logo

ఏళ్లు గడుస్తున్నా నిధులేవి?

పాడి పశువుల సంరక్షణకు గత ప్రభుత్వం ‘గోకులం’ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా పాడిరైతులు తమ పశువులకు సరిపడేలా షెడ్లు నిర్మించుకునేందుకు పశుసంవర్థక శాఖకు దరఖాస్తు చేసుకున్నారు.

Published : 27 Jan 2023 04:55 IST

చినరావుపల్లిలో నిర్మించిన గోకులం షెడ్డు

న్యూస్‌టుడే, ఎచ్చెర్ల, రణస్థలం: పాడి పశువుల సంరక్షణకు గత ప్రభుత్వం ‘గోకులం’ పథకాన్ని అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగా పాడిరైతులు తమ పశువులకు సరిపడేలా షెడ్లు నిర్మించుకునేందుకు పశుసంవర్థక శాఖకు దరఖాస్తు చేసుకున్నారు. వారు పదిశాతం భరిస్తే మిగిలిన 90 శాతం నిధులు రాయితీ రూపంలో ప్రభుత్వం చెల్లిస్తుందని అధికారులు ప్రకటించారు. పశువుల సంఖ్య ప్రాతిపదికగా ఒక్కో యూనిట్‌ రూ.1.50- 1.80 లక్షలుగా నిర్ణయించారు. దీంతో చాలామంది ముందుకొచ్చి నిర్మాణాలు చేపట్టారు. కొంతమంది ఆర్థిక స్థోమతు లేక మధ్యలోనే నిలిపేశారు. ఈ పథకాన్ని 2018లో ప్రారంభించగా 2019 ఆగష్టు తరువాత నిర్మించిన వారికి ప్రభుత్వం 70 శాతం నిధులు మాత్రమే ఇస్తుందని రాయితీని తగ్గించారు. అప్పటికే నిర్మించిన వాటికి నిధులు విడుదల కాకపోగా మరోపక్క రాయితీ తగ్గించేయడంతో కొత్తగా ఎవరూ వీటి నిర్మాణాలకు ముందుకు రాలేదు. నేటికి మూడున్నరేళ్లు పూర్తయినా నిధులు అందకపోవడంతో వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   


తప్పని ఎదురుచూపులు..

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వివిధ మండలాల్లో గోకులం పథకంలో భాగంగా 2441 షెడ్ల నిర్మాణానికి రూ.41 కోట్ల మంజూరుకు పరిపాలనా అనుమతులు మంజూరయ్యాయి. వీటిలో సగానికి పైగా పూర్తికాగా మిగిలినవి వివిధ దశల్లో ఉండిపోయాయి. పూర్తిచేసిన వారికి సుమారు రూ.3 కోట్లు వివిధ స్థాయిల్లో లబ్ధిదారుల ఖాతాల్లో జమయ్యాయి. వివిధ దశల్లో నిర్మాణాలు జరిగిన వాటికి ఇంకా రూ.30 కోట్ల వరకూ చెల్లించాల్సి ఉంది.


నేటికీ నమోదు చేయని వైనం

ఈ పథకంలో భాగంగా రైతులు నిర్మించుకున్న షెడ్లకు పశుసంవర్థక శాఖ సాంకేతిక అధికారులు పరిశీలించి ఆన్‌లైన్‌లో ఎఫ్‌.టి.ఒ. (పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్‌)లు నమోదు చేయాలి. నేటికీ ఈ ప్రక్రియ పూర్తికాలేదు. చాలామంది అప్పులు చేసి నిర్మించుకున్నారు. నిధుల విడుదల జాప్యంతో వారంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


మండలాల వారీగా మంజూరు ఇలా...

* ఎచ్చెర్ల 119, ఆమదాలవలస 107, భామిని 01, బూర్జ 19, జి.సిగడాం 37, గార 39, హిరమండలం 59, ఇచ్ఛాపురం 74, జలుమూరు 63, కంచిలి 29, కవిటి 88, కోటబొమ్మాళి 96, కొత్తూరు 20, లావేరు 243, ఎల్‌.ఎన్‌.పేట 109, మందస 25, మెళియాపుట్టి 39, నందిగాం 110, నరసన్నపేట 28, పాలకొండ 83, పలాస 15, పాతపట్నం 161, పోలాకి 61, పొందూరు 27, రాజాం 92, రణస్థలం 113, రేగిడి ఆమదాలవలస 33, సంతబొమ్మాళి 240, సంతకవిటి 53, సారవకోట 125, సరుబుజ్జిలి 109, సీతంపేట 01, సోంపేట 41, శ్రీకాకుళం 25, టెక్కలి 09, వజ్రపుకొత్తూరు 16, వంగర 47, వీరఘట్టం 49.

ప్రభుత్వం మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనులకు సంబంధించి సచివాలయాలు, ఆర్‌బీకేలు, ఆరోగ్య కేంద్రాల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వడంతో గోకులం పథకంలో పాడిరైతులు నిర్మించుకున్న షెడ్లకు నిధులు విడుదల చేయలేదు. మార్చినెల తరువాత క్షేత్రస్థాయిలో పరిశీలించి నిధుల చెల్లింపునకు అవసరమయ్యే చర్యలు చేపడతాం. సమస్యను ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తున్నాం.

కిశోర్‌, జిల్లా సంయుక్త సంచాలకులు, పశుసంవర్థకశాఖ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని