logo

నిందితులంతా యువకులే

లావేరు మండలం మురపాక సమీపంలో గత నెల 29న ప్రభుత్వ మద్యం దుకాణంలో భారీ ఎత్తున మద్యం చోరీకి గురైంది. ఈ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు తొమ్మిది రోజుల్లోనే ఛేదించారు.

Published : 08 Dec 2022 05:32 IST

మద్యం చోరీ ఘటనను ఛేదించిన పోలీసులు

వివరాలు వెల్లడిస్తున్న ఎస్పీ రాధిక పక్కన ఇతర అధికారులు

లావేరు, న్యూస్‌టుడే: లావేరు మండలం మురపాక సమీపంలో గత నెల 29న ప్రభుత్వ మద్యం దుకాణంలో భారీ ఎత్తున మద్యం చోరీకి గురైంది. ఈ ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు తొమ్మిది రోజుల్లోనే ఛేదించారు. ఇందులో విశేషం ఏమిటంటే నిందితులంతా 25 ఏళ్ల లోపు  యువకులే. అందులో ఒక్కరు ఇంజినీరింగ్‌ చదివిన యువకుడు ఉన్నాడు. వీరిలో కొందరు మద్యానికి బానిసలై ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. వీరంతా పక్క గ్రామానికి చెందిన వారు కావడం గమనార్హం. లావేరు పోలీస్‌స్టేషన్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితులను ఎస్పీ జి.ఆర్‌.రాధిక చూపారు.  ఆమె తెలిపిన వివరాల ప్రకారం..

‘గుంటుపేట కూడలి దుకాణంలో రూ.11.62 లక్షల విలువజేసే 7,087 మద్యం సీసాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. తొమ్మిది రోజుల పాటు పోలీసులు నాలుగు బృందాలుగా వివిధ ప్రాంతాల్లో గాలించారు. నిందితులు వినియోగించే చరవాణులు, క్లూస్‌టీం దర్యాప్తు, సీసీ కెమెరాల సాయంతో కేసు ఛేదించాం. ప్రధాన నిందితుడు సతీష్‌ మద్యానికి బానిస కావడంతో తన స్నేహితులతో కలిసి ఈ పధకం పన్నారు. ఇందులో భాగంగానే దుకాణానికి స్టాక్‌ వచ్చిన సమాచారం తెలుసుకుని చోరీకి పాల్పడ్డారు. దుకాణం వద్ద ఉన్న కాపలాదారులను సమీపంలోని నీలగిరి తోటలో కట్టేసి వారి వద్ద ఉన్న చరవాణులు, ద్విచక్రవాహన తాళం తీసుకున్నారు. అనంతరం షాపులోని మద్యాన్ని ఎత్తుకెళ్లారు. పోలీసులకు అందిన సమాచారంతో బుధవారం జాతీయ రహదారిపై బుడుమూరు కూడలి వద్ద పది మంది నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశాం. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరి నుంచి రూ.10,29,600 విలువైన 6,328 మద్యం సీసాలతో పాటు ఒక ద్విచక్ర వాహనం, టాటా మ్యాజిక్‌ వాహనం, రెండు చరవాణులు, ఆరు చాకులు, ఒక సమ్మెట స్వాధీనం చేసుకున్నాం. నిందితులందరిదీ లావేరు మండలం కేశవరాయనిపాలెం గ్రామం. విశాఖ నగరంలోని పూర్ణా మార్కెట్లో వివిధ పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నారు. చోరీకి పాల్పడిన వారిలో ఒకరు బీటెక్‌ పూర్తి చేశారు. వీరంతా 25 ఏళ్ల లోపు యువకులే.’ అని ఎస్పీ వివరించారు. యువత మద్యానికి బానిసై ఏం చేస్తున్నారో వారికే అర్థం కాలేదని,  మద్యానికి, మత్తు పదార్థాలకు 20-30 ఏళ్ల లోపువారే బానిసలవుతున్నారని తెలిపారు. పిల్లల విషయంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉంటూ అదుపులో పెట్టాలని కోరారు.

పోలీసులకు రివార్డులు

చోరీ కేసులో సహాయ సహకారాలు అందించిన జేఆర్‌.పురం, ఆమదాలవలస సీఐలు స్వామినాయుడు, పైడయ్య, సీసీఎస్‌ సీఐ ఆదాం, లావేరు, ఎచ్చెర్ల, రణస్థలం, జి.సిగడాం ఎస్సైలు కోటేశ్వరరావు, సత్యంనారాయణ, రాజేష్‌, రామారావులతో పాటు ఇతర సిబ్బందికి ఎస్పీ జి.రాధిక రివార్డులు అందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ విఠలేశ్వరరావు, డీఎస్పీ ఎం.మహేంద్ర, సీఐలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని