logo

చలిపులి

జిల్లాలో చలిపులి వణుకు పుట్టిస్తోంది. ఉష్ణోగ్రతలు క్రమేణా పడిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉదయం 8 గంటల వరకు పొగమంచు వీడటం లేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు.

Published : 08 Dec 2022 05:51 IST

జిల్లాలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు
న్యూస్‌టుడే, గుజరాతీపేట (శ్రీకాకుళం), నరసన్నపేట

తామరాపల్లి వద్ద చలిమంట వేసుకున్న గ్రామస్థులు

జిల్లాలో చలిపులి వణుకు పుట్టిస్తోంది. ఉష్ణోగ్రతలు క్రమేణా పడిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉదయం 8 గంటల వరకు పొగమంచు వీడటం లేదు. ముఖ్యంగా గిరిజన ప్రాంత ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. రాత్రి వేళల్లో చలిమంటలతో ఉపశమనం పొందుతున్నారు. గత నెలతో పోల్చుకుంటే కనిష్ఠ ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు తగ్గడం గమనార్హం. వారం రోజులుగా శీతల వాతావరణం ఎక్కువగా ఉంటుండటంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. జలుబు, దగ్గు, జ్వరం బారిన పడుతూ ఆసుపత్రుల బాట పడుతున్నారు. మరికొన్ని రోజుల పాటు ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని సూచిస్తున్నారు.

పిల్లల విషయంలో జాగ్రత్త...

శీతాకాలం ప్రారంభం కావడంతో కొందరు న్యూమోనియా (ఉబ్బసం)తో బాధపడుతుంటారు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తుంటాయి. ఏడాది నుంచి ఐదేళ్ల లోపు చిన్నారుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వ సర్వజనాసుపత్రిలోని చిన్న పిల్లల ఓపీ విభాగానికి రోజుకు 80 మంది వస్తే అందులో 40 మంది జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతున్న వారు ఉంటున్నారని వైద్యులు చెబుతున్నారు. వీరిలో 5 నుంచి 10 మంది వరకు న్యూమోనియాతో బాధపడుతున్నారని వివరిస్తున్నారు.


మరో నెలరోజులు ఇలాగే..

నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. మరో నెల రోజుల వరకు ఇదే వాతావరణం కొనసాగవచ్చు. తీరం వెంబడి 15 నుంచి 20కి.మీ వేగంతో గాలుల ప్రభావం ఉంటుంది. ఆకాశం మేఘావృతమై కాస్త వాతావరణం వేడెక్కినా, శీతల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. పొగమంచు ప్రభావం కొన్ని పంటలకు నష్టం వాటిల్లే అవకాశముంది.  

- జె.జగన్నాథం, భూ విజ్ఞాన శాస్త్రవేత్త


వ్యాక్సిన్‌ తప్పనిసరి...

పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరిగితే బాక్టీరియా వైరస్‌లను ఎదుర్కొనే సామర్థ్యం ఎక్కువవుతుంది. ఇందుకు ముఖ్యంగా అయిదేళ్లలోపు పిల్లలందరికీ తప్పనిసరిగా టీకా వేయించాలి. దీనికి అదనంగా పోషకాహారం, తల్లిపాలు అందించాలి. ఇవి క్రమం తప్పకుండా అందిస్తే న్యూమోనియా దరి చేరదు.

- డాక్టర్‌ మహేశ్‌, చిన్న పిల్లల వైద్య నిపుణులు, జెమ్స్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు