logo

విద్యార్థులంతా ఉత్తీర్ణులయ్యేలా ప్రణాళిక

పదోతరగతి పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. అందుకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Published : 03 Feb 2023 03:05 IST

జిల్లా విద్యాశాఖాధికారి పగడాలమ్మ

న్యూస్‌టుడే, కలెక్టరేట్(శ్రీకాకుళం): పదోతరగతి పరీక్షలకు సమయం దగ్గర పడుతోంది. అందుకు అనుగుణంగా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పరీక్ష కేంద్రాలను గుర్తించడంతో పాటు ప్రభుత్వ బడుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పక్కాగా పరీక్షలు జరిగేలా చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి జి.పగడాలమ్మ ‘న్యూస్‌టుడే’తో మాట్లాడుతూ మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యంగా కార్యాచరణ సిద్ధం చేశామని, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని తెలిపారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి  పలు అంశాలను  వెల్లడించారు. అవి  ఆమె మాటల్లోనే...


149 కేంద్రాల ఎంపిక...

జిల్లాలో మొత్తం 561 ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల నుంచి 29,545 మంది పది పరీక్షలు రాసేందుకు సన్నద్ధమవుతున్నారు. ఏప్రిల్‌ 3 నుంచి పరీక్షలు జరగనున్నాయి. 18వ తేదీ వరకు కొనసాగుతాయి. గతం కంటే పరీక్షా కేంద్రాలను తగ్గించాం. కొవిడ్‌ కారణంగా గతేడాది ఎక్కువ కేంద్రాలను ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. ఈసారి అన్ని అవసరం లేదు. అందుకే 149 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నాం. ఇందులో ఎ-కేటగిరీ కేంద్రాలు 57, బి-కేటగిరీ 29, సి-కేటగిరీ 63 ఉన్నాయి.


అంశాల వారీగా తర్ఫీదు..

ప్రభుత్వ బడుల్లో చదువుతూ పదో తరగతి పరీక్షలు రాయనున్న ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికతో చదివిస్తున్నాం. ఇందుకుగాను నిపుణులు తయారు చేసిన మాదిరి ప్రశ్నపత్రాలను సాధన చేయిస్తున్నాం. ఎంపిక చేసిన అంశాలపై పట్టుసాధించేలా తర్ఫీదు ఇస్తున్నాం. దీని ద్వారా మంచి ఫలితాలు వస్తాయని ఆశిస్తున్నాం.


వెనుకబడినవారిపై ప్రత్యేక శ్రద్ధ..

గతేడాది కరోనా ప్రభావం, తరగతులు సక్రమంగా జరగకపోవడంతో ఆశించినస్థాయిలో ఉత్తీర్ణతా శాతం సాధించలేకపోయాం. ఈసారి మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. ఇటీవల నిర్వహించిన సమ్మెటివ్‌, ఫార్మెటివ్‌ పరీక్షల్లో సీ, డీ గ్రేడుల్లో నిలిచిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నాం. దీనిపై ఇప్పటికే ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం.  


పక్కాగా పర్యవేక్షణ...

పదో తరగతి విద్యార్థులకు సంబంధించి పాఠశాలల్లో అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాల పర్యవేక్షణపై దృష్టి పెడుతున్నాం. నాతో పాటు సమగ్ర శిక్ష ఏపీసీ, ఉపవిద్యాశాఖాధికారులు, మండల విద్యాశాఖాధికారులు, సీనియర్‌ ప్రధానోపాధ్యాయులు తనిఖీలకు వెళ్తున్నాం. అమలులో ఎక్కడా లోపం లేకుండా చూస్తున్నాం.  


లోటుపాట్లు ఉంటే సరిచేస్తాం.. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా చూడాలని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశాం.  తాగునీరు, మరుగుదొడ్ల సదుపాయం వంటి తప్పనిసరిగా ఉండాలని సూచించాం. ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే ఈలోగా సరిచేస్తాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని