logo

రహదారి ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

కొల్లివలస పంచాయతీ సంకురాడ కూడలి వద్ద గురువారం జరిగిన రహదారి ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస మండలం తిమ్మాపురం కాలనీకి చెందిన గోవిందరావు పాలకొండ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు.

Published : 02 Dec 2022 03:07 IST

బూర్జ, న్యూస్‌టుడే: కొల్లివలస పంచాయతీ సంకురాడ కూడలి వద్ద గురువారం జరిగిన రహదారి ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమదాలవలస మండలం తిమ్మాపురం కాలనీకి చెందిన గోవిందరావు పాలకొండ వైపు ద్విచక్రవాహనంపై వెళ్తున్నాడు. అదే సమయంలో పాలకొండ నుంచి ఆమదాలవలస వైపు పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం దుగ్గికి చెందిన మరోవ్యక్తి ద్విచక్రవాహనంపై వస్తుండగా ఎదురెదురుగా ఢీకొన్నారు. దీంతో గోవిందరావు(45) రహదారిపై పడ్డాడు. అదే సమయంలో పాలకొండ వైపు వెళ్తున్న లారీ అతడిని ఢీకొని సుమారు 30 అడుగుల దూరం వరకు ఈడ్చుకెళ్లడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. స్థానికులు సమాచారం అందించిన సుమారు గంట తర్వాత 108 వాహనం రావడంతో అప్పటికే క్షతగాత్రునికి తీవ్ర రక్తస్రావం అయ్యింది. శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్దదిక్కును కోల్పోయామని వారు కన్నీటి పర్యంతమయ్యారు. మృతుడు పాలకొండ ఆంజనేయనగర్‌లోని దుకాణంలో బీరువాలు తయారు చేస్తుంటాడు. సంఘటనా స్థలానికి పోలీసులు సకాలంలో రాకపోవడంతో అర్ధగంట పాటు వాహనాల రాకపోకలు నిలిచాయి. తర్వాత చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌ఛార్జి ఎస్‌ఐ రఘునాథరావు చెప్పారు.


మద్యం చోరీ ఘటనలో ముమ్మర దర్యాపు

లావేరు, న్యూస్‌టుడే: లావేరు మండలం మురపాక సమీపంలో ఉన్న ప్రభుత్వ మద్యం దుకాణంలో భారీగా మద్యం చోరీకి గురైన విషయం తెలిసిందే. చోరీకి గురైన మద్యాన్ని బుధవారం రాత్రి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లావేరు పోలీస్‌ స్టేషనులో భద్రపరిచినట్లు ఎస్‌ఐ కోటేశ్వరరావు తెలిపారు. గురువారం డీఎస్పీ ఎం.మహేంద్ర, సీఐలు స్వామినాయుడు, పైడియ్య పరిశీలించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయని డీఎస్పీ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని