logo

విదిలింపులే..!

సిక్కోలు వాసులకు కొత్త రైళ్లతో పాటుగా హాల్టుల ఊసే లేకుండా రైల్వే బడ్జెట్‌ కూత పెట్టేసింది. రైలు నిలయాల అభివృద్ధితో పాటుగా మూడోలైను నిర్మాణం, అండర్‌ పాసేజ్‌ వంతెనల నిర్మాణాలపై కేటాయింపులే కాస్త ఊరటనిచ్చే అంశం.

Published : 04 Feb 2023 04:12 IST

కొత్త రైళ్లు లేవు.. హాల్టులూ లేవు
మౌలిక సదుపాయాలకూ స్వల్ప కేటాయింపులే...
పలాస, న్యూస్‌టుడే

సిక్కోలు వాసులకు కొత్త రైళ్లతో పాటుగా హాల్టుల ఊసే లేకుండా రైల్వే బడ్జెట్‌ కూత పెట్టేసింది. రైలు నిలయాల అభివృద్ధితో పాటుగా మూడోలైను నిర్మాణం, అండర్‌ పాసేజ్‌ వంతెనల నిర్మాణాలపై కేటాయింపులే కాస్త ఊరటనిచ్చే అంశం. జిల్లా నుంచి వందల సంఖ్యలో వలసలు వెళుతున్నా రైల్వేశాఖ తరఫున జిల్లా నుంచి ఒక్క రైలూ కొత్తగా ప్రకటించకపోవటం, ఉన్న రైళ్లల్లో సాధారణ బోగీల సంఖ్య పెంచకపోవటంతో జిల్లావాసుల ఆశలు అడియాసలయ్యాయి.

మూడోలైను పెండింగ్‌ పనులకు..

జిల్లా మీదుగా మూడో లైను ఏర్పాటులో పెండింగ్‌ పనులు పూర్తికి నిధులు కేటాయించింది. భద్రక్‌ నుంచి విజయనగరం వరకు 525 కిలోమీటర్ల మేర మూడోలైను పెండింగ్‌ పనులు పూర్తిచేయనున్నారు.

ఆ ఊసే లేదు..  

జిల్లా మీదుగా నడిచేలా కొత్త రైళ్ల కోసం జిల్లా వాసులంతా ఎదురుచూస్తున్నా రైల్వేశాఖ కొత్త రైళ్ల ప్రతిపాదనలు, కేటాయింపులు ఇవ్వకపోవటంతో ఉన్న రైళ్లతోనే సర్దుకుపోవాల్సిన పరిస్థితి. ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్లేందుకు నేరుగా రైళ్లు లేకపోవటంతో ఇటు ఒడిశాలోని కుర్దారోడ్‌, అటు విశాఖపట్నం వరకు వెళ్లి ఎక్కాల్సి వస్తోంది. జిల్లాలో ప్రధాన ఆదాయ వనరులుగా ఉన్న ఆమదాలవలస, పలాస, ఇచ్ఛాపురం రైలు నిలయాలతో పాటుగా కంచిలి, నౌపడా, తిలారు, పొందూరు వంటి రైలు నిలయాల్లో రైళ్ల హాల్ట్‌ కోసం ప్రజాప్రతినిధులు విన్నపాలు చేస్తున్నా ప్రయోజనం లేకపోయింది.

పొడిగింపు..

జిల్లాలో ఆంధ్రా ఒడిశా సరిహద్దులో ఉన్న నౌపడా-గుణుపూర్‌ బ్రాడ్‌గేజ్‌ లైను తెరువలీ వరకు పొడిగించేందుకు నిధులు కేటాయించారు. గుణుపూర్‌ నుంచి 79.15 కిలోమీటర్ల దూరం ఉండే తెరువలి వరకు రూ.50 కోట్లతో బ్రాడ్‌గేజ్‌ లైను పొడిగించనున్నారు. ట్రాక్‌ పునరుద్ధరణ పనుల్లో భాగంగా పలాస-విశాఖ-దువ్వాడ లైనుకు రూ.40 కోట్లు, వాల్తేరు డివిజన్‌లోని ఉద్యోగుల నివాస గృహాల మరమ్మతుకు రూ.15 లక్షలు కేటాయించారు.

పలాస రైలు నిలయంలో షెల్టర్‌లేని ప్లాట్‌ఫారం

వాల్తేరు డివిజన్‌కు రూ.2,857 కోట్లు..

తూర్పుకోస్తా జోన్‌ పరిధిలోని వాల్తేరు రైల్వే డివిజన్‌కు 2023-24 బడ్జెట్‌లో రూ.2857.85 కోట్లు కేటాయించారు. అత్యధికంగా వివిధ మార్గాల్లో డబ్లింగ్‌ పనుల కోసం రూ.2,185 కోట్లు, కొత్త రైల్వే మార్గాలకు రూ.285 కోట్లు, ట్రాక్‌ పునరుద్ధరణకు రూ.261.43 కోట్లు నిధులు ఇచ్చారు. ప్రయాణికుల సౌకర్యాలకు రూ.292.79 కోట్లు, డబ్లింగ్‌ పనులకు రూ.100 కోట్లు , సిగ్నల్‌, టెలికాంకు రూ.245 కోట్లు, విద్యుత్తు పనులకు రూ.236.45 కోట్లు, భద్రత సంబంధ పనులకు రూ.347 కోట్లు కేటాయించారు. రికార్డు స్థాయిలో వాల్తేరు డివిజన్‌కు కేంద్రం నిధులు విడుదల చేసిందని డీఆర్‌ఎం అనూప్‌ శత్పథి శుక్రవారం విశాఖలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

పైవంతెనలు.... సిగ్నలింగ్‌పైనే..

జిల్లాలో సుర్లారోడ్‌ నుంచి బాతువ రైలు నిలయం వరకు మార్గమధ్యలో ఉన్న పైవంతెనలు, సిగ్నలింగ్‌ వ్యవస్థ ఆధునికీకరించేందుకు, విజయనగరం, పలాస రైలు నిలయాల మధ్య రెండు ప్రాంతాల్లో ఐ.బి.సిగ్నల్స్‌ ఏర్పాటుకు నిధులు కేటాయించింది. సుర్లారోడ్‌- ఇచ్ఛాపురం, సోంపేట-బారువ-మందస రైలు నిలయాల మధ్య ఇంటర్మీడియట్‌ బ్లాక్‌ సిగ్నలింగ్‌ పనులు చేపట్టనున్నారు. పలాస-పూండి మధ్యలో రూ.2.05 కోట్లు, పొందూరు- సిగడాం మధ్యలో రూ.1.50 కోట్లతో రోడ్డు ఓవర్‌ బ్రిడ్జిలు, రూ.3.71 కోట్లతో పలాస-పూండి, పూండి- నౌపడా, రూ.3.2 కోట్లతో కోటబొమ్మాళి- తిలారు, పలాస-పూండి, కోటబొమ్మాళి యార్డ్‌లో పరిమిత ఎత్తుతో కూడిన సబ్‌వేలు నిర్మించనున్నారు. రూ.2 కోట్లతో నౌపడా- కోటబొమ్మాళి సబ్‌వేతో కూడిన రోడ్‌ ఓవర్‌ బ్రిడ్జి, రూ.2కోట్లతో ఉర్లాం-శ్రీకాకుళం రోడ్‌ మధ్యలో రోడ్‌ ఓవర్‌బ్రిడ్జి చేపట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని