logo

నీరుగారిపోతోంది..!

సాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతూ, వర్షాధార భూముల్లో సాగుచేసే రైతన్నలకు సాయపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జలకళ పథకాన్ని తీసుకొచ్చింది.

Published : 29 Nov 2022 06:07 IST

పూర్తిస్థాయిలో వేయని జలకళ బోర్లు
వేసిన వాటికి ఇవ్వని విద్యుత్తు కనెక్షన్లు

-న్యూస్‌టుడే, రణస్థలం

జేఆర్‌పురం రెవెన్యూ పరిధిలో ఇలా..

సాగునీటి సౌకర్యం లేక ఇబ్బందులు పడుతూ, వర్షాధార భూముల్లో సాగుచేసే రైతన్నలకు సాయపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జలకళ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా అర్హత గలవారికి ఉచితంగా బోర్లు వేసి, విద్యుత్తు కనెక్షన్లు ఇస్తారు. ఐదెకరాల లోపు భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఇందుకు అర్హులు. దీంతో పాటు ఒకే ప్రాంతంలో రెండున్నర ఎకరాల భూమి ఉండాలనే నిబంధన ఉంది. జిల్లాలో అర్హత కలిగిన రైతులంతా దరఖాస్తు చేసుకున్నారు. కానీ ఈ పథకం ఆదిలోనే నీరుగారుతోంది. లబ్ధిదారుల్లో అధికశాతం మందికి బోర్లే వేయలేదు. కొంతమందికి వేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ విద్యుత్తు కనెక్షన్లు ఇవ్వలేదు. 

జిల్లా వ్యాప్తంగా 5,718 మంది రైతులు దరఖాస్తు చేసుకోగా 4,698 మందిని అధికారులు అర్హులుగా గుర్తించారు. వీరి దరఖాస్తులు డ్రిల్లింగ్‌ గుత్తేదార్లకు అప్పగించారు. జియాలజిస్టులు ద్వారా సర్వే చేయించి ఎవరెవరికి బోర్లు వేయాలో ఎక్కడెక్కడ నీరు పడుతుందో నిర్ధారించి నివేదిక అందజేయాల్సి ఉంది. ఇలా 1207 బోర్లకు జియోలాజికల్‌ సర్వే చేయగా అందులో 1010 బోర్లకు నీరు పడుతుందని డ్వామాకు నివేదిక ఇచ్చారు. అనంతర ప్రక్రియలో 765 దరఖాస్తులు ఆమోదించి మంజూరు చేశారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కేవలం 246 బోర్లు మాత్రమే వేశారు.

* విద్యుత్తు కనెక్షను, బోరు డ్రిల్లింగ్‌కు కలిపి ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరిస్తుందని తొలుత చెప్పారు. ఆ తర్వాత రూ.2 లక్షలు దాటితే తర్వాత అయ్యే వ్యయం అంతా రైతులే  పెట్టుకోవాలనే నిబంధన పెట్టారు. ఈ మేరకు జిల్లాలో డ్రిల్లింగ్‌ చేసిన 13 బోర్లకు విద్యుత్‌ కనెక్షన్లు వేశారు. వాటికి అయిన ఖర్చు విద్యుత్తు శాఖకు చెల్లించకపోవడంతో మిగిలిన వాటికి కనెక్షన్లు ఇవ్వలేదు. అప్పటి నుంచి డ్రిల్లింగు చేసిన బోర్లు అలానే దర్శనమిస్తున్నాయి.  

ఇదీ సమస్య..

ఇప్పటివరకు వేసిన వాటిలో పదమూడింటికే విద్యుత్తు సరఫరా ఇవ్వడంతో మిగిలినవన్నీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయి. వాటికి ప్రభుత్వం కనెక్షన్లు ఇస్తుందో లేదో తెలియదు. రైతులు సొంత డబ్బులతో వేసుకుందామంటే విద్యుత్తు శాఖ నిబంధనలు, అధిక మొత్తంలో ఖర్చు భరించలేక వెనకడుగు వేస్తున్నారు. కనెక్షన్లు ఇవ్వాలంటే ట్రాన్స్‌ఫార్మరు అందుబాటులో ఉందా లేదా, స్తంభాలెన్ని పడతాయి, 11 కేవీలైను అందుబాటులో ఉందా లేదా అనే అంశాలను పరిశీలించి ఎంతమేర ఖర్చవుతుందో అంచనా వేసి రైతులకు తెలియజేయాలి. ఆ దిశగా ఇప్పటి వరకు ప్రయత్నాలేవీ జరగలేదు.  

ఏడాదిన్నర అయ్యింది..

జలకళ పథకంలో వ్యవసాయ బోరువేసి ఏడాదిన్నరైంది. ఇంతవరకు విద్యుత్తు కనెక్షన్‌ ఇవ్వలేదు. అప్పట్లో ప్రభుత్వమే ఇస్తామంది. ఇప్పుడు లేదంటున్నారు. సొంతంగా ఖర్చుపెట్టి వేసుకోలేం. ఇప్పుడు వేసిన బోరు పరిధిలో నలుగురు రైతులకు చెందిన ఐదెకరాలు ఉంది అందరం పేద రైతులమే. ప్రభుత్వం బోరు వేసినా ఉపయోగం లేకుండా పోయింది.
- మంత్రి పార్వతి, మహిళారైతు, కొండములగాం

గుత్తేదారులకు చెప్పాం..

అనుమతి పొందిన బోర్లన్నీ డ్రిల్లింగ్‌ చేయాలని గుత్తేదారులకు చెప్పాం. విద్యుత్‌ కనెక్షన్లు ప్రభుత్వం ఇవ్వదు. రైతులే భరించాలి. అందుకు విధి విధానాలు త్వరలో ప్రభుత్వం ఖరారు చేస్తుంది.

-జీవీ చిట్టిరాజు, డ్వామా పీడీ, శ్రీకాకుళం

 

                  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని