logo

వారసత్వ సంపద భావితరాలకు అందిద్దాం

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు) మైదానంలో గురువారం 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు.

Updated : 27 Jan 2023 05:34 IST

కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ 

ఘనంగా 74వ గణతంత్ర వేడుకలు

‘జిల్లాలోని వారసత్వ సంపద, పర్యావరణాన్ని కాపాడుకుంటూ భావితరాలకు అందించేందుకు ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి. ఆ దిశగా అందరం అడుగులు వేద్దాం’.

కలెక్టర్‌ శ్రీకేష్‌ బి లఠ్కర్‌


సాయుధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరిస్తున్న కలెక్టర్‌

న్యూస్‌టుడే, పాతశ్రీకాకుళం, కలెక్టరేట్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు) మైదానంలో గురువారం 74వ గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మదిమదిలో దేశభక్తి ఉప్పొంగింది. చిన్నారుల నుంచి పెద్దల వరకు మువ్వన్నెల జెండా చేతపట్టి తమ భక్తి చాటారు. అధికార యంత్రాంగం నిర్వహించిన వేడుకల్లో భరతమాతకు జేజేలు పలికారు. ఈ సందర్భంగా జాతీయ పతకాన్ని కలెక్టరు శ్రీకేష్‌ బి.లఠ్కర్‌ ఎగుర వేశారు. అనంతరం వివిధ పోలీసు విభాగాల నుంచి గౌరవ వందనం స్వీకరించి మాట్లాడారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజును నిర్వహించుకోవడంతో పాటు జాతీయ నాయకుల పోరాటాలు వృథా కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. అందులో భాగంగా అందుబాటులో ఉన్న సాగునీటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ ప్రతి ఎకరాకు నీరందించి జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. వంశధార రెండో దశ పనులకు రూ.2,407 కోట్లతో కూడిన అంచనాలకు ప్రభుత్వం పరిపాలన అనుమతి జారీ చేసిందని చెప్పారు. గొట్టాబ్యారేజీ కుడి ప్రధాన కాలువపై ఎత్తిపోతల ద్వారా 12 టీఎంసీల నీటిని హిరమండలం రిజర్వాయర్‌లో నింపాలనే ప్రతిపాదనకు ఆమోదం లభించడంతో పాటు టెండర్లు ఖరారు అయ్యాయని వివరించారు. కడుమ, మాతల, లైదాం, బొంతు-సారవకోట-కొత్తూరు, తండ్యాం, కళింగపట్నం, మజ్జిగూడెం ఎత్తిపోతల పథకాల పనులు నడుస్తున్నాయన్నారు. ధాన్యం కొనుగోలులో కొత్త విధానంలో కనీస మద్దతు ధరతో పాటు గోనె సంచులు, హమాలీ, రవాణా ఛార్జీలను సైతం నేరుగా అన్నదాత ఖాతాల్లోకి జమ చేస్తున్నామని వివరించారు.


221 మందికి ప్రశంసాపత్రాలు..

తొలుత కలెక్టర్‌, ఎస్పీ జి.ఆర్‌.రాధికతో కలిసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ప్రసంగించిన అనంతరం జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమరయోధులను కలిసి ఆరోగ్య పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల మాస్‌ డ్రిల్‌, సాంస్కృతిక ప్రదర్శనలు, స్టాళ్లు ఆకట్టుకున్నాయి. వివిధ శాఖల్లో ఉత్తమ సేవలందించిన 221 మంది అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.  కార్యక్రమంలో సంయుక్త కలెక్టరు ఎం.నవీన్‌, టెక్కలి సబ్‌ కలెక్టర్‌ రాహుల్‌ కుమార్‌ రెడ్డి, డీఎఫ్‌వో నిషాకుమారి, అదనపు ఎస్పీ మణికంఠ, డీఆర్‌వో రాజేశ్వరి, పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు.


ఇంకా ఏమన్నారంటే..

* జిల్లాలో 30 మండలాల్లో 1,466 గ్రామాల్లో భూముల రీసర్వే వేగవంతంగా సాగుతోంది. మొదటి దశలో 350 గ్రామాల్లో 54,368 మందికి భూ హక్కు పత్రాలు పంపిణీ చేశాం.
* ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం వద్ద రూ.365.81 కోట్లతో ఫిషింగ్‌ హార్బర్‌ పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి.  
* ఉద్దానం పరిధిలో రూ.700 కోట్లతో చేపట్టిన తాగునీటి పథకం పనులు ఈ ఏడాది మార్చి నాటికి పూర్తి చేసేందుకు అడుగులు వేస్తున్నాం.  
* ఆరోగ్యశ్రీ ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 33,502 మంది శస్త్రచికిత్సలకు రూ.78.68 కోట్లను ప్రభుత్వం చెల్లించింది.  
* పలాసలో రూ.50 కోట్లతో నిర్మాణంలో ఉన్న  200 పడకల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి, కిడ్నీ పరిశోధనా కేంద్రం పనులు వేగవంతం చేశాం.  
* ‘మనబడి నాడు-నేడు’ పథకం కింద రెండో విడతలో 1096 అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు రూ.427.73 కోట్లతో అంచనాలతో పనులు జరుగుతున్నాయి.  
* జిల్లా వ్యాప్తంగా నిరుపేదలకు 77,550 గృహాలు మంజూరు కాగా ఇప్పటివరకు 16,550 ఇళ్లు పూర్తయ్యాయి.  
* వివిధ ప్రాంతాల్లో అయిదు వంతెనలు, 16 రహదారి పనులకు రూ.348 కోట్లు మంజూరయ్యాయి.  


ఆకట్టుకున్న శకటాల ప్రదర్శన

ప్రథమ బహుమతి పొందిన డ్వామా శకటం

వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలకు సంబంధించిన అభివృద్ధి శకటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఆయా శాఖలకు సంబంధించి జరుగుతున్న అభివృద్ధిని ప్రదర్శిస్తూ వాహనాలపై ప్రత్యక్షంగా చూపించే ప్రయత్నం చేశారు. ఇందులో జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా)  శకటం ప్రథమ, ఆర్‌డబ్ల్యూఎస్‌    ద్వితీయ, గృహనిర్మాణ సంస్థకు   తృతీయ బహుమతి లభించింది.

ఆకట్టుకున్న చిన్నారుల నృత్య ప్రదర్శనలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని