logo

కూడళ్ల మారవు.. కష్టాలు తీరవు..!

జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరం రోజురోజుకీ విస్తరిస్తోంది. విద్య, ఉద్యోగ, ఇతర అవసరాల దృష్ట్యా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి నిత్యం ఎంతో మంది వస్తుంటారు.

Updated : 02 Dec 2022 05:08 IST

వాహనదారులకు ట్రాఫిక్‌ కష్టాలు

- న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

జిల్లా కేంద్రమైన శ్రీకాకుళం నగరం రోజురోజుకీ విస్తరిస్తోంది. విద్య, ఉద్యోగ, ఇతర అవసరాల దృష్ట్యా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి నగరానికి నిత్యం ఎంతో మంది వస్తుంటారు. ఇటీవల ఆ సంఖ్య మరింత పెరగడం... నగరంలోని కూడళ్లు ఇరుకుగా ఉండటంతో ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
భవిష్యత్తు అవసరాల రీత్యా వాటిని విస్తరించాల్సిన అవసరం ఉంది. పదేళ్లుగా ప్రధాన కూడళ్లను విస్తరించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినా అవి ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ విషయమై జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు సైతం పట్టించుకోకపోవడంతో ప్రజలకు ట్రాఫిక్‌ ఇక్కట్లు తీరట్లేదు.

శ్రీకాకుళం నగరంలో డే అండ్‌ నైట్‌, రామలక్ష్మణ, సూర్యమహల్‌, అరసవల్లి మిల్లు, పొట్టిశ్రీరాములు, ఏడురోడ్ల కూడళ్లు ప్రధానమైనవి. నగర సుందరీకరణ, ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ చర్యల్లో భాగంగా వీటిని విస్తరించాలని అధికారులు గతంలోనే ప్రతిపాదనలు రూపొందించారు. గతంలో నగరపాలకసంస్థ ప్రత్యేకాధికారులుగా వ్యవహరించిన పలువురు కలెక్టర్లు, జేసీల చొరవతో నగరంలో ట్రాఫిక్‌ రద్దీని గుర్తించేందుకు ఆంధ్రా విశ్వవిద్యాలయం రవాణా విభాగం ఆచార్యుల ఆధ్వర్యంలో సర్వే కూడా చేయించారు. క్షేత్రస్థాయిలోనూ పరిస్థితిని పరిశీలించి నగరంలో ఎదురవుతున్న ట్రాఫిక్‌ ఇబ్బందులు, భవిష్యత్తు అవసరాల రీత్యా చేపట్టాల్సిన పనులపై చర్చించారు. పలుమార్లు సంయుక్త సమావేశాలు ఏర్పాటు చేసి కూడళ్లను విస్తరించాల్సిందేనని నిర్ణయించారు. ఆ మేరకు పలుమార్లు ఇంజినీర్లు ప్రతిపాదనలు తయారు చేసినా కార్యరూపం దాల్చలేదు.

వుడా ముందుకు వచ్చినా...

గతంలో శ్రీకాకుళం నగరం విశాఖ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ ఆథారిటీ(వుడా) పరిధిలో ఉండేది. అప్పట్లో నగరంలోని ప్రధాన కూడళ్లను సుమారు రూ.70 కోట్లతో విస్తరించేందుకు ముందుకు వచ్చింది. అందులో భాగంగా మొదటి దశలో డే అండ్‌ నైట్‌, ఏడురోడ్లు, రామలక్ష్మణ, పొట్టిశ్రీరాములు కూడళ్లను విస్తరించేందుకు టెండర్లు పిలిచారు. అవి ఖరారై గుత్తేదారులు ముందుకొచ్చినా విస్తరణకు అవసరమైన స్థలాన్ని సేకరించి వుడాకు అప్పగించడంలో నగరపాలకసంస్థ అధికారులు విఫలమయ్యారు. కొంతమేర ప్రయివేటు భవనాలు, స్థలాలను సేకరించి, వారికి నష్టపరిహారం చెల్లించే విషయంలో అడుగులు ముందుకు వేయలేదు. స్థల సేకరణ విషయంలో ఏర్పడిన జాప్యంతో టెండరు కాలపరిమితి దాటిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వం మారటం, శ్రీకాకుళం నగరం సుడా పరిధిలోకి చేరడం, సుడాలో నిధుల లేమి, పూర్తిస్థాయి సిబ్బంది లేకపోవడం వంటి కారణాలతో విస్తరణ విషయం అటకెక్కింది.

అరకొరగా కొంత పనులు...

ఏడేళ్ల కిందట వుడా సూర్యమహల్‌ కూడలిని కొంత మేర విస్తరించారు. ఆ పనుల్లో భాగంగా అరసవల్లి మిల్లు కూడలిని విస్తరించేందుకు చర్యలు చేపట్టగా స్థల సేకరణలో జరిగిన జాప్యంతో అప్పట్లో పనులు నిలిచిపోయాయి. ఇటీవల ఓ ప్రయివేటు వ్యక్తి నుంచి కొంత మేర స్థలం సేకరించడంతో ప్రస్తుతం అక్కడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో కాలువ నిర్మాణం చేపట్టి కొంత మేర విస్తరించే పనులు జరుగుతున్నాయి.


శ్రీకాకుళం నగరంలో అత్యంత రద్దీగా ఉండే కూడళ్లలో రామలక్ష్మణ కూడలి ఒకటి. నరసన్నపేటవైపు నుంచి నగరంలోకి వచ్చే వాహనాలన్నీ ఈ కూడలి మీదుగా వస్తుంటాయి. దీంతో పాటు నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్లేందుకు ఈ కూడలి మీదుగానే వెళ్లాలి. ఇటీవల ఈ ప్రాంతంలో రద్దీ పెరిగిపోవడం, విస్తరణకు నోచుకోకపోవడంతో నిత్యం ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి.


చిత్రంలో కనిపిస్తున్నది పాత బస్టాండ్‌(ఓబీఎస్‌) కూడలి.  ఈ ప్రాంతం నిత్యం వాహనాల రాకపోకలు, జనాలతో రద్దీగా ఉంటుంది. దీంతో పాటు అరసవల్లి, శ్రీకూర్మం క్షేత్రాలకు వెళ్లేందుకు ఈ మార్గం గుండానే వెళ్లాలి. రోజురోజుకీ రద్దీ పెరుగుతున్నా ఈ కూడలి సైతం విస్తరణకు నోచుకోవడం లేదు.


ప్రణాళిక తయారు చేస్తున్నాం..

నగరంలో ప్రధాన కూడళ్ల విస్తరణపై దృష్టి సారించాం. ఈ విషయమై కలెక్టర్‌, మంత్రితో చర్చించాం. రహదారులు, భవనాలశాఖ, పురపాలకశాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్రణాళిక తయారు చేస్తున్నాం. దశలవారీగా అభివృద్ధి చేస్తాం.

- ఓబులేసు, నగరపాలక సంస్థ కమిషనర్‌, శ్రీకాకుళం


నగరంలో వివరాలిలా...

మొత్తం డివిజన్లు: 50
జనాభా: 1.86 లక్షలు
కుటుంబాలు: 55,471
ప్రధాన కూడళ్లు: 6
వీటి మీదుగా నిత్యం రాకపోకలుసాగించే వాహనాలు: 10 వేలకుపైగా (సుమారు)


 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని