేది అధికారుల ప్రయత్నం. మరి అక్కడైనా పనులు పూర్తయ్యాయా అంటే అవీ అరకొరగానే ఉన్నాయి. వజ్రపుకొత్తూరు మండలంలోని అనంతగిరి క్లస్టర్‌ కింద 23 ట్యాంకులు, కేదారిపురం క్లస్టర్‌ ద్వారా ఒక ట్యాంకు, మామిడిమెట్టు క్లస్టర్‌ ద్వారా 15 ట్యాంకులు నిర్మాణం చేపట్టగా.. దేవునల్తాడ, గుణుపల్లి వాటర్‌ ట్యాంకులు నిర్మాణం, చాలా గ్రామాల్లో పైపు లైను పనులు సైతం పూర్తి కాలేదు. బెండికొండపై ప్రధాన ట్యాంకు నిర్మాణం చేపట్టి వదిలేశారు. ట్యాంకు నుంచి నీటిని తీసుకునేందుకు పైపులైన్లు నిర్మించాల్సి ఉంది.

పనులు వేగవంతం చేస్తున్నాం

ఉద్దానం తాగునీటి పథకం పనులు వేగవంతం చేస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి మాసంలో ఉద్దానం ప్రాంతంలోని అనంతగిరి, కేదారిపురం క్లస్టర్‌లకు తొలి విడతలో నీటిని అందించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా నిర్మాణ పనుల్లో వేగం పెంచడం జరిగింది. జనవరి మొదటి వారంలో ట్రయల్‌రన్‌ నిర్వహించి, నెలాఖరు నాటికి నీటిని విడుదల చేస్తాం.

జాన్‌ బెన్హర్‌, ఈఈ, ఉద్దానం ప్రాజెక్టు


పాతపట్నం వద్ద అరకొరగా ప్రధాన పైప్‌లైన్‌ పనులు

వంశధార వద్ద రివర్‌క్రాసింగ్‌ పనులను నవంబరు 20 నాటికి పూర్తిచేయాలి. ఈ ఏడాది డిసెంబరు నెలాఖరుకు మొదటి రెండు క్లస్టర్ల పరిధిలోని సుమారు 136 గ్రామాలకు తాగునీటిని సరఫరా చేయడమే లక్ష్యం. నిర్దిష్ట గడువులోగా పనులు పూర్తి చేయకపోయినా, నిర్లక్ష్యం చేసినా శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం.

శ్రీకేష్‌ బి.లఠ్కర్‌, కలెక్టర్‌ (ఈ ఏడాది అక్టోబరు 22న ప్రాజెక్టు ఇంజినీర్లు,గుత్తేదారులతో జరిగిన సమావేశంలో..)

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని