logo

దాతల స్పందన.. బాధితులకు సాంత్వన..!

క్షయ వ్యాధి నిర్మూలనకు, వ్యాధి బాధితులకు ఆసరా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి టి.బి. ముక్త్‌ భారత్‌’ పథకాన్ని అమలు చేస్తోంది. దాని ద్వారా దాతల సహకారంతో బాధితులకు పోషకాహారం అందించాలని నిర్ణయించింది.

Published : 26 Jan 2023 06:22 IST

రణస్థలంలో బాధితులకు పోషకాహార కిట్‌ అందిస్తున్న డాక్టర్‌ రెడ్డీస్‌ పరిశ్రమ ప్రతినిధి కేవీఎన్‌ రాజు, ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వో అనూరాధ, తదితరులు

న్యూస్‌టుడే, గుజరాతీపేట(శ్రీకాకుళం): క్షయ వ్యాధి నిర్మూలనకు, వ్యాధి బాధితులకు ఆసరా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి టి.బి. ముక్త్‌ భారత్‌’ పథకాన్ని అమలు చేస్తోంది. దాని ద్వారా దాతల సహకారంతో బాధితులకు పోషకాహారం అందించాలని నిర్ణయించింది. ఆ మేరకు జిల్లా వైద్యాధికారులకు, గవర్నర్‌ నుంచి రెడ్‌క్రాస్‌ సంస్థకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. దీనికి దాతల నుంచి మంచి స్పందన వస్తోంది. ఎంతో మంది స్వచ్ఛందంగా విరాళాలిచ్చేందుకు ముందుకొస్తున్నారు. బాధితులకు సాంత్వన చేకూర్చేందుకు వారి వంతు సాయం చేస్తున్నారు.


జిల్లాలో ప్రస్తుతం 2,300 మంది క్షయ రోగులున్నారు. వీరందరికీ కేంద్ర పభుత్వం ఉచితంగా మందులు అందిస్తోంది. ప్రతి నెలా బ్యాంకు ఖాతాలో రూ.500 జమ చేస్తోంది. వీరిని మరింత ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు దాతల సహకారంతో ఒక్కో వ్యక్తికి నెలకు రూ.700 విలువ చేసే పోషకాహారం (బియ్యం, నూనె, పాలపొడి, బెల్లంతో చేసిన పదార్థాలు, పప్పు దినుసులు) కిట్లు అందజేస్తున్నారు.


జిల్లాలో ఈ ఏడాది జులైలో 12 మందికి తొలుత కిట్లు ఇచ్చి పథకాన్ని ప్రారంభించారు. ఆ తరువాత మగటపల్లి వెంకటరమణమూర్తి వెల్ఫేర్‌, సి.వి.నాగజ్యోతి వెల్ఫేర్‌ ట్రస్టుల ద్వారా 20 గ్రామాలకు చెందిన పలువురికి కిట్లు పంపిణీ చేశారు. అక్కడి నుంచి దాతలు కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు ముందుకు రావడంతో ప్రస్తుతం 1,640 మందికి ఆరు నెలలపాటు పోషకాహార కిట్లు అందించేందుకు అవకాశం కలిగింది. దాతల్లో ప్రదానంగా డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ రూ.25 లక్షలు, అరబిందో యాజమాన్య ప్రతినిధులు రూ.12.60 లక్షలు రెడ్‌క్రాస్‌ సంస్థ ద్వారా రూ.11 లక్షలు సమకూర్చారు.


595 కిట్ల  పంపిణీ..

జిల్లా కేంద్రానికి క్షయ బాధితులు ప్రతి నెలా వచ్చి కిట్లు తీసుకువెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. దీన్ని గమనించిన జిల్లా క్షయ నివారణశాఖ అధికారులు బుధవారం వివిధ ప్రాంతాల్లో 595 కిట్లు పంపిణీ చేశారు. టెక్కలిలోని జిల్లా కేంద్ర ఆసుపత్రి, నరసన్నపేట ప్రాంతీయాసుపత్రి, పాతపట్నం, ఆమదాలవలస, రణస్థలం, ఇచ్ఛాపురం సోంపేట, పలాస సీహెచ్‌సీలు, మందస, హిరమండలం ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాల వద్ద బాధితులకు బుధవారం కిట్లు అందజేశారు.


ఆసక్తి ఉంటే సంప్రదించాలి..
- డాక్టర్‌ అనురాధ, జిల్లా క్షయ నివారణ అధికారి

క్షయ బాధితుల్లో రోగ నిరోధకశక్తి పెంపొందాలంటే పోషకాహారం తీసుకోవాలి. అలాంటివారికి దాతల సహకారంతో జిల్లాలో బాధితులకు పోషకాహారం అందిస్తున్నాం. ఆరు నెలల పాటు ఇచ్చిన తరువాత బాధితులకు క్షయ నిర్ధారణ పరీక్షలు చేస్తాం. ఆరోగ్యం మెరుగుపడినవారికి ఖరీదైన మందులిస్తాం. మరింత మంది దాతలు ముందుకు వస్తే ఎక్కువ మంది పోషకాహారం అందించేందుకు వీలు కలుగుతుంది. ఆసక్తిగలవారు 94924 22203 నంబరును సంప్రదించవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని