logo

గాడితప్పిన ప్రణాళిక !

శ్రీకాకుళం నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక విభాగం గాడి తప్పుతోంది. అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. మరోపక్క భవన నిర్మాణ అనుమతుల విషయంలో అన్ని సక్రమంగా ఉన్నా ప్లాన్‌ మంజూరుకు చెల్లించే అధికారిక ఫీజుతో పాటు మరికొందరికి అదనంగా సమర్పించుకుంటే గానీ పని జరగడం లేదు.

Published : 04 Feb 2023 04:12 IST

జిల్లా కేంద్రంలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు  
అధికారిపై వేటుతో వెలుగులోకి నిజాలు
- న్యూస్‌టుడే, శ్రీకాకుళం నగరం

నగరంలోని 80 అడుగుల రహదారిలో అధికారపార్టీ నేత అనధికారికంగా నిర్మించిన  దుకాణ సముదాయం

శ్రీకాకుళం నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక విభాగం గాడి తప్పుతోంది. అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. మరోపక్క భవన నిర్మాణ అనుమతుల విషయంలో అన్ని సక్రమంగా ఉన్నా ప్లాన్‌ మంజూరుకు చెల్లించే అధికారిక ఫీజుతో పాటు మరికొందరికి అదనంగా సమర్పించుకుంటే గానీ పని జరగడం లేదు. లేదంటే కాళ్లరిగేలా తిరగక తప్పదు. ఇందుకు తాజాగా జరిగిన ఘటనే ఉదాహరణ. భవన నిర్మాణ అనుమతుల విషయంలో పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఇక్కడ టీపీవోపై ఫిర్యాదులు రావడం, ఆయన్ను ప్రభుత్వమే విధుల నుంచి తప్పించేసింది. అధికారికంగా తెలిసింది ఇది ఒక్కటే కాగా       తెలియని లీలలు ఎన్నో ఇక్కడ సాగుతున్నాయి. 

ప్లానింగ్‌ విభాగంలో కార్యాలయ ఖర్చుల పేరుతో కొంత మేర ప్రతి సర్వేయర్లు, ఇంజినీరు సమర్పించుకుంటారు. అలా సమర్పించిన వారికే ఇక్కడ ప్రాధాన్యముంటుంది. వారు పెట్టిన ప్లాన్లకే ముందుగా అనుమతులు లభిస్తాయి. లేకుంటే ఆన్‌లైన్‌లో ఫైల్‌ చూసేందుకు సమయం లేదంటూ వచ్చిన ప్రతిసారి దాటవేస్తూ కాళ్లరిగేలా తిప్పుతూ చివరికి లైసెన్సు సర్వేయరు, ఇంజినీరు నోటితోనే ముడుపులు ఇస్తామని చెప్పిస్తారనే ఆరోపణలు ఉన్నాయి.  

ఆ ముగ్గురికే అన్ని అనుమతులు...

నగరపాలక సంస్థ కార్యాలయ పరిధిలో ప్రస్తుతం 36 మంది వరకు ప్లాన్లు పెట్టేందుకు అధికారికంగా గుర్తింపు పొంది ఉన్నారు. వీరిలో ఓ ముగ్గురికి చెందిన ప్లాన్లకు మాత్రమే త్వరగా అనుమతులు లభిస్తాయి. అలా ఎందుకుంటే వారు భవన యాజమానికి నగరపాలక సంస్థకు చెల్లించాల్సిన ఫీజులతో అదనంగా వసూలు చేసి కొంత కార్యాలయ అధికారులకు ముట్టజెబుతున్నారని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. గతేడాది సుమారుగా 600 పైగా ప్లాన్లకు అనుమతులిచ్చారు. వాటిలో ఓ ఇంజినీరుకు సుమారు 200, మరో ఇద్దరికి వందకుపైగా ప్లాన్లు ఇచ్చారంటే ఆ ముగ్గురు ఏ విధంగా అక్కడ చక్రం తిప్పుతున్నారో అర్థం చేసుకోవచ్చు.

అడ్డు లేదు.. అడిగేవారు లేరు..

నగరపాలక సంస్థ మాస్టర్‌ ప్లాన్‌లో గ్రీన్‌ బెల్ట్‌, కోర్టు వివాదాలు, రెవెన్యూ దస్త్రాల్లో ప్రభుత్వ, నిషేధిత, చుక్కల భూములు, బలగ ప్రాంతంలో బావాజీ మఠం భూములు, అనాధికారిక లేఅవుట్లలో అనుమతులు మంజూరు చేసేందుకు ఆస్కారం లేదు. ఇలాంటి చోట్ల సంబంధిత స్థల యజమానులు అధికార పార్టీ నాయకులతో ఒత్తిడి తెచ్చి, నగరపాలక సంస్థ ప్లానింగ్‌ అధికారుల చేయి తడిపి అనధికారికంగా నిర్మాణాలు చేపడుతున్నారు. విలీన పంచాయతీల్లో వీటికి అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఇదంతా తెలిసినా అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో యథేచ్ఛగా నిర్మాణాలు సాగిపోతున్నాయి.

కన్నెత్తి చూడరు..?

అధికారులు కాసుల వేటలో పడి నిబంధనలను అతిక్రమిస్తున్నవారిపై చర్యలు తీసుకోవడంలో వెనకడుగు వేస్తున్నారు. పలు బహుళ అంతస్తులు, వాణిజ్య భవనాల విషయంలో ప్లానుకు విరుద్ధంగా నిర్మాణాలు సాగుతున్నా, కాలువలు, రహదారులను ఆక్రమిస్తున్నా వాటిపై కన్నెత్తి చూడట్లేదు. ఆసుపత్రులు, బహుళ వాణిజ్య భవనాల్లో పార్కింగ్‌ స్థలాల్లోనే ఇతర నిర్మాణాలు చేపడుతున్న భవనాలెన్నో ఉన్నాయి. గతంలో విజిలెన్స్‌ అధికారులు ఇలాంటి వాటిపై దృష్టి సారించి కేసులు నమోదు చేశారు. ఇటీవల వారి తనిఖీలు సైతం లేకపోవడం, కొందరు అధికారుల సహకారంతో నగరంలో అక్రమ కట్టడాలు పెద్ద సంఖ్యలో వెలుస్తున్నాయి.

విచారణకు ముందే తొలగింపు..

భవన నిర్మాణ అనుమతుల విషయంలో టీపీవో సీతారాం ఇబ్బందులు గురి చేస్తున్నారని, విచారణ జరిపి ఆయనపై చర్యలు తీసుకోవాలని కొందరు ఇంజినీర్లు, సర్వేయర్లు టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు. గత గురువారం నగరపాలక సంస్థ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. వచ్చిన ఫిర్యాదులపై ఓ అవగాహనకు వచ్చి విచారణకు ముందే ఉన్నతాధికారులు ఆయనను విధుల నుంచి తప్పించారనేది స్థానికంగా జరుగుతున్న చర్చ. టీపీవో అధికార పార్టీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ అనధికారిక భవనాల విషయంలో వారి సిఫార్సులకు పెద్దపీట వేస్తున్నారనే అభియోగాలు ఉన్నాయి.

రింగు తిప్పేది పొరుగు సేవల ఉద్యోగే..

ఇదే విభాగంలో పొరుగు సేవల విధానంలో పని చేసే ఓ ఉద్యోగిని ఏజెంటుగా పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిస్తున్నాయి. ఆ ఉద్యోగిపై గతంలో వచ్చిన అభియోగాలు, ఫిర్యాదుల కారణంగా ఆ వ్యక్తిని కమిషనర్లు ఇతర విభాగాలకు బదిలీ చేసినా టీపీవో పట్టుబట్టి రెండుసార్లు మళ్లీ ప్రణాళిక విభాగానికి రప్పించుకున్నారని కార్యాలయంలో ఉద్యోగులు చెబుతున్న మాట. గతేడాది జరిగిన బదిలీల సమయంలో సీతారాంను సైతం ఇక్కడ నుంచి వేరే చోటుకు బదిలీ చేసేందుకు ఆ శాఖ ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు. కానీ నగరపాలక సంస్థలో షాడో ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న జిల్లాకు చెందిన ఓ మంత్రికి సోదరుడు వరుసయ్యే వ్యక్తి తోడ్పాటుతో బదిలీని అడ్డుకుని ఇక్కడే ఉండేలా చక్రం తిప్పారని అప్పట్లో గుసగుసలు వినిపించాయి.


నిబంధనలు అతిక్రమిస్తే ఉపేక్షించం.. నగరపాలక సంస్థ పరిధిలో భవన నిర్మాణాల విషయంలో లైసెన్సు సర్వేయర్లు, ఇంజినీర్ల, ఉద్యోగులు అక్రమాలు, వసూళ్లకు పాల్పడినా ఫిర్యాదు చేయవచ్చు. వెంటనే విచారణ చేసి చర్యలు తీసుకుంటాం. భవన నిర్మాణ యజమానులు సైతం నిబంధనలు పాటించాలి. ఈ విషయంలో ఉపేక్షించేది లేదు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టీపీవోను ఇక్కడ నుంచి రిలీవ్‌ చేశాం. ఆయన స్థానంలో ప్రస్తుతానికి ఎవరిని నియమించలేదు.  

చల్లా ఓబులేసు, నగరపాలక సంస్థ కమిషనర్‌, శ్రీకాకుళం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని