logo

బంగారం దుకాణంలో చోరీ

కోటబొమ్మాళి-సంతబొమ్మాళి రోడ్డులోని ఓ బంగారం దుకాణంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. కోటబొమ్మాళికి చెందిన బంగారు వర్తకుడు తంగుడు నాగభూషణరావు సోమవారం రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లారు.

Published : 30 Nov 2022 05:57 IST

దుకాణాన్ని పరిశీలిస్తున్న క్లూస్‌ టీం

కోటబొమ్మాళి, న్యూస్‌టుడే: కోటబొమ్మాళి-సంతబొమ్మాళి రోడ్డులోని ఓ బంగారం దుకాణంలో సోమవారం అర్ధరాత్రి చోరీ జరిగింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. కోటబొమ్మాళికి చెందిన బంగారు వర్తకుడు తంగుడు నాగభూషణరావు సోమవారం రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లారు. మంగళవారం ఉదయం వన భోజనాలకు కుటుంబసభ్యులతో కలిసి బయలుదేరారు. వెళ్లేముందు నాగభూషణరావు రెండో కుమారుడు దుకాణం వద్దకు వెళ్లి చూడగా తాళాలు విరిగిపోయి ఉన్నాయి. వెంటనే కుటుంబీకులకు, పోలీసులకు అందజేశారు. వెంటనే టెక్కలి సీఐ సూర్యచంద్రమౌళి, ఎస్‌ఐలు షేక్‌ఖాదర్‌భాషా, మధుసూదన్‌ ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరించారు. కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి మంగళవారం పోలీస్‌స్టేషన్‌ను సందర్శించి చోరీపై ఆరా తీశారు. 19 తులాల బంగారం, కొన్ని వెండి వస్తువులు, రూ.30 వేల నగదుతో పాటు మొత్తం రూ.11.60 లక్షల విలువైన వస్తువులు చోరీకి గురైనట్లు ఎస్‌ఐ షేక్‌ఖాదర్‌భాషా వివరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు.


ఆలయంలో వెండి ఆభరణాల అపహరణ

టెక్కలి పట్టణం, న్యూస్‌టుడే: టెక్కలి చేరివీధి శివారున ఊర చెరువు గట్టుపై ఉన్న రామలింగేశ్వరాలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది. ఆలయంలోకి చొరబడిన దుండగుడు తాళాలు పగలగొట్టి లోపల ఉన్న నాగాభరణం, రెండు శఠగోపాలు, రెండు పంచపాత్రలు, రెండు ఉద్ధరిణిలు, ఒక వెండిపళ్లెం సహా ఆరుకిలోల బరువున్న ఆభరణాలను ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరాలకు ఉన్న తీగలు కట్‌ చేసి హార్డ్‌డిస్క్‌ను పట్టుకుపోయాడు. ఉదయం ఆలయానికి వచ్చిన అర్చకుడు గణపతిస్వామి చోరీ విషయం గుర్తించి పెద్దలకు సమాచారం ఇచ్చారు. టెక్కలి సీఐ సూర్యచంద్రమౌళి, ఇన్‌ఛార్జి ఎస్సై మహ్మద్‌అలీ ఘటనాస్థలం పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ప్రాంతంలో రెండు రోజుల వ్యవధిలోనే రెండు చోరీలు జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని