logo

మందకొడిగా ఈ-పంట నమోదు

జిల్లాలో ప్రస్తుత రబీలో ఈ-పంట నమోదు కొన్ని ప్రాంతాల్లో మందకొడిగా సాగుతోంది. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ-పంటలో నమోదు చేసుకుంటేనే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వర్తిస్తాయి.

Published : 26 Jan 2023 06:19 IST

న్యూస్‌టుడే, కలెక్టరేట్‌(శ్రీకాకుళం): జిల్లాలో ప్రస్తుత రబీలో ఈ-పంట నమోదు కొన్ని ప్రాంతాల్లో మందకొడిగా సాగుతోంది. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను ఈ-పంటలో నమోదు చేసుకుంటేనే ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఈ-పంట నమోదు, ఈ-కేవైసీ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఇందులో కొన్ని మండలాల్లో ప్రగతి తక్కువగా కనిపిస్తోంది. సాంకేతిక లోపాల కారణంగా జాప్యం జరుగుతోంది. ఇంకా వరి, చెరకు, నువ్వు పంటలు నాటే దశలో ఉన్నాయి. ఈ నెలాఖరునాటికి ప్లాంటేషన్‌ పూర్తి కావచ్చని అధికారులు చెబుతున్నారు.

జిల్లా వ్యాప్తంగా రబీలో పెసర, మినప, మొక్కజొన్న, నువ్వు, వరి, వేరుశనగ పంటలను అధిక విస్తీర్ణంలో వేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వాటన్నింటి వివరాలు తప్పనిసరిగా ఈ-పంటలో నమోదు చేయాలి. ఆ విషయంలో పది మండలాల్లో జిల్లా సగటు కంటే తక్కువగా నమోదైంది.  20 మండలాల్లో 80 శాతం నుంచి 152 శాతం వరకు నమోదు కాగా మిగిలిన మండలాల్లో 78 నుంచి 67 శాతం వరకు ఉంది. అత్యల్పంగా ఎచ్చెర్లలో 67.3 శాతం, సరుబుజ్జిలి 68.4, రణస్థలం 68.7, శ్రీకాకుళం 69.4, మిగిలిన మండలాల్లో 70 నుంచి 80 శాతంలోపు వివరాలు పొందుపరిచారు. అత్యధికంగా ఇచ్ఛాపురంలో 152 శాతం, కవిటి 146.7, సారవకోట 102.2, పోలాకి 96.7, మందస 96.3, టెక్కలి 95.3, కోటబొమ్మాళి 91.8 శాతం నమోదైంది.


ఈలోగా పూర్తి చేస్తాం...
- కె.శ్రీధర్‌, జేడీ, వ్యవసాయశాఖ

ఈ-పంటలో వివరాల నమోదుకు వచ్చే నెల 20 వరకు గడువు ఉంది. ఇంకా కొన్ని పంటలు జనవరి నెలాఖరు వరకు వేస్తారు. పంటల బీమా, పెట్టుబడి రాయితీ, పంట కొనుగోలు చేయాలంటే తప్పనిసరిగా వివరాలు నమోదు చేయించుకోవాలి. గడువులోగా అన్ని ప్రాంతాల్లో ప్రక్రియ పూర్తి చేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని