logo

వెలుగుల రేడు..వేడుక నేడు

రథసప్తమి వేడుకకు అరసవల్లి పుణ్యక్షేత్రం ముస్తాబు అయ్యింది.. సూర్యనారాయణ స్వామి నిజరూపాన్ని చూసే సమయం ఆసన్నమైంది.

Updated : 27 Jan 2023 05:36 IST

అర్ధరాత్రి నుంచి రథసప్తమి పూజలు
క్షీరాభిషేక దర్శనానికి తరలి  రానున్న భక్తజనం

న్యూస్‌టుడే, అరసవల్లి: రథసప్తమి వేడుకకు అరసవల్లి పుణ్యక్షేత్రం ముస్తాబు అయ్యింది.. సూర్యనారాయణ స్వామి నిజరూపాన్ని చూసే సమయం ఆసన్నమైంది.. ఆలయ పరిసర ప్రాంతాలన్నీ ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతున్నాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఆదిత్యునికి క్షీరాభిషేకం చేసేందుకు సర్వం సిద్ధం చేశారు. భానుడి దర్శనానికి అధిక సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే రూట్‌ మ్యాప్‌ను సైతం సిద్ధం చేశారు. ఈ నేపథ్యంలో వేడుకకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక కథనం..


ప్రారంభం ఇలా..

ఉచిత క్యూలైను

27న (శుక్రవారం)న అర్ధరాత్రి 12.15 గంటల నుంచి 28న ఉదయం 7 గంటల వరకు క్షీరాభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటల వరకు నిజరూప దర్శనం కల్పిస్తారు.  విశాఖ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర స్వామీజీ  తొలి పూజలు చేస్తారు. దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు.


దర్శనానికి దారిదీ..

* శ్రీకాకుళం నగరంవైపు నుంచి అరసవల్లి వచ్చే భక్తులు 80 అడుగుల రహదారిలో వాహనాలను నిలపాలి. అక్కడి నుంచి కాలినడకన శ్రీశయనవీధి గుండా ఇంద్రపుష్కరిణి పక్కన నిర్మించిన ఉచిత క్యూలైన్‌లోకి వెళ్లాలి. ఇనుప బారికేడ్లతో అక్కడ 35 బాక్స్‌లుగా క్యూలైన్లు నిర్మించారు. ఒక్కో బాక్స్‌లో వంద మంది ఉండేలా ఏర్పాటు చేశారు. ముందున్న బాక్స్‌ ఖాళీ అయ్యాక మరోదానిలోకి పంపిస్తారు.  


ఆర్టీసీ సేవలు..  ఆర్టీసీ అధికారులు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి అరసవల్లి కూడలి వరకు 20 బస్సులు నడపనున్నారు. గాయత్రీ సిల్క్స్‌ యాజమాన్యం కాంప్లెక్స్‌ నుంచి అరసవల్లి వరకు ఉచిత బస్సును ఏర్పాటు చేశారు.
* రూ.500 టిక్కెట్‌ క్యూలైను పెద్దతోట సమీపంలో ప్రారంభమై... ఆర్చిగేట్‌ గుండా ఆలయం లోపలికి వెళ్తుంది.  
* దాతలు, వీవీఐపీలు, వీఐపీలు(రూ.500 పాసులు ఉన్నవారు) ఆర్చిగేట్‌ వద్ద ఉన్న ప్రత్యేక క్యూలైను గుండా ఆలయంలోకి రానున్నారు.  
* రూ.100 టిక్కెట్‌ కొనుగోలు చేసినవారు అరసవల్లి మున్సిపల్‌ హైస్కూల్‌ సమీపంలో ఏర్పాటు చేసిన క్యూలైనులో నుంచి ఇంద్రపుష్కరిణి ఆవరణ మీదుగా దర్శనానికి వెళ్లాలి.
* వృద్ధులు, దివ్యాంగులు ఆర్చిగేట్‌ వద్ద రెవెన్యూ సిబ్బందిని కలిస్తే దర్శనానికి పంపిస్తారు. వీరి కోసం 3 వాహనాలు, 4 చక్రాల కుర్చీలు అందుబాటులో  ఉంచనున్నారు.


మద్యం దుకాణాల బంద్‌.. 27వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆలయ పరిసర ప్రాంతాల్లోని మద్యం దుకాణాల్లో విక్రయాలు   నిలిపివేయనున్నారు.  


1200 మందితో భారీ బందోబస్తు..

శాంతి భద్రతలు, ట్రాఫిక్‌ కంట్రోల్‌, ఆలయం వెలుపల క్యూలైన్ల వద్ద భద్రతకు శ్రీకాకుళం, మన్యం జిల్లాల నుంచి దాదాపు 1,200 మంది పోలీసులను వినియోగించనున్నారు. ఇప్పటికే వివిధ విభాగాల అధికారులతో ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో 48 నిఘా కెమెరాలను అమర్చారు.


కేశఖండన శాల

అరసవల్లిలోని ఎంహెచ్‌ స్కూల్‌ స్థలంలో కేశఖండనశాల ఏర్పాటు చేశారు. భక్తులు స్నానమాచరించేందుకు కుళాయిలు ఏర్పాటు చేశారు.


వాహనాలు ఇక్కడ నిలపాలి

పార్కింగ్‌ కోసం ప్రత్యేక స్థలాలను గుర్తించారు. భక్తుల వాహనాలు 80 అడుగుల రహదారిలో పార్కింగ్‌ చేయాలి. విధుల నిమిత్తం వచ్చేవారివి డీసీఎంఎస్‌ గోదాం వద్ద ఉంచాలి. వీవీఐపీల వాహనాలు మాత్రమే ఆర్చిగేట్‌ వరకు అనుమతిస్తారు. గార వైపు నుంచి వచ్చేవి అసిరితల్లి ఆలయం వద్ద నిలపాలి.  


చోట్ల ప్రసాదాల విక్రయాలు..

ప్రసాదాలను ఆలయం ఎదురుగా ఉన్న కౌంటర్లలోనే విక్రయిస్తారు. మొత్తం ఎనిమిది కౌంటర్లను సిద్ధం చేశారు. లక్ష లడ్డూలు, 2 క్వింటాళ్ల పులిహోర తయారు చేస్తున్నారు.  


తక్షణ వైద్యసాయం..

20 చోట్ల వైద్య బృందాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందిరా విజ్ఞాన్‌ భవన్‌, పెద్దతోట, సింహద్వారం, అసిరితల్లి ఆలయం, ఇంద్ర పుష్కరిణికి వెళ్లే దారి, కాపువీధి, శ్రీశయనవీధుల్లో ఈ సేవలు ఉంటాయి. 104, 108 వాహనాలు అందుబాటులో ఉంచుతున్నారు. ఎప్పటికప్పుడు ఆలయ పరిసర ప్రాంతాలు శుభ్రత కోసం నగరపాలక సంస్థ 400 మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించారు.


అందరూ సహకరించాలి..

రథసప్తమి వేడుకకు అందరూ సహకరించాలి. స్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. అన్ని శాఖల అధికారుల సమన్వయానికి చర్యలు తీసుకుంటున్నాం. దాదాపుగా ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇంతవరకు 930 మంది దాతలుగా తేలారు. వీరందరికీ దాతల పాసులను పంపిణీ చేస్తున్నాం.  

 పి. హరిసూర్యప్రకాశరావు, ఈవో, అరసవల్లి


రథసప్తమి రోజున సూర్యనారాయణస్వామిని దర్శించుకుంటే సుఖసంతోషాలు కలుగుతాయి. క్షీరాభిషేకం ఘట్టాన్ని భక్తులు వినియోగించుకోవాలి. స్వామివారిని చూసే సమయంలో కళ్లను మూయొద్దు.

ఇప్పిలి శంకరశర్మ, ఆలయ ప్రధానార్చకులు


ట్రాఫిక్‌ నిబంధనలివీ..

రూ.500, దాతలు, వీవీఐపీలు వెళ్లేదారి

వేడుకల సందర్భంగా 27వ తేదీ అర్ధరాత్రి నుంచి నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించనున్నారు. 27వ తేదీ రాత్రి 8 గంటల నుంచి 28న రాత్రి 12 గంటల వరకు ఇవి అమల్లో ఉంటాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు ఎలా రావాలో పోలీసులు సూచనలు చేశారు. * నరసన్నపేట మీదుగా శ్రీకాకుళం వైపు వచ్చేవారు పెద్దపాడు, రామలక్ష్మణ, చిన్న బజారు, పొట్టి శ్రీరాములు కూడలి, సంతోషిమాత కోవెల గుండా 80 అడుగుల రహదారికి రావాలి.  ః గార నుంచి అరసవల్లి వచ్చే వాహనాలను ఒప్పంగి కూడలిలో నిలిపివేస్తారు. * ఆమదాలవలస నుంచి వచ్చేవారు ఆర్టీసీ కాంప్లెక్స్‌, డే అండ్‌ నైట్‌, ఏడురోడ్ల కూడలి, మహిళా డిగ్రీ కళాశాల మీదుగా చేరుకోవాలి. * విశాఖ, రాజాం, పొందూరు, ఎచ్చెర్ల ప్రాంతాల నుంచి వచ్చేవారు నవభారత్‌, ఏడురోడ్ల కూడలి, జడ్పీ, కలెక్టరేట్‌ మీదుగా 80 అడుగుల రహదారికి రావాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని