logo

కిశోరి వికాసం ఏమైంది?

లక్షల మంది బాలబాలికలకు అవగాహన కల్పించే వైఎస్‌ఆర్‌ కిశోరి వికాసం కార్యక్రమం నిధుల్లేక నిలిచిపోయింది. తెదేపా ప్రభుత్వ హయాంలో 2016లో ‘బాలకా తెలుసుకో’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించారు.

Published : 02 Dec 2022 03:07 IST

- న్యూస్‌టుడే, బలగ(శ్రీకాకుళం)

మూడో విడతకు సంబంధించి గోడపత్రికలు ఆవిష్కరిస్తున్న అధికారులు(పాత చిత్రం)

లక్షల మంది బాలబాలికలకు అవగాహన కల్పించే వైఎస్‌ఆర్‌ కిశోరి వికాసం కార్యక్రమం నిధుల్లేక నిలిచిపోయింది. తెదేపా ప్రభుత్వ హయాంలో 2016లో ‘బాలకా తెలుసుకో’ పేరిట కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాన్ని మంచి స్పందన రావడంతో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘వైఎస్సార్‌ కిశోరి వికాసం’గా పేరుమార్చి అమలు చేశారు. రెండు విడతల పాటు కార్యక్రమానికి దిగ్విజయంగా నిర్వహించారు. దీని ద్వారా జిల్లా వ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థినులు లబ్ధి పొందారు. ఆ తరువాత నిధుల లేమితో మూడో ఏడాది ముందుకు సాగలేదు. మళ్లీ ఇప్పటివరకు దాని ప్రస్తావన తెరపైకి రాలేదు.

ఏం చేశారు..

కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు, కళాశాలలను ఎంపిక చేసి విద్యార్థినులకు ఆరోగ్యం, స్త్రీ-పురుష సమానత్వం, గుడ్‌ అండ్‌ బ్యాడ్‌ టచ్‌, పరిశుభ్రత, భవిష్యత్తు, పిల్లలపై హింస, వివక్షత, తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రక్తహీనత, బాల్య వివాహాలు, చదువు మధ్యలోనే మానేయడం, ప్రేమ పేరిట వేధింపులను నివారించేందుకు అవగాహన తరగతులను నిర్వహించేవారు. ఇందుకుగానూ ఆసక్తి గల పీజీ, డిగ్రీ, ఇంజినీరింగ్‌ కళాశాలల విద్యార్థినులను ఎంపిక చేసి శిక్షణ ఇచ్చారు. వారి ద్వారా జిల్లాలోని పాఠశాలలు, జూనియర్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ తదితర కళాశాలల్లోని ఆడపిల్లలకు అవగాహన కల్పించారు. జిల్లాలో మొదటి ఏడాది(2017-18) పాఠశాల విద్యార్థినులకే దీన్ని పరిమితం చేశారు. అప్పుడు 17,750 మందికి బాలికలకు అవగాహన కల్పించారు. రెండో ఏడాది జూనియర్‌ కళాశాలలతో పాటు పాలిటెక్నిక్‌, ఐటీఐ విద్యార్థినులను చేర్చి 74939 మంది లబ్ధి చేకూర్చారు.

ప్రయోజనం ఇలా ..

కార్యక్రమం వల్ల అనేక లాభాలున్నాయి. కిశోర బాలికలకు విషయ పరిజ్ఞానం, జీవన నైపుణ్యాలు పెంపొందుతాయి. జీవితంలో ఒకరిపై ఆధారపడకుండా లక్ష్యాలను నిర్దేశించుకోవడం, సొంత నిర్ణయాలు తీసుకునే ధోరణి అలవడుతుంది. వారి బాధలను ఇతరులతో పంచుకునే వీలు కలుగుతుంది. ఇతరుల నుంచి కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం లభిస్తుంది. ఆత్మస్థైర్యం పెరుగుతుంది. దీంతో పాటు శిక్షణ ఇచ్చే పీజీటీల్లోనూ నాయకత్వ లక్షణాలు అలవడుతాయి. బాలికా సంరక్షణపై వారికి పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పడుతుంది. వివిధశాఖల అధికారులు, ఉన్నత స్థాయి వ్యక్తులు పరిచయమవుతారు. నిపుణులతో మాట్లాడే అవకాశం దొరుకుతుంది. సమాజానికి సేవ చేశామనే తృప్తి లభిస్తుంది.

ఉద్దేశమిదీ...

కౌమార దశలో ఉన్న బాలికలల్లో ఆరోగ్య, భౌతిక పరమైన మార్పులు జరుగుతాయి. ఆ సమయంలో వారు తోటి విద్యార్థులు, సమాజం నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వారి సమస్యను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మథనపడుతుంటారు. ఇలాంటివారికి భరోసా నిచ్చేందుకు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

నిధుల్లేక ఆగిపోయింది...

వైఎస్‌ఆర్‌ కిశోరి వికాసం మూడో విడత 2019-20 సంవత్సరంలో అమలు కావాల్సి ఉంది. కానీ జరగలేదు. కార్యక్రమం  నిర్వహణ ఖర్చులకు నిధులు విడుదలకాకపోవడంతో నిర్వహించ లేకపోయాం. పథకం అమలుకు సంబంధించి ఉన్నతాధికారులను నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదు. వస్తే వాటిని పాటిస్తాం.

- కె.వి.రమణ, డీసీపీవో, శ్రీకాకుళం


జిల్లాలో వివరాలిలా...

* మొత్తం ప్రాజెక్టులు 15
* పీఆర్జీ (ప్రాజెక్టు రిసోర్స్‌ గ్రూప్‌) సభ్యులు 144
* శిక్షణ పొందిన పీఆర్జీ సభ్యులు 144
* ఎంపికైన పీజీటీలు 6,345
* శిక్షణ ఇవ్వాల్సిన పాఠశాలలు 1,281
* జూనియర్‌ కళాశాలలు 196
* పాలిటెక్నిక్‌ 10  ‌* ఐటీఐ 26


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని