logo

ఉప్పుతో బంధం తెగిపోతోంది..!

సంతబొమ్మాళి మండలంలోని నౌపడ... ఉప్పు పరిశ్రమకు పెట్టింది పేరు.. కనుచూపుమేరలో నిత్యం పాల సముద్రాన్ని తలపించే ఉప్పు పంట.. ఈనేల తల్లిని నమ్ముకునే వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి..

Updated : 30 Nov 2022 06:24 IST

పోర్టు పేరుతో యజమానుల నుంచి భూముల స్వాధీనానికి చర్యలు
జీవనాధారం కోల్పోనున్న కార్మికులు 
న్యూస్‌టుడే, సంతబొమ్మాళి

సంతబొమ్మాళి మండలంలోని నౌపడ... ఉప్పు పరిశ్రమకు పెట్టింది పేరు.. కనుచూపుమేరలో నిత్యం పాల సముద్రాన్ని తలపించే ఉప్పు పంట.. ఈనేల తల్లిని నమ్ముకునే వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.. బ్రిటిష్‌ కాలం నుంచి నేటివరకు రైతులు, కార్మికులు ఎన్నో కష్టనష్టాలకోర్చుతూ ఉపాధి పొందుతున్నారు.. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు స్థానికులకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. భావనపాడు పోర్టుకు అనుబంధంగా ఈ భూములు తీసుకోవాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా భూముల లీజుదారులతో చర్చలు జరుపుతోంది. ఇవి సఫలమైతే వేలాది కుటుంబాలకు జీవనాధారం పోయినట్లే..

సిక్కోలు పరిధిలో వజ్రపుకొత్తూరు మండలం పూండి నుంచి ఇటు కళింగపట్నం వరకు ఉప్పు పరిశ్రమ ఉంది. భావనపాడు, మూలపేట ప్రాంతాల్లోనే దాదాపు ఐదు వేల ఎకరాలు విస్తీర్ణంలో ఉప్పు సాగవుతోంది. నౌపడ ఉప్పు పరిశ్రమకు దేశ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. బ్రిటీష్‌ కాలం నుంచి ఇక్కడ పండిస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1948 నుంచి కేంద్ర ప్రభుత్వం ఈ భూములను ఉప్పు పరిశ్రమ, ఉత్పత్తిదారులు, సన్నకారు రైతులకు లీజుకిచ్చింది. అప్పటి నుంచి ప్రతి 20 ఏళ్లకోసారి లీజు కాలపరిమితి పెంచుతూ వస్తోంది. ఈ పరిశ్రమపై ఆధారపడి దాదాపు 5 వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.


పోర్టుకు ఇచ్చేందుకే..

నౌపడ సాల్ట్‌ ఇండస్ట్రీ పరిధిలో నౌపడ, మూలపేట, భావనపాడు ప్రాంత పరిధిలోని 2,650 ఎకరాల్లో లీజు లైసెన్సు గడువు 2018 సెప్టెంబర్‌ 22వ తేదీకి ముగిసిపోయింది. దీంతో   లీజులను రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. వీటి పరిధిలో 250 మంది ఉప్పు ఉత్పత్తిదారులు, రైతులు లీజు తిరిగి పునరుద్ధించాలని హైకోర్టును ఆశ్రయించినా నిరాశే ఎదురైంది. దీంతో చిన్న, సన్నకారు రైతుల నుంచి ఆ భూములను వెనక్కి తీసుకున్నారు. కళింగ, దాస్‌ అండ్‌ పార్టనర్స్‌, గురునాథ్‌, ఎన్‌ఎస్‌, డీఅండ్‌ఆర్‌ వంటి కంపెనీల వద్ద మిగిలిన 2,186 ఎకరాల భూములకు 2027 వరకు లీజు గడువు ఉంది. అయినా వీటిని ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది.

 


వేలాది కార్మికుల సంగతేంటి..?

నవరుచుల తల్లి నౌపడ ఉప్పుగల్లీ అనేది నానుడి. తాతల కాలం నుంచి ఉప్పు పంటను గౌరవంగా, సంప్రదాయ వనరుగా, వృత్తిగా సాగిస్తూ వచ్చినవారంత నేడు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. దాదాపు రెండు వేల మంది రైతులు, కార్మికులు ఉన్నారు. గల్లీలో చదును చేయడం, అడుగు గీటు, నీరు కట్టడం, ఇసుక మోత, తీత, పట్టుబడి, ప్యాకింగ్‌ వంటి పనుల ద్వారా మహిళలకు రూ.300, పురుషులకు రూ.500 చొప్పున ఉపాధి దొరుకుతోంది. ఏటా 75 వేల టన్నుల ఉప్పు ఉత్పత్తి అవుతోంది. ఏడాది పాటు ఎగుమతులు జరుగుతాయి. వీటిలో కార్మికులకు రోజుకు రూ.100 నుంచి రూ.250 వరకు కూలీ వస్తోంది. వృద్ధులు, యువకులు, రైతులకు పని దొరుకుతుంది. రెక్కల కష్టంతో కుటుంబ అవసరాలతో పాటు పిల్లలను చదివిస్తుంటారు. ఉప్పు గల్లీ తప్ప మరో ప్రపంచం తెలియని కార్మికులు బేలచూపులు చూస్తున్నారు. ప్రభుత్వం యజమానుకుల కోణమే కాక ఉపాధి కోల్పోతున్న కార్మికుల పరిస్థితి కూడా చూడాలని కోరుతున్నారు.

 


రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఇదీ..  

భావనపాడు గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టుకు సమీపంలో ఉన్న ఈ భూములతో అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన. ఇందులో భాగంగానే ఈనెల 26న లీజుకు తీసుకున్న యాజమానులతో జిల్లా కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ సమావేశమయ్యారు. విషయాన్ని వారికి వివరించారు. యజమానులు కూడా కేటాయించిన భూములను ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అయితే కృష్ణపట్నం పోర్టుకు మాదిరిగా నష్టపరిహారం చెల్లిస్తే అప్పగించేందుకు అభ్యంతరం లేదని కలెక్టరుకు స్పష్టం చేశారు.


మరో ప్రపంచం తెలియదు..
- కె.రామ్మూర్తి, యు.భూపతి, రైతు, కార్మికుడు, నౌపడ

ఉప్పు గల్లీ తప్ప మరో ప్రపంచం తెలియదు. ఇప్పుడేమో అధికారులు గల్లీలకు వెళ్లొద్దు, ఉప్పు పండించకూడదు అంటున్నారు. దీనిపైనే కుటుంబాలను పోషించుకుంటున్నాం. లీజు గడువు ఉన్న యజమానులకు పరిహారం చెల్లిస్తామంటున్న ప్రభుత్వం, అందులో తరతరాలుగా జీవనం సాగిస్తున్న కార్మికులు, రైతులను పట్టించుకోవాలి. ఉప్పు లేకపోతే మా జీవనం లేదు. ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి.


2 వేల ఎకరాల కేటాయింపు..

- షేక్‌ ముజ్రల్‌ఇస్లామ్‌, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ సాల్ట్‌, నౌపడ

మొత్తం భూమిలో 2 వేల ఎకరాలు భావనపాడు కోసం కేటాయించారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాతిపదికన తీసుకుంటుందనే అంశంపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఉప్పు సాగు నిలిపేయడంతో కార్మికులు, రైతులకు ఉపాధి ఉండదు. నౌపడ సాల్ట్‌ కమిషనరేట్‌ పరిధిలోని ఐదు వేల ఎకరాలు తీసుకోవాలంటే రూ.2 వేల కోట్లు అవుతుందని అంచనా. వీటి మార్కెట్‌ రేటు విలువ, తదితర అంశాలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని