logo

విషాద యాత్ర..

వారిద్దరూ భవానీ భక్తులు.. దుర్గమ్మనే నమ్ముకొని ఏటా మాల వేస్తున్నారు.. దీక్ష అనంతరం కాలినడకనే ఎప్పుడూ అమ్మసన్నిధికి వెళుతుంటారు.. ఈసారి కూడా దీక్ష పూర్తి చేసుకున్నారు... ఇరుముడి కట్టి.. కుటుంబ సభ్యులకు వీడ్కోలు పలికారు..

Published : 04 Dec 2022 06:11 IST

భవానీ భక్తులపై దూసుకొచ్చిన కారు
తుని వద్ద జరిగిన ఘటనలో ఇద్దరి దుర్మరణం  
న్యూస్‌టుడే, తుని పట్టణం, జి.సిగడాం  

సంతోష్‌, ఈశ్వర్‌రావు (పాత చిత్రాలు)

వారిద్దరూ భవానీ భక్తులు.. దుర్గమ్మనే నమ్ముకొని ఏటా మాల వేస్తున్నారు.. దీక్ష అనంతరం కాలినడకనే ఎప్పుడూ అమ్మసన్నిధికి వెళుతుంటారు.. ఈసారి కూడా దీక్ష పూర్తి చేసుకున్నారు... ఇరుముడి కట్టి.. కుటుంబ సభ్యులకు వీడ్కోలు పలికారు.. అడుగులో అడుగులు వేసుకుంటూ పాదయాత్ర ప్రారంభించారు.. కానీ మార్గమధ్యలో మాటేసిన మృత్యువు వీరిని అమ్మ సన్నిధికి చేరకుండా చేసింది.. కారు రూపంలో వచ్చి నిండు ప్రాణాలను బలితీసుకుంది. రెప్పపాటులో ఘోరం జరిగిపోయింది.. కాకినాడ జిల్లా తుని సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఇద్దరు భవానీ భక్తులు దుర్మరణం పాలయ్యారు.  

సంతోష్‌ ఇంటి వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు

జి.సిగడాం మండలం పెనసాం గ్రామానికి చెందిన రావి సంతోష్‌ (30), నల్ల ఈశ్వరరావు (38), మహేష్‌, జి.గిరి భవానీ మాల వేసుకున్నారు. మాలవిరమణ కోసమని స్వగ్రామం నుంచి విజయవాడకు గత నెల 26న కాలినడకన బయల్దేరారు. వీరంతా శుక్రవారం రాత్రి తుని జాతీయ రహదారి సమీపాన పాయకరావుపేట వద్ద అమ్మవారి ఆలయంలో బస చేశారు. శనివారం ఉదయం ఆరు గంటలకు పూజ చేసుకుని యాత్రను కొనసాగించారు. 6.30 గంటల సమయంలో ముందు ఇద్దరు, వెనుక మరోఇద్దరు రోడ్డుకు పక్కగా నడిచి వెళుతున్నారు. డీమార్ట్‌ దాటాక ఒక దాబా వద్దకు వచ్చేసరికి విశాఖ నుంచి అతి వేగంగా ఓ కారు వీరిపైకి దూసుకొచ్చింది. మరో వాహనాన్ని దాటించబోయి అదుపుతప్పి సంతోష్‌, ఈశ్వరరావులను అతి బలంగా ఢీకొట్టింది. దీంతో వీరిద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. తమతో వచ్చిన ఇద్దరు ఎక్కడపడ్డారో.. ఏం జరిగిందో తెలియనట్లుగా ఈ ఘోరం క్షణాల్లో జరిగిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను తుని ప్రాంతీయాసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాలను అప్పగించారు. కారు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌ఛార్జి సీఐ సన్యాసిరావు తెలిపారు.

* రావి సంతోష్‌కు 2019లో సంధ్య అనే యువతితో వివాహం జరిగింది. తల్లిదండ్రులు, సోదరుడి కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఇంకా సంతానం కలగలేదు. అమ్మనే నమ్ముకుని ఏటా మాలవేస్తున్నారు. వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇంటి పెద్దదిక్కు కోల్పోవడంతో తమ పరిస్థితి ఎలా దేవుడా అంటూ కుటుంబ సభ్యుల రోదనలు ఆపడం ఎవరితరం కాలేదు.  

* నల్ల ఈశ్వర్‌రావు భార్య నీలవేణి, తల్లిదండ్రులు, అన్నయ్య కుటుంబంతో కలిసి ఉంటున్నారు. ఇతనికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పదేళ్లుగా భవానీ మాల వేస్తున్నారు.  కాలినడకన వద్దని ఇంట్లోవాళ్లు వారించినా, ఏం కాదంటూ వెళ్లారని, ఇంతలోనే తమకు దూరమవుతారని అనుకోలేదని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విద్యుత్తు పనులు చేస్తూ కుటుంబాన్ని  పోషిస్తున్నాడని, ఇప్పుడు ఎవరు దిక్కని విలపిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు