logo

ధాన్యం కొనండయ్యా..!

జిల్లాలో 656 ఆర్బీకేల పరిధిలో 372 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు జిల్లాలో 8 మండలాల్లో ఇంకా ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టలేదు.

Updated : 10 Dec 2022 04:22 IST

అన్నదాతను వణికిస్తున్న తుపాను


తామరాపల్లి వద్ద జాతీయ రహదారిపై ఉంచిన ధాన్యంపై పరదా కప్పి కాపలాగా ఉన్న రైతు

మాండోస్‌ తుపాను సిక్కోలు అన్నదాత గుండెల్లో అలజడి రేపుతోంది. రేయింబవళ్లు కష్టించి పండించిన పంట చేతికందే సమయాన ఈ విపత్తు ఆందోళన రేకెత్తిస్తోంది. రహదారులు, కల్లాల నుంచి కదలని ధాన్యపు రాశులు ఓ పక్క యంత్రాంగం ధోరణి మరోపక్క రైతన్నకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ఓపక్క తుపాను తరుముతున్నా అధికారుల్లో స్పందన కనిపించడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు తాజాగా ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పుల ప్రయోగం వికటిస్తోంది. సాంకేతిక, సమన్వయ లోపాలు ఎక్కడికక్కడే వెక్కిరిస్తున్నాయి. దీంతో దేవుడిపై భారం వేసి విక్రయం కోసం అన్నదాత ఎదురుచూస్తున్నాడు..

- న్యూస్‌టుడే, నరసన్నపేట, జలుమూరు, సారవకోట, కలెక్టరేట్‌

జిల్లాలో 656 ఆర్బీకేల పరిధిలో 372 కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం నిర్ణయించింది. ఇంతవరకు జిల్లాలో 8 మండలాల్లో ఇంకా ధాన్యం కొనుగోలుకు శ్రీకారం చుట్టలేదు. కేవలం 152 చోట్ల మాత్రమే ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటివరకు 5,421 మెట్రిక్‌ టన్నులు కొన్నారు. ఇదే సమయంలో సవాలక్ష సమస్యలు రైతులను  వెంటాడుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి  అడపాదడపా పడుతున్న వర్షాలతో కర్షకులను కలచివేస్తోంది. పొలాల్లో వరికుప్పలను వేసేందుకు తంటాలు పడుతున్నారు. పరదాలను కప్పి భద్రపరుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. తమ పంటను కొనేదెవరంటూ కలసినవారిని ప్రశ్నిస్తున్నారు.

తప్పని అవస్థలు..

ధాన్యం కొనుగోలు చేసేందుకు మిల్లర్లు మెలికలు పెట్టడంతో రైతులపైనే భారం పడుతోంది. నరసన్నపేట మండలం చినకరగాం గ్రామానికి చెందిన గొండు అప్పారావు అనే రైతు ధాన్యం నూర్పిడి చేసిరెండు రోజులు గడిచినా తేమశాతం తేడాతో కొనలేదు. దీంతో ఆయన ర.భ రహదారిపై ఆరబెడుతున్నారు. ఎండలేకపోవడంతో ఆందోళన చెందుతున్నాడు. పలువురు రైతులు తుపాను కారణంగా నూర్పులు వాయిదా వేసుకోగా, చేసినవారు ధాన్యాన్ని బస్సు షెల్టర్లు, గోదాములు, కళ్లాల్లో దాచుకుంటున్నారు. ఇక కళ్లాల్లోని ధాన్యం తరలించేందుకు రవాణా అగచాట్లు కూడా రైతుల మెడకే చుట్టుకుంటున్నాయి. రవాణా బాధ్యతలు దాదాపుగా రైతులే భరిస్తున్నారు. తూకపు యంత్రాల (వేబ్రిడ్జిలు) వద్దకు ధాన్యం తరలించేందుకు ట్రాక్టర్లు, ఇతర వాహనాలు అందుబాటులో  ఉండటం లేదు. ట్రాక్టర్లపై తరలించే ధాన్యం ఐదు టన్నులకు మించి తీసుకెళితే మళ్లీ రైతులు ఇంటికి తీసుకురావాల్సి వస్తోంది. 60 బస్తాలు మాత్రమే రైతులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఈ విషయం తెలియని కొందరు మిగిలిన బస్తాలను వెనక్కి తేవాల్సి వస్తోంది.  జిల్లా వ్యాప్తంగా 4 లక్షల మెట్రిక్‌ టన్నుల కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు కేవలం 5 వేల మెట్రిక్‌ టన్నులు మాత్రమే కొనడం గమనార్హం.

రైతులకు మేలు చేయాలన్నదే మా ఆలోచన...

గతేడాదితో పోల్చితే ఈసారి ముందుగానే కొనుగోళ్లు ప్రారంభించాం. జిల్లాకు భారీ వర్ష సూచన లేదు. ప్ర స్తుతం చినుకులు పడుతున్నందున తేమశాతం ఎక్కువగానే ఉంటుంది. దీంతో రైతుకు కొంత నష్టం వస్తుంది.  సోమవారానికి వాతావరణ పరిస్థితులు కుదుటపడతాయి.  ధాన్యం ఇచ్చేస్తామంటే తీసుకునేందుకు క్షేత్రస్థాయిలో సిద్ధంగానే ఉన్నాం.

-మల్లారపు నవీన్‌, సంయుక్త కలెక్టర్‌

జలుమూరు మండలంలో ఇలా..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని