logo

ఎత్తిపోతలు ఎండమావేనా..?

2022 జనవరిలో ఏపీఎస్‌ఐడీసీ అధికారులు ఈ పథకం కింద పూర్తిగా సాగునీరు అందించేందుకు, లీకుల నివారణకు రూ.1.50 కోట్లతో ప్రతిపాదనలు పంపినా నేటికీ నిధులు మంజూరు కాలేదు.

Published : 25 Jan 2023 03:57 IST

లీకులు అరికట్టేందుకు మంజూరుకాని నిధులు
కొండపేటలోనే పథకం ఉన్నా అందని నీరు
న్యూస్‌టుడే, ఎత్తురాళ్లపాడు (కోటబొమ్మాళి)

తాజా పరిస్థితి: 2022 జనవరిలో ఏపీఎస్‌ఐడీసీ అధికారులు ఈ పథకం కింద పూర్తిగా సాగునీరు అందించేందుకు, లీకుల నివారణకు రూ.1.50 కోట్లతో ప్రతిపాదనలు పంపినా నేటికీ నిధులు మంజూరు కాలేదు.
  
కోటబొమ్మాళి మండల పరిధిలోని కొండపేట ఎత్తిపోతల పథకం కింద వేలాది ఎకరాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందక రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్న ఈ ప్రాంత రైతులు రెండు పంటలు వేసుకోవచ్చన్న లక్ష్యంతో నిర్మించిన ఈ పథకం నీరుగారిపోతోంది. ఫలితంగా వరుణదేవుడిపైనే భారం వేసి సాగుతున్నారు. భారీ లీకుల కారణంగా ఖరీఫ్‌లోనూ ఉన్న నీటినీ వినియోగించుకోలేకపోయారు. ఇక రబీలో ఇప్పటివరకు ఆ ఊసే లేదు. పథకం నిర్మించి పదేళ్లు పూర్తయినా నేటికి పూర్తిస్థాయిలో నీరు అందించలేని దుస్థితి నెలకొంది.

2021లో లీకులు... నేటికీ అలాగే..!

రూ.కోట్లు ఖర్చుపెట్టి నిర్మించిన ఎత్తిపోతల పథకం నుంచి నీరు విడిచిపెట్టినపుడు నీటి సమస్యలు ఉంటే క్షేత్రస్థాయిలో అధికారులు పరిశీలించి సరిచేసి తర్వాత సాగునీరివ్వాలి. అవేవీ లేకపోవటంతో చిన్నలీకులు కాస్త 2021 జులైలో పెద్దవయ్యాయి. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో చందాలు పోగేసుకొని గుంటజగన్నాథపురం రైతులు మరమ్మతులు చేసేందుకు రంగంలోకి దిగారు. రబ్బరు ట్యూబులు, నీరు తోడేందుకు ఇంజిన్లు, సిమెంటు, ఇసుక, మెటల్‌చిప్స్‌ వంటి వాటితో లీకులు పూడ్చేందుకు ప్రయత్నించారు. ఇప్పటికీ ఆ లీకుల సమస్య అలాగే ఉండటంతో పథకం పూర్తిగా ఆగిపోయింది. పనుల్లో భాగంగా నీలంపేట నుంచి తాటిపర్తి పైభాగంలోని భూములకు సాగునీరందేలా నిర్మాణాలు చేపట్టాల్సి ఉన్నా ఎలాంటి చర్యలు లేవు.

భారీ లీకులు అరికట్టే పనుల్లో గుంట జగన్నాథపురం రైతులు (పాత చిత్రం)

పథకం పేరు కొండపేట ఎత్తిపోతలు

శంకుస్థాపన 2012 జులై 2
నిధుల మంజూరు రూ.25.38 కోట్లు
సాగునీరు అందివ్వాల్సింది  2,400 ఎకరాలు
2021 సీజన్‌లో ఇచ్చినది   1,400 ఎకరాలు


ట్ల పైనే పైపులు

పదేళ్ల కిందట పైపులు వేసినపుడు మా భూములకు సాగునీరందుతుందని ఆనందపడ్డాం. నేటికీ ఆ పైపులే కనిపిస్తున్నాయి. గతేడాది పథకం పూర్తిగా పనిచేయలేదు. ఎన్నో ఆశలతో సాగునీళ్లకోసం ఎదురు చూస్తున్న మా ఆశలు ఫలించేలా చర్యలు చేపట్టాలి.

తర్ర రమణ, గోపాలపురం, తాటిపర్తి


సెంటు భూమికీ అందదు

మా గ్రామం పేరుతో ఎత్తిపోతల పథకం ఉంది. కానీ రైతుల భూముల్లో సెంటుభూమికి సాగునీరందదు. పాతిక ఎకరాలను పండించేందుకు నేటికీ వర్షాల కోసం చూస్తున్నాం. గ్రామాన్ని ఆనుకొని ఉన్న వంశధార ప్రధాన కాలువ నుంచి ఈ పథకానికి నీరొచ్చి ఎగువ గ్రామాలకు నీరు వెళ్తుంది. ఇప్పటికైనా కొండపేట భూములకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలి.

కొండాల రాజారావు, కొండపేట


ప్రతిపాదనలు పంపాం...

పథకం సమస్య కొన్నేళ్లుగా ఉన్న నేపథ్యంలో గతేడాది రూ.1.50 కోట్లకు ప్రతిపాదనలు పంపించాం. అయినా ఇప్పటివరకు మంజూరు కాలేదు. నిధులు వచ్చిన వెంటనే పూర్తిస్థాయిలో సాగునీరు, సమస్యలు లేకుండా లీకులు పరిష్కరిస్తాం. ఇక భారీ లీకుల సమస్య తీర్చేందుకు రూ.20 లక్షలు మంజూరు చేసి, మూడుసార్లు టెండర్లు పిలిచాం. ఏ ఒక్కరూ ముందుకురాలేదు. దీంతో గతేడాది ఎత్తిపోతల పథకం ఆగిపోయింది. మరోసారి ఉన్నతాధికారులకు సమస్య తెలియచేస్తాం.

సుబ్రహ్మణ్యం, ఈఈ, ఏపీఎస్‌ఐడీసీ, శ్రీకాకుళం

Read latest Srikakulam News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు