logo

అక్రమాలకు హద్దులు చెరిపేశారు..!

కలపతో చేసిన గృహోపకరణాలకు మంచి ఆదరణ ఉంది. దీంతో బహిరంగ మార్కెట్లో దీనికి డిమాండ్‌ పెరుగుతోంది.

Published : 30 Nov 2022 05:57 IST

యథేచ్ఛగా అటవీ కలప రవాణా

మెళియాపుట్టిలోని మహేంద్రతనయ నది చెంత తరలించేందుకు సిద్ధం చేసిన కలప

న్యూస్‌టుడే, మెళియాపుట్టి, పాతపట్నం: కలపతో చేసిన గృహోపకరణాలకు మంచి ఆదరణ ఉంది. దీంతో బహిరంగ మార్కెట్లో దీనికి డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాలకు ఆనుకొని ఉన్న అటవీ ప్రాంతాల నుంచి టేకు, మద్ది, మామిడి, నేరేడు, తదితర చెట్లను నరికి కలపగా మార్చి అక్రమంగా ఇతర ప్రాంతాలకు అక్రమార్కులు తరలించి విక్రయించుకుంటూ రూ.లక్షల్లో ఆదాయం పొందుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే భారీ వృక్షాలను సైతం కూల్చేస్తున్నారు. అటవీ, రెవెన్యూ, పోలీసుల నిఘాకు కళ్లుకప్పి అక్రమ దందాకు పాల్పడుతున్నారు.  

కలప వినియోగం పెరగడంతో అక్రమ రవాణా రోజురోజుకు తీవ్రమతోంది. అధికారులు నిఘా పెడుతున్నామని చెబుతున్నా ఈ రవాణా మాత్రం యథేచ్ఛగా సాగుతోంది. సరిహద్దు ప్రాంతాలైన మెళియాపుట్టి నుంచి టెక్కలి జాతీయ రహదారి, పాతపట్నం నుంచి మెళియాపుట్టి, గారబంద, (ఒడిశా), గొప్పిలి మీదుగా పలాస, మందస, సోంపేట మండలాలకు, పాతపట్నం నుంచి తెంబూరు, బొంతు కూడలి మీదుగా టెక్కలి, చల్లపేట టింబరు డిపోలకు తరలిస్తుంటారు. రాత్రివేళల్లో, సెలవు దినాల్లోనే అక్రమార్కులు ఈ కార్యకలాపాలు సాగిస్తున్నారు. పాతపట్నం, మెళియాపుట్టి, మందస, సోంపేట, సారవకోట, జలుమూరు, కొత్తూరు, ఎల్‌ఎన్‌పేట మండలాలు కేంద్రాలుగా రవాణా, కలప కోత, వస్తువుల తయారీ ఎక్కువగా జరుగుతున్నాయి.

నిఘా ఏదీ..  

ఇటీవల పాతపట్నం మండల పరిధిలోని ఓ టింబర్‌ డిపో నుంచి సోంపేటకు రాత్రి సమయంలో దర్జాగా లారీలో కలప రవాణా జరిగింది. మెళియాపుట్టిలోని మహేంద్రతనయ సమీపంలో భారీగా కలపను లారీలో లోడ్‌ చేసి తరలించారు. ఈ విషయం అటవీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా తెలియదంటూ దాటవేశారు. తాజాగా మహేంద్రతనయ చెంత భారీ వృక్షాలను కలపగా మార్చి తరలించేందుకు సిద్ధం చేశారు. పాతపట్నం, కొత్తూరు, మెళియాపుట్టి, హిరమండలం, టెక్కలి, పలాస, మందస, సారవకోట, జలుమూరుల్లో టింబరు డిపోలు(సా మిల్లులు), కలప కోత యంత్రాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. వీటిపై అటవీ అధికారుల నిఘా కొరవడింది. వీటికి వస్తున్న కలపలో సగం సక్రమమైతే.. మిగిలిన సగం అక్రమమేనని తెలుస్తోంది.

సిబ్బంది సహకారంతోనే..

అక్రమార్కులకు మామూళ్లకు అలవాటు  పడిన సిబ్బంది తోడవ్వడంతో అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. అటవీశాఖకు చెందిన కొందరు పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది కిందిస్థాయి సిబ్బంది సమాచారంతోనే అక్రమార్కులు అప్రమత్తమవుతున్నారని పలువురు చెబుతున్నారు.


కేసులు పెడుతున్నాం..
- ఆర్‌.రాజశేఖర్‌, ప్రాంతీయ అటవీ అధికారి, పాతపట్నం

పాతపట్నం అటవీ పరిధిలో సిబ్బంది కొరతతో ఇబ్బంది ఏర్పడింది. కలప అక్రమ రవాణాపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూ పట్టుబడితే కేసులు పెడుతున్నాం. కింది స్థాయి సిబ్బంది భర్తీ కోసం ఉన్నతాధికారులకు నివేదించాం.

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని