logo

పొలాల్లోనే వదిలేశారు..

పత్తి పంట ఈ ఏడాది రైతు కళ్లల్లో కన్నీరు తెప్పిస్తోంది. మొదట్లో వర్షాలు సకాలంలో కురవకపోవడంతో కొంతమేర నష్టపోగా..

Published : 03 Feb 2023 03:05 IST

అదపాకలో తీయకుండా వదిలేసిన పత్తిపంట

న్యూస్‌టుడే, లావేరు: పత్తి పంట ఈ ఏడాది రైతు కళ్లల్లో కన్నీరు తెప్పిస్తోంది. మొదట్లో వర్షాలు సకాలంలో కురవకపోవడంతో కొంతమేర నష్టపోగా.. పంట చేతికందే సమయంలో భారీ వర్షాలతో చాలావరకు దెబ్బతింది. అష్టకష్టాలు పడి కాపాడుకున్న ఆ కాస్తంత కూడా మద్దతు ధర లేకపోవడంతో గగ్గోలు పెడుతున్నారు. దీంతో గత నాలుగు నెలలుగా ఇళ్లల్లోనే దాచుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కోత ఖర్చులు దండగని కొన్నిచోట్ల పొలాల్లోనే వదిలేస్తున్నారు. లావేరు మండలం అదపాక, పెద్దకొత్తపల్లి, గుర్రాలపాలెం, పాత, కొత్తకుంకాం, బెజ్జిపురం, బొంతుపేట, ఇజ్జాడపాలెం, గోవిందపురం, సీహెచ్‌ అగ్రహారం, మురపాక తదితర గ్రామాల్లో ఖరీఫ్‌లో సుమారు 4 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. గత అక్టోబరు, నవంబరు నెలల్లో క్వింట మద్దతు ధర సుమారు రూ.10 వేలు ఉంటే ప్రస్తుతం రూ.5 వేలకు పడిపోయింది. పెట్టిన పెట్టుబడులు కుడా రాని పరిస్థితి నెలకుంది. ధర లేకపోవడంతో పొలాల్లోనే వదిలేయాల్సిన దుస్థితి దాపురించింది. ఎకరాకు రూ.3-4500 వరకు పెట్టుబడి అవుతుందని అంటున్నారు. గతంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల నుంచి కొనుగోలు చేసేవారని, ప్రస్తుతం జిల్లాలో ఆ పరిస్థితి లేకపోవడంతో దళారులు దందా కొనసాగుతోందని అన్నదాతలు వాపోతున్నారు. పంట కొనుగోలు విషయం లావేరు మండలం వ్యవసాయాధికారి డి.మహేష్‌నాయుడు వద్ద ప్రస్తావించగా.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని