logo

యువకుడి బలవన్మరణం

గడ్డిమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన పొందూరు మండలం లోలుగులో చోటుచేసుకుంది.

Published : 03 Feb 2023 03:05 IST

నాగరాజు (పాతచిత్రం)

పొందూరు, న్యూస్‌టుడే: గడ్డిమందు తాగి యువకుడు బలవన్మరణానికి పాల్పడిన ఘటన పొందూరు మండలం లోలుగులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు లోలుగు గ్రామానికి చెందిన నూతబిల్లి సూర్యనారాయణ అలియాస్‌ నాగరాజు (26) భార్య శకుంతల గత ఏడాది డిసెంబరులో ఆత్మహత్యకు పాల్పడటం, అప్పులు తీర్చే మార్గం లేక మనస్తాపానికి గురయ్యాడు. బుధవారం గడ్డిమందు తాగడంతో కుటుంబ సభ్యులు శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. అతని తల్లి నీలమ్మ స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై లక్ష్మణరావు చెప్పారు.


ఆర్టీసీ కాంప్లెక్స్‌లో వ్యక్తి మృతి

శ్రీకాకుళం నేరవార్తా విభాగం, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రణస్థలం వెంకటేశ్వర కాలనీకి చెందిన ఇ.రాంబాబు(45) గురువారం మృతిచెందాడు. రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాంబాబుకి మద్యం అలవాటుతో పాటు మూర్చవ్యాధి ఉంది. వేకువజాము 4 గంటలకు ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలోని బెంచీపై కూర్చున్నాడు. 8 గంటల సమయంలో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆర్టీసీ స్టేషన్‌ మేనేజరు శామ్యూల్‌ గమనించి 108 వాహనంలో రిమ్స్‌కు తరలించే లోపు మృతిచెందాడు. ఇతనికి భార్య మంగమ్మ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. శామ్యూల్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాస్‌ చెప్పారు.


సోంపేట తహసీల్దార్‌పై లైంగిక వేధింపుల కేసు

సోంపేట, న్యూస్‌టుడే: సోంపేట తహసీల్దార్‌ ఎన్‌.రమేష్‌కుమార్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. స్థల సమస్యపై వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై గురువారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్‌ఐ ఎస్‌.బాలరాజు తెలిపిన వివరాల మేరకు.. మొగళికొత్తూరుకు  చెందిన మహిళ స్థల సమస్యపై కలెక్టర్‌ స్పందనలో ఫిర్యాదు చేయగా తహసీల్దార్‌ను కలవమని ఆయన చెప్పారు. దీంతో డిసెంబరు 27న తహసీల్దార్‌ రమేష్‌ను కలిసి వినతిపత్రం అందజేయగా అప్పటి నుంచి లైంగిక వేధింపులకు గురిచేశారని ఆమె ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తహసీల్దార్‌పై 354, 354-డి, 506, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ వివరించారు. జైభీమ్‌సేన జిల్లా అధ్యక్షుడు నగరి మోహన్‌రావు మాట్లాడుతూ బాధితురాలికి న్యాయం చేయాలని, తహసీల్దార్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని