logo

విద్యాలయాలకు బాసట!

విద్యావ్యవస్థలో మార్పులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా) పథకానికి శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభించింది.

Published : 02 Dec 2022 04:34 IST

పీఎంశ్రీ పథకానికి 599 పాఠశాలలు ఎంపిక
న్యూస్‌టుడే, కవిటి

పీఎంశ్రీ పథకానికి ఎంపికైన రాజపురం జడ్పీ ఉన్నత పాఠశాల

విద్యావ్యవస్థలో మార్పులకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్‌ ఫర్‌ రైజింగ్‌ ఇండియా) పథకానికి శ్రీకారం చుట్టింది. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ఎంపికైన పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, డిజిటల్‌ తరగతి గదులు, ల్యాబ్‌, గ్రంథాలయాలు, క్రీడలకు సంబంధించి పరికరాలతోపాటు నాణ్యమైన విద్య అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా పథకానికి 599 పాఠశాలలు ఎంపికయ్యాయి.

జిల్లాలో శ్రీకాకుళం నగరం, గ్రామీణ ప్రాంతాల పరిధిలో గరిష్ఠంగా 56, ఇచ్ఛాపురం 41, కనిష్ఠంగా సరుబుజ్జిలి 1, లక్ష్మినర్సుపేట పరిధిలో 7 పాఠశాలలు ఎంపికయ్యాయి. పీఎంశ్రీ పథకానికి అర్హత సాధించాలంటే విద్యార్థుల సంఖ్య, విద్యా సంవత్సరంలో విద్యార్థులు సాధించిన పురోగతి, పాఠశాలలో కల్పిస్తున్న మౌలిక సదుపాయాలు, దస్త్రాల నిర్వహణ, క్రీడాస్థలం, వంటశాల, వైద్యపరీక్షల నిర్వహణ, తల్లిదండ్రుల యాజమాన్య కమిటీ నిర్వహణ, 2021-22లో యూడైస్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఆ మేరకు 46 అంశాలపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెబ్‌సైట్‌లో వివరాలను నమోదు చేశారు. వాటిని ప్రామాణికంగా తీసుకుని గ్రామీణప్రాంతంలో 60, పట్టణపరిధిలో 70 శాతం మార్కులు సాధించిన బడులను ఎంపిక చేశారు.

 


ప్రయోజనాలివీ...

పీఎంశ్రీలో ఎంపికైన పాఠశాలలకు కేంద్రం నేరుగా నిధులు జమచేస్తుంది. కేంద్రం 60 శాతం నిధులు జమచేస్తే రాష్ట్రం 40 శాతం భరించాలి. కృత్యాధార, వృత్యంతర బోధనాంశాల్లో ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తారు. జాతీయ విద్యావిధానం స్థాయిలో విద్యుత్తు, ల్యాబ్‌, క్రీడలు, డిజిటల్‌, సాంకేతిక, మౌలిక వసతులు కల్పిస్తారు. ఎంపికైన పాఠశాలలకు ఐదేళ్లపాటు కేంద్రం ఆర్థిక వనరులు తోడ్పాటునందిస్తుంది.


విద్యార్థుల సామర్థ్యం పెంపునకు దోహదం..

పీఎంశ్రీ పథకం నూతన జాతీయ విద్యావిధానం అమలుకు దోహదపడుతుంది. నాడు-నేడుకు తోడుగా పీఎంశ్రీ పథకం అమలుతో విద్యావిధానం సరికొత్తపోకడ సంతరించుకోనుంది. ప్రత్యేక బోధనతో ప్రతి విద్యార్థి సామర్ధ్యాలను పెంపొందించేందుకు దోహదపడుతుంది.

- జి.పగడాలమ్మ, డీఈవో, శ్రీకాకుళం


జిల్లాలో వివరాలిలా...

పాఠశాల స్థాయి       ఎంపికైనవి

ప్రాథమిక                390
ప్రాథమికోన్నత          96
ఉన్నత                  113

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని