logo

అక్కడ ఒక్క పునాదీ పడలేదు..!

పాతపట్నం శివారున ఉన్న సూదికొండ దగ్గర జగనన్న కాలనీకి కేటాయించిన స్థలమిది. 1,219 మందికి రూ.20 కోట్లు వెచ్చించి ఇళ్లు నిర్మించాలనే ఉద్దేశంతో రెండేళ్ల కిందట ప్రక్రియ ప్రారంభమైంది.

Published : 08 Dec 2022 05:51 IST

ఖాళీగా దర్శనమిస్తున్న జగనన్న లేఅవుట్లు
ఆసక్తి చూపని లబ్ధిదారులు
న్యూస్‌టుడే, శ్రీకాకుళం అర్బన్‌, పాతపట్నం, టెక్కలి పట్టణం, పలాస, రణస్థలం, నరసన్నపేట.

పాతపట్నం శివారున ఉన్న సూదికొండ దగ్గర జగనన్న కాలనీకి కేటాయించిన స్థలమిది. 1,219 మందికి రూ.20 కోట్లు వెచ్చించి ఇళ్లు నిర్మించాలనే ఉద్దేశంతో రెండేళ్ల కిందట ప్రక్రియ ప్రారంభమైంది. రోడ్లు, నీరు, విద్యుత్తు సదుపాయాలు సమకూర్చకపోవడంతో లబ్ధిదారులు ముందుకు రాలేదు. ఇప్పటికీ ఒక్క ఇల్లు కూడా కట్టలేదు.

‘నవరత్నాలు- పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా ఈ  నెలలో సామూహిక గృహప్రవేశాలు నిర్వహణకు అధికారులు సమాయత్తం అవుతున్నారు. జిల్లాలో 28,026 ఇళ్లు పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలనే లక్ష్యం నిర్దేశించారు. ఇది పక్కన పెడితే అసలు ఒక్క ఇల్లూ కట్టని లేఅవుట్లు పదుల సంఖ్యలో జిల్లాలో దర్శనమిస్తున్నాయి. కనీసం ఒక్క పునాదిరాయి పడని దుస్థితి అక్కడ నెలకొంది. వసతులు కల్పించకపోవడం, లబ్ధిదారులు ఆసక్తి చూపకపోవడంతోనే ఆయా లేఅవుట్లు నిర్మానుష్యంగా దర్శనమిస్తున్నాయి. రూ.కోట్లు వ్యయం చేసి స్థలాలిచ్చినా ఎలాంటి ఫలితం లేకుండా పోతోంది.

వసతుల్లేవు..

లబ్ధిదారులకు కట్టాలనే ఆసక్తి ఉన్నా అందుకవసరమయ్యే నిర్మాణ సామగ్రి అందుబాటులో ఉండటం లేదు. లేఅవుట్లో కనీస వసతులైన రహదారులు, విద్యుత్తు సరఫరా, నీరు ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ అటువంటివి ఏమీ కనిపించడం లేదు. దీనికితోడు ఇసుక కొరత వేధిస్తోంది. ఉచితమని చెప్పడమే తప్ప సరిపడా అందటం లేదు. సిమెంట్‌ సంగతీ అంతే. నీళ్లు లేక కొందరు ట్యాంకుల ద్వారా తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉంది.  


టెక్కలి: చేరి వీధిలో వంద గృహాలకు స్థలాలను కేటాయించారు. దీనికి సమీపంలో ఉన్నవారు తమకే ఇల్లు కేటాయించాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ వివాదం కారణంగా పనులు ప్రారంభం కాలేదు.


* రణస్థలం, జేఆర్‌పురం గ్రామాలకు చెందిన 280 మంది లబ్ధిదారులకు నగరప్పాలెం వద్ద స్థలాలిచ్చారు. ఖరీదైన స్థలమైనా లబ్ధిదారులు మాత్రం వెనుకంజ వేస్తున్నారు.


* నరసన్నపేట: మాకివలసలో 26 ఇళ్లకు స్థలం మంజూరు చేశారు. ఈ ప్రాంతానికి వెళ్లేందుకు మార్గం లేక ఎవరూ ఆసక్తి చూపడం లేదు. రోడ్డు నిర్మాణానికి రూ.3 లక్షలు మంజూరైనా గుత్తేదారులు కూడా ముందుకు రాలేదు.


* మందస మండలం భైరిసారంగపురంలో 75 మందికి స్థలాలిచ్చారు. నిర్మాణాలకు సిద్ధమయ్యే సమయంలో ఓ వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. దీంతో అడుగులు ముందుకు పడలేదు.


* ఇళ్ల నిర్మాణాల్లో మూడో ఆప్షన్‌పై స్పష్టమైన విధి విధానాలిస్తే బాగుంటుంది. ఈ విషయమై ‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో లబ్ధిదారులు నిలదీస్తున్నారు. సమాధానం చెప్పలేకపోతున్నాం.  

- తమ్మినేని సీతారాం, శాసన సభాపతి


 జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయకుండా ఇళ్లు ఎలా నిర్మిస్తారు. ఇసుక విధానంపైనా స్పష్టత లేదు. పేదవాడి ఇంటికి ఇసుక చేరడం లేదు.

- ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌


...ఈనెల 1న జిల్లాలో గృహ నిర్మాణాలపై ఆ శాఖ మంత్రి జోగి రమేశ్‌ నిర్వహించిన సమీక్ష సమావేశంలో వైకాపాకు చెందిన ప్రజాప్రతినిధులే క్షేత్రస్థాయిలో సమస్యలపై ఏకరవు పెట్టారు. అసంతృప్తి వ్యక్తం చేశారు.


పునాదులకు నోచుకోని స్థలాలివే..

* ఫరీద్‌పేట, కుప్పిలి (2, 3, 4), అంపోలు, బూరవిల్లి, బిన్నల, గంగరాం, జియ్యన్నపేట, బెల్లుపటియ, లొద్దలభద్ర (1, 2), బొడ్డాడ 2, కొత్తపేట, తెప్పలవలస, సీరురవానిపేట, టెక్కలి చేరివీధి లేఅవుట్లలో ఒక్క ఇల్లు కట్టలేదు. ఇవి కాక పాతపట్నం, మందస, నరసన్నపేట తదితర ప్రాంతాల్లో అర్బన్‌ డెవలప్‌మెంట్‌ పరిధిలో ఉన్నాయని, అక్కడి నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు రాలేదని అధికారులు చెబుతున్నారు.

* సామూహిక గృహ ప్రవేశాలు పేరుతో అధికారుల ఒత్తిడి కారణంగా 28,128 నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అయితే వీరు కూడా పెరిగిన సామగ్రి వల్ల అపసోపాలుపడుతున్నారు.  

* మౌలిక వసతులు ఇప్పటికిప్పుడు కల్పిస్తే ఈనెల 21వ తేదీ నాటికి సుమారు 20 వేల గృహాలు పూర్తిచేసే అవకాశముందని జిల్లా అధికారులు చెబుతున్నారు.  


లక్ష్యాన్ని పూర్తి చేస్తాం

అన్ని లేఅవుట్లలో సమస్యలు పరిష్కరించి, మౌలిక వసతుల కల్పనకు గృహనిర్మాణశాఖ మంత్రి ఆదేశాలిచ్చారు. ఆ దిశగా పనులు వేగంగా సాగుతున్నాయి. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రతి శనివారం ‘హౌసింగ్‌ డే’ నిర్వహించి లక్ష్యాలను చేరుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. డిసెంబరు 21 నాటికి గతంలో నిర్దేశించిన లక్ష్యాన్ని పూర్తి చేసి సామూహిక గృహ ప్రవేశాలు చేపట్టనున్నాం.

- నక్క గణపతి, గృహనిర్మాణ సంస్థ పీడీ, శ్రీకాకుళం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని