logo

ఉలుకూ..పలుకూ లేదు..!

ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం, ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న నేపథ్యంలో మండల కేంద్రాలకు భారీగా సిమెంట్‌, ఇసుక నిల్వలు వస్తున్నాయి

Published : 29 Nov 2022 06:16 IST

అదనపు ఇసుక, సిమెంటు వినియోగంపై ఇప్పటికీ తేల్చని అధికారులు
న్యూస్‌టుడే, ఎత్తురాళ్లపాడు (కోటబొమ్మాళి)

కొత్తపేటలో అసంపూర్తిగా సచివాలయం, ఆర్బీకే భవన నిర్మాణం

ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం, ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న నేపథ్యంలో మండల కేంద్రాలకు భారీగా సిమెంట్‌, ఇసుక నిల్వలు వస్తున్నాయి. కానీ కేటాయించిన సామగ్రి, వినియోగానికి సంబంధించి మండల అధికారుల వద్ద పూర్తి వివరాలు ఉండటం లేదు. ఇందుకు ఉదాహరణ కోటబొమ్మాళి మండలమే. ఇక్కడ ఇసుక, సిమెంటు సరఫరా అయిన స్థాయిలో నిర్మాణాలు జరగకపోవడం గమనార్హం. అయినా అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.

సమాచారం ఇవ్వలేక..!

కోటబొమ్మాళి మండలంలో ఉపాధి పథక నిధులతో 27 సచివాలయాల భవనాల నిర్మాణాలను ప్రారంభించారు. వీటిలో 17 నిర్మాణాలను పంచాయతీరాజ్‌శాఖ, మరో పదింటి పనులను గ్రామీణ నీటిసరఫరా శాఖ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వీటిలో కొత్తపేట, జర్జంగి 1, 2 సచివాలయాల పరిధిలోని 9, హరిశ్చంద్రపురంలోని ఒక భవనం పనులను ఓ గుత్తేదారుకు అప్పగించారు. వాటి నిర్మాణాలకు ఎంత సిమెంటు, ఇసుక వచ్చాయనేది ఎంపీడీవో అడిగినా పైరెండు శాఖల అధికారులు సమాచారం ఇవ్వలేకపోతున్నారు.

కొత్తపేట, జర్జంగి, హరిశ్చంద్రపురంలో పరిధిలోని పది భవనాల నిర్మాణానికి 4,600 సిమెంట్‌ బస్తాలు, వెయ్యి టన్నుల ఇసుకను గుత్తేదారుకు అదనంగా ఇచ్చినట్లు ఎంపీడీవో ఫణీంద్రకుమార్‌ గుర్తించారు. సామగ్రి నిల్వలున్నా ఆయా భవనాల పనులు అసంపూర్తిగా నిలిచిపోయాయి. జర్జంగి-2 పరిధిలోని శ్రీజగన్నాథపురంలో అసంపూర్తి భవనాలపై గ్రామస్థులు జిల్లా కేంద్రంలో జరిగిన ‘స్పందన’ కార్యక్రమంలో కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈ వ్యవహారంపై ‘ఈనాడు’లో అక్టోబరు 13న ‘కట్టారా... కొట్టేశారా...!’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై స్పందించిన ఎంపీడీవో అదేరోజు కలెక్టర్‌ నుంచి వచ్చిన స్పందన ఫిర్యాదు, ‘ఈనాడు’ కథనాన్ని జత చేసి పంచాయతీరాజ్‌, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులకు నోటీసులు పంపారు. ‘‘ప్రాధాన్యత గల పది భవనాల పనులు చాలా రోజులుగా నిలిచిపోయాయి. సదరు గుత్తేదారు సైతం స్పందించడం లేదు. గుత్తేదారుడిని మార్చి, నిర్మాణాలను పునరుద్ధరించాలి. అందుకు భవనాల వారీగా గుత్తేదారుకు కేటాయించిన సిమెంటు, ఇసుక.. వినియోగించిన సామగ్రి వివరాలను వీలైనంత త్వరగా అందజేయాలి’’ అని అందులో పేర్కొన్నారు.

అధికారుల బదిలీలతో..

మండలంలోని పంచాయతీరాజ్‌ విభాగంలో మూడు నెలల వ్యవధిలో ముగ్గురు అధికారులు మారారు. గత నెల 13న ఎంపీడీవో పంపిన నోటీసుపై గ్రామీణ నీటి సరఫరా శాఖ జేఈ ప్రజ్ఞశ్రీ సంతకం చేశారు. అక్కడికి రెండు రోజుల్లోనే ఆమె బదిలీపై వెళ్లిపోయారు. కొత్త జేఈ విధుల్లో చేరారు. పీఆర్‌ కార్యాలయంలో ఈ పనులు చూస్తున్న వర్క్‌ఇన్‌స్పెక్టర్లు విధుల్లో ఉన్నా ఇప్పటికీ సమాచారం ఇవ్వలేదు. జిల్లా కలెక్టర్‌ నుంచి వచ్చిన ‘స్పందన’ అర్జీని పంపినా సంబంధిత శాఖల నుంచి ఉలుకూ, పలుకూ లేకపోవడం గమనార్హం.

ఇంతవరకు ఇవ్వలేదు..: సచివాలయాలకు కేటాయించిన సిమెంట్‌, ఇసుక వివరాలను ఇవ్వాలని గత నెలలో పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులను అడిగినా ఇప్పటివరకు సమాధానం రాలేదు. జర్జంగి 1, 2, కొత్తపేట, హరిశ్చంద్రపురాలకు సంబంధించిన వివరాలూ ఇవ్వలేదు. అదే నెల 23న మరోసారి ఆ సామగ్రి వివరాలివ్వాలని అధికారికంగా కోరినా సమాధానం రాలేదు. వారి నుంచి సమాధానం వచ్చిన తర్వాత పూర్తి వివరాలతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాను. మరోవైపు బదిలీపై వెళ్లిన అధికారులు కొత్తగా వచ్చినవారికి ఛార్జీల (లావాదేవీల) వివరాలు ఇవ్వలేదు.  
- కె.ఫణీంద్రకుమార్‌, ఎంపీడీవో, కోటబొమ్మాళి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని