logo

అటవీ ఉత్పత్తుల సేకరణ ఏదీ..?

జిల్లాలో ఐటీడీఏ పరిధి పాతపట్నం గిరిజన కార్పొరేషన్‌ సంస్థ (జీసీసీ) పరిధిలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పండించిన పంటలు, అటవీ ప్రాంతాల్లో సేకరించిన ఉత్పత్తులను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలి.

Published : 26 Jan 2023 06:19 IST

సవరజాడుపల్లిలో గిరిజనులు
- న్యూస్‌టుడే, మెళియాపుట్టి, పాతపట్నం

తయారుచేసిన కొండ చీపుర్లు

గిరిజనులు సేకరించిన అటవీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలి.. వారు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి.. నేలబొంతు కేంద్రంగా.. జీసీసీ కలెక్షన్‌ సెంటర్‌ ప్రారంభించాలి.. మారుమూల ప్రాంతాల్లో గిరిజనులకు అందుతున్న సౌకర్యాలు, సేవలపై తెలుసుకునేందుకే వచ్చా.

గతేడాది మే 18న మెళియాపుట్టి మండలం చందనగిరి గ్రామానికి వచ్చిన సందర్భంగా రాష్ట్ర ఎస్టీ కమిషన్‌ ఛైర్మన్‌ కంబం రవిబాబు అన్న మాటలివి..


జిల్లాలో ఐటీడీఏ పరిధి పాతపట్నం గిరిజన కార్పొరేషన్‌ సంస్థ (జీసీసీ) పరిధిలో మారుమూల గిరిజన ప్రాంతాల్లో పండించిన పంటలు, అటవీ ప్రాంతాల్లో సేకరించిన ఉత్పత్తులను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలి. అవసరమైన వారికి రుణ సదుపాయం కల్పించాలి. కాని జీసీసీ యంత్రాంగం ఉదాసీనత, సిబ్బంది కొరత వెరసి గ్రామాల్లో సేవలు కొరవడుతున్నాయి. దీంతో గ్రామాలకు చేరే వ్యాపారులు, దళారులనే గిరిజనులు ఆశ్రయించాల్సిన పరిస్థితి నేలకొంది. దీంతో గిరిజన రైతుల ఆర్థిక స్వావలంబనకు తూట్లు పడుతున్నాయి. జీసీసీ పరిధిలో కంచిలి, మందస, మెళియాపుట్టి, పలాస, నందిగాం, టెక్కలి, పాతపట్నం, హిరమండలం, సారవకోట మండలాల పరిధిలో 32 గిరిజన (డీఆర్‌) డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో అటవీ ఉత్పత్తులు, రైతులు పండించే రాగులు, కొర్రలు, జొన్నలు, కందులు వంటి చిరుధాన్యాలు, జీడిపిక్కలు, ఫైనాపిల్‌, పసుపు, కొండ చీపుర్లు, నల్ల జీడి, నరమామిడి చెక్క, జిగురు వంటి అటవీ ఉత్పత్తులు కొనుగోళ్లు మొక్కుబడిగానే సాగుతున్నాయి. కానరాని జీసీసీ యంత్రాంగం: గిరిజన గ్రామాల్లో పండించిన పంటలు, సేకరించిన అటవీ ఉత్పత్తుల విక్రయాలకు దళారులే శరణ్యంగా మారారు. పాతపట్నం, మెళియాపుట్టి, నందిగాం, మందస, తదితర ప్రాంతాల్లో గిరిజన రైతులకు గిట్టుబాటు కల్పించి, ఆర్థిక ప్రోత్సాహం అందించాల్సి జీసీˆసీˆ యంత్రాంగం జాడ గ్రామాల్లో కానరావడం లేదు.  


దళారులే కొంటున్నారు.. గతేడాది సుమారు 20 వేలకు పైగా కొండ చీపుర్లు, పైనాపిల్‌ పంట లారీ లోడు వరకు దళారులే కొన్నారు. ఇక జీడి, కుంకుళ్లు, ఇతరత్రా అటవీ ఉత్పత్తులను కూడా మా గ్రామాలకు వచ్చే వ్యాపారులకే విక్రయిస్తున్నాం.

సవర రాజు, సవరజాడుపల్లి


అవగాహన కల్పిస్తున్నాం.. జీసీˆసీ పాతపట్నం పరిధిలో ప్రణాళికాబద్ధంగా అటవీ ఉత్పత్తులు కొనుగోలు చేసేందుకు ఉన్న సిబ్బందితోనే ఊరూరా తిరిగి అవగాహన కల్పిస్తున్నాం. పాతపట్నం జీసీసీ పరిధిలో 22 డిపోలు ఉన్నాయి. వాటి ద్వారా కొండ చీపుర్లు, కుంకుళ్లు, నరమామిడి చెక్క కొనుగోళ్లు చేస్తున్నాం. ధరలు కూడా ప్రకటించాం. కుంకుళ్లు కిలో రూ.45, నల్ల జీడి కిలో రూ.12, కొండ చీపుర్లు గ్రేడ్‌-1, రూ.45, గ్రేడ్‌-2 40, నరమామిడి చెక్క రూ.18 చొప్పున కొనుగోళ్లకు సిద్ధంగా ఉన్నాం.  

నర్సింహులు, జీసీసీ నిర్వాహకులు, పాతపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని