logo

21 రోజుల్లోనే రైతు ఖాతాలో నగదు జమ

‘నూతన విధానం ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. రైతులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం.

Published : 30 Nov 2022 06:01 IST

పారదర్శకంగా ధాన్యం కొనుగోలు ప్రక్రియ  
ఒడిశా నుంచి తెస్తే మిల్లును బ్లాక్‌లిస్ట్‌లో పెడతాం
సంయుక్త కలెక్టర్‌ ఎం.నవీన్‌
న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(శ్రీకాకుళం)

‘నూతన విధానం ద్వారా ధాన్యం కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశాం. రైతులకు ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ధాన్యం సేకరించిన తరువాత సకాలంలో చెల్లింపులు చేస్తాం. ఒడిశా ధాన్యంపై కూడా నిఘా పెంచుతాం.’ అని సంయుక్త కలెక్టర్‌ ఎం.నవీన్‌ పేర్కొన్నారు. జిల్లాలో ఖరీఫ్‌ ధాన్యం కొనుగోళ్లు, రైతుల సమస్యలు తదితర అంశాలపై ‘న్యూస్‌టుడే’ ముఖాముఖిలో ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇలా..


న్యూస్‌టుడే: జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఇప్పటికీ పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయలేదు.?

జేసీ: జిల్లాలో 9 మండలాల్లో ధాన్యం సిద్ధంగా ఉంది. తొలుత ఆయాచోట్ల కొనుగోళ్లు ప్రారంభిస్తున్నాం. రైతులు వరి పంట కుప్పలు వేశారే తప్ప ఇంకా చాలాచోట్ల నూర్చలేదు. శాఖాపరంగా సిద్ధంగానే ఉన్నాం. సాంకేతిక సహాయకులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, వ్యవసాయ సహాయకులు అందుబాటులోనే ఉన్నారు.  


ఒడిశా నుంచి మిల్లర్లు సరకును అక్రమంగా తీసుకొస్తున్నారు. దీనిపై సరైన నిఘా లేదు.?

ఒడిశా ధాన్యం రాకుండా చర్యలు చేపడుతున్నాం. సరిహద్దు ప్రాంతాల్లో నిఘా పెడుతున్నాం.  తనిఖీల్లో ఏ మిల్లు దొరికినా చర్యలు తప్పవు. బ్లాక్‌ జాబితాలో పెడతాం. ఆయా మిల్లుకు కేటాయించిన ధాన్యం, ఎంత చేరింది. ఎంత చేరాల్సి ఉందనేది స్పష్టంగా తెలిసిపోతుంది.


కొనుగోలుపై రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేదు. వాలంటీరు వ్యవస్థపై వారిలో అనుమానాలు ఉన్నాయి.?

వాలంటీరు కేవలం రైతుకు సహాయకారి మాత్రమే. వారికి ఎలాంటి అధికారాలు లేవు. ఈ విషయంలో  భయపడాల్సిందేమీ లేదు.  పీపీపీ కేంద్రాల పరిధిలో  అవగాహన కల్పించాం. దళారులను నమ్మి మోసపోవద్దు.  ఏ సమస్య ఉన్నా చెప్పొచ్చు.


కొత్త విధానం కావడం, చెల్లింపులు త్వరగా జరగవని దళారులను ఆశ్రయిస్తున్నారు. దీనిపై రైతులకు మీరిచ్చే భరోసా.?

చెల్లింపుల్లో ఎలాంటి సందేహం లేదు.ప్రభుత్వం నిర్దేశించిన 21 రోజుల్లోగా కచ్చితంగా నగదు జమవుతుంది. అంతకంటే ముందుగానే వేసేందుకు కూడా ప్రయత్నిస్తాం. కొత్త విధానం కారణంగా ఆలస్యం అవుతాయనే అపోహ వద్దు.


21 రోజుల్లోనే నగదు ఖాతాలో జమ చేస్తామని చెబుతున్నారు. గతేడాది ఆరునెలలు దాటినా చెల్లింపులు జరగలేదు.?

ధాన్యానికి సంబంధించి ఎలాంటి పెండింగ్‌ లేదు. రవాణా, సంచులకు సంబంధించి కొన్ని ఉన్నాయి. ఈసారి అలాంటి ఇబ్బంది రానివ్వం. రవాణా, సంచులకు సంబంధించిన మొత్తాలను కూడా రైతు ఖాతాలో వెంటనే జమ చేస్తాం. గతానికి ఇప్పటికి చెల్లింపుల్లో మార్పులు జరిగాయి.


ఆర్బీకేల్లో ధాన్యం నిల్వ చేసే వసతుల్లేవు. సరిపడా గోదాములూ లేవు.  ఈ సమస్యలకు పరిష్కారం ఎలా.?

ఏ ఆర్బీకేల్లో వసతులు ఉన్నాయో గుర్తించాం. వాటితో పాటు పీఏసీఎస్‌, డీసీఎంఎస్‌, ఏఎంసీ, జీఈసీ స్వచ్ఛంద సంస్థలకు కొన్ని అప్పగించాం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. 371 కేంద్రాల్లో కొనుగోళ్లు జరుగుతాయి. ఇందుకు ఎ, బి, సి కేటగిరీలుగా నిర్ణయించి గోదాముల సామర్థ్యాలకు అనుగుణంగా నిల్వ చేస్తాం.


గోనె సంచుల కొరత ఉంది. తాజాగా 40 కిలోల విధానంపై రైతుల్లో వ్యతిరేకత వస్తోంది.?

గోనె సంచుల కొరత రాకుండా చర్యలు తీసుకుంటున్నాం. మిల్లర్లు, రేషన్‌ దుకాణాల నుంచి సంచులు వెనక్కి తీసుకుని వాటిని ఉపయోగిస్తాం. పౌరసరఫరాలశాఖ నుంచి ఇచ్చే 50, 40 కిలోల సంచులను వినియోగించడం లేదు.

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని