logo

ముంచుకొస్తున్న గడువు.. అన్నదాతల్లో గుబులు..!

ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు ఫిబ్రవరి 15 వరకే గడువు ఉందని ప్రకటిస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గార మండలంలోని చాలా ప్రాంతాల్లో పొలాల్లోనే వరి కుప్పలు దర్శనమిస్తున్నాయి.

Published : 26 Jan 2023 06:19 IST

తోణంగి వద్ద పొలాల్లోనే ఉన్న వరికుప్పలు

గార, న్యూస్‌టుడే: ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలుకు ఫిబ్రవరి 15 వరకే గడువు ఉందని ప్రకటిస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గార మండలంలోని చాలా ప్రాంతాల్లో పొలాల్లోనే వరి కుప్పలు దర్శనమిస్తున్నాయి. ఈ పరిసర ప్రాంతాల్లో రైతులు ఖరీఫ్‌లో వరి పంట కోత సమయంలో అపరాలు పంట మినుము, పెసర విత్తనాలు రబీ పంటగా వేస్తారు. అప్పుడు వరి కంకులను కుప్పలుగా పొలాల్లోనే భద్రపరుచుకుంటారు. అపరాల సాగు చేతికొచ్చిన తర్వాత వరి కుప్పలను నూర్పిడి చేసి ధాన్యం విక్రయాలు జరుపుతారు. అయితే ధాన్యం కొనుగోలుపై అధికారులు గడువు విధించడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. ఫిబ్రవరి నెలాఖరుకు గానీ చాలాచోట్ల అపరాల సాగు చేతి అందే పరిస్థితి కనిపించడం లేదు. పంట పొలాల్లో ఉన్న వరికుప్పలు మార్చిలో గాని నూర్పిడి చేయలేరు. వమరవల్లి, తోణంగి, కొర్ని, కొర్లాం, జల్లువలస, సతివాడ, కె-సైరిగాం, బూరవల్లి, అంబళ్లవలస, పూసర్లపాడు, అంపోలు, శ్రీకూర్మం, వాడాడ గ్రామాల్లో ఎక్కువగా వరి కుప్పలు పంట పొలాల్లోనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో ఆరుగాలం పండించే పంట దళారుల చేతికి చిక్కే రైతుకి నష్టం కలిగేందుకు అవకాశం ఉందని, ధాన్యం కొనుగోలు గడువును మార్చి నెలాఖరు వరకు పొడిగించాలని రైతులు కోరుతున్నారు.

స్పష్టమైన ఉత్తర్వులందలేదు...: మండలంలో సమస్య ఉన్నమాట వాస్తవమే. పొలాల్లోనే కుప్పలు ఉన్నాయి. ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఉన్న యాప్‌లో రైతు వివరాలు నమోదు చేస్తున్నాం. ధాన్యం కొనుగోలుపై ఇంతవరకు స్పష్టమైన ఉత్తర్వులు అందలేదు.

పద్మావతి, ఏవో, గార మండలం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని