ఇదిగో హార్బర్.. అదిగో జెట్టీ!
మంచినీళ్లపేట వద్ద జెట్టీ కాదు.. ఫిషింగ్ హార్బర్ నిర్మించేందుకే ముఖ్యమంత్రికి విన్నవించాం. ఆయన సానుకూలంగా స్పందించారు.
నాయకులవి మాటల మూటలు
మత్స్యకారులవి వలస బతుకులు
న్యూస్‌టుడే, సోంపేట
జెట్టీలేక బారువకొత్తూరు వద్ద మహేంద్రతనయ సంగమ స్థానంలో ఉంచిన పడవలు
మంచినీళ్లపేట వద్ద జెట్టీ కాదు.. ఫిషింగ్ హార్బర్ నిర్మించేందుకే ముఖ్యమంత్రికి విన్నవించాం. ఆయన సానుకూలంగా స్పందించారు. అక్కడ కూడా హార్బరే నిర్మిస్తాం. ఎచ్చెర్ల మండలం బుడగట్లపాలెం వద్ద సముద్రతీరంలో రూ.365 కోట్లతో ఫిషింగ్ హార్బర్ నిర్మించేందుకు టెండర్ ప్రక్రియ పూర్తి కాగా త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి.
వివిధ సందర్భాల్లో వైకాపా నేతలు
సువిశాలమైన సముద్రతీరం.. రెండు లక్షల మందికిపైగా మత్స్యకారులు.. వేట సాగించేవారే అక్షరాలా అరవై వేలు.. ఇంతటి అవసరాలున్న జిల్లాలో ఒక్కటంటే ఒక్క జెట్టీ గానీ.. ఫిషింగ్‌హార్బర్ గానీ లేదంటే మన నాయకుల తీరునేమనాలి.. మాట్లాడితే ఇదిగో హార్బర్ అంటే అదిగో జెట్టీ అంటుంటారు. వీరికి అధికారులు వంతపాడుతుంటారు. ఆరు దశాబ్దాలుగా మాటలే తప్ప చేతల్లేవు. దీంతో జిల్లాలో సగానికిపైగా మత్స్యకారులకు వలసే జీవనాధారమైపోతోంది.
ఒక్కటీ లేక..
కేరళ, గుజరాత్ లాంటి రాష్ట్రాల్లో 30 కి.మీ.కు ఒక జెట్టీ ఏర్పాటు చేయగా జిల్లాకు 193 కి.మీ. తీరం ఉన్నా.. ఒక్కటంటే ఒక్క జెట్టీ కూడా లేదు. ఇచ్ఛాపురం నియోజకవర్గంలోనే మూడు, నాలుగు జెట్టీలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంది. పలాస, టెక్కలి, శ్రీకాకుళం, ఎచ్చెర్ల నియోజకవర్గాల పరిధిలో కనీసం ఒకటి చొప్పున ఏర్పాటు చేసినా జీవనోపాధి కోసం ఇతర తీరప్రాంతాలకు వెళ్లాల్సిన పరిస్థితి సిక్కోలు మత్స్యకారులకు ఉండదని ఐక్యవేదిక ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఫిషింగ్‌హార్బర్ వెచ్చించే నిధుల్లో సగం ఖర్చుచేస్తే తీరంలో పది వరకు మినీ జెట్టీలు ఏర్పాటు చేయవచ్చని వారంటున్నారు.
చెన్నైలో సిక్కోలు వలస మత్స్యకారులు
వలసలు ఆగేదెప్పుడు..
సోంపేట మండలం ఇసకలపాలెంలో వెయ్యికిపైగా కుటుంబాలుండగా అంతా చేపలవేట ఆధారంగానే బతుకు సాగదీస్తున్నారు. ఇందులో ఆరువందల మందికి పైగా మత్స్యకారులు తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, గోవా, కేరళ, అండమాన్, తదితర ప్రాంతాలకు వలస వెళ్లి అక్కడ స్టీమర్లు, ఇతర మరపడవల ద్వారా వేట సాగిస్తున్నారు. నెలకు 25 రోజుల వరకు సముద్రంలోనే ఉండడం ద్వారా వేటాడిన మత్స్యసంపద పరంగా వచ్చే ఆదాయంలో 20 శాతం మాత్రమే వారికి అందుతుంది. అదే వసతి తమకు ఇక్కడ సొంతంగా ఉంటే ఖర్చులు పోను కనీసం తక్కువలో నెలకు రూ.50వేల వరకు ఆదాయం తెచ్చుకునే అవకాశం ఉంటుందని వారంటున్నారు. ఇలా జిల్లా నుంచి 30 వేల మందికిపైగానే మత్స్యకారులు వలస బతుకులు సాగిస్తున్నారు. వలస బతుకులతో తీరప్రాంత గ్రామాలు పలచనవుతున్నాయి.
ఇవీ ప్రయోజనాలు
* జెట్టీల ఏర్పాటుతో రాత్రీ పగలు తేడా లేకుండా వేటసాగించేందుకు అవకాశం ఏర్పడుతుంది.
* వేట తరువాత సంబంధిత పరికరాలు అక్కడ ఉంచుకోవచ్చు. తిరిగి వేటకు సులువుగా వెళ్లవచ్చు.
* జెట్టీల నుంచి బోట్లు, సంప్రదాయ పడవలు, మినీ స్టీమర్ల ద్వారా ఏ సమయంలోనైనా వేట సాగించేందుకు అవకాశం ఉంటుంది.
* సముద్రంలో తుపాన్లు, ఇతర వైపరీత్యాలు, ఆరోగ్యపరమైన సమస్యలు, వేటపరమైన ఇబ్బందులు తలెత్తితే జెట్టీ ఉంటే వెంటనే చేరుకోవచ్చు.
* మత్స్యసంపద రవాణాకు అనుకూలంగా ఉండి మెరుగైన ఆదాయం పొందవచ్చు.
జిల్లా వివరాలు
తీరప్రాంతం 193 కి.మీ.
నియోజకవర్గాలు 6
గ్రామాలు 154
వేటతో ఉపాధి పొందుతున్న మత్స్యకారులు 60 వేలు
ఇందులో వలస వెళ్తున్నవారు 30 వేలకు పైగానే
తీరంలో జెట్టీలు, ఫిషింగ్ హర్బర్లు లేవు
ఏటా మత్స్యసంపద లావాదేవీలు రూ.800 కోట్లు
ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది
బుడగట్లపాలెంలో ఫిషింగ్ హార్బర్, నువ్వలరేవు పరిధిలో జెట్టీల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇద్దివానిపాలెం, బారువకొత్తూరుతో పాటు జిల్లాలో మరికొన్నిచోట్ల వీటిని ఏర్పాటు చేస్తే వలసలు నివారించొచ్చని మత్స్యకార కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వానికి తెలియజేశాం. మంత్రి అప్పలరాజు, జడ్పీ అధ్యక్షురాలు విజయ సహకారంతో జెట్టీల ఏర్పాటుకి చర్యలు తీసుకునేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మడ్డు రాజారావు, డైరెక్టర్, మత్స్యకార కార్పొరేషన్
దుర్భరంగా జీవితాలు
జిల్లాలో కనీస వసతులు లేకపోవడంతో ఇతర ప్రాంతాల్లో కూలీలుగా వేట సాగించాల్సి వస్తోంది. ఆయా ప్రాంతాల్లో నివాస వసతిలేక సముద్రంలోనే వేట, విశ్రాంతి తీసుకుంటుండటంతో ఏటా 50 మంది వరకు మత్స్యకారులు మృత్యువాత పడుతున్నారు. ఆయా సందర్భాల్లో కుటుంబాలు కడచూపునకు నోచుకోలేని దుర్భర పరిస్థితి ఉంటోంది. ఇంత కష్టపడినా వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. స్థానికంగా మినీజెట్టీలు ఏర్పాటు చేసి సదుపాయాలు సమకూర్చితే వలసలు నివారించొచ్చు. ఆదాయమూ రెట్టింపు చేసుకోవచ్చు.
కె.వెంకటరావు, అధ్యక్షుడు, సిక్కోలు వలస మత్స్యకారుల సంఘం
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్కు మరో రెండు పతకాలు.. ఫైనల్కు కిదాంబి శ్రీకాంత్