logo

అర్హత ఉన్నా పింఛను ఇవ్వరేం?

రెండున్నరేళ్లుగా పింఛను అందడం లేదని బూర్జ మండల పరిధి చీడివలసకు చెందిన దాసరి అప్పలసూరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 04 Feb 2023 04:12 IST

సర్పంచి శ్రీరామ్మూర్తిని నిలదీస్తున్న వృద్ధురాలు అప్పలసూరమ్మ

బూర్జ, న్యూస్‌టుడే:  రెండున్నరేళ్లుగా పింఛను అందడం లేదని బూర్జ మండల పరిధి చీడివలసకు చెందిన దాసరి అప్పలసూరమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. కొల్లివలస గురుకులంలో శుక్రవారం గ్రామ సచివాలయ వాలంటీర్లు, కన్వీనర్లు, గ్రామ సారథుల శిక్షణ కార్యక్రమానికి హాజరైన సభాపతి తమ్మినేని సీతారాం, ఆయన కుమారుడు చిరంజీవి నాగ్‌ ముందు సమస్య వివరించడానికి రాగా వారిని కలవకుండా ఇక్కడి నాయకులు అడ్డుకున్నారని ‘న్యూస్‌టుడే’ వద్ద ఆమె వాపోయారు. ‘గతంలో నా భర్త అప్పయ్యకు వృద్ధాప్య, నాకు దివ్యాంగ పింఛన్లు అందేవి. ఆయన రెండేళ్ల కిందట కన్నుమూశారు. కుమారులు కుటుంబ పోషణకు వేర్వేరు ప్రాంతాలకు వలస వెళ్లారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత సుమారు ఆరు నెలల పాటు మాకు పింఛన్లు అందాయి. ఆయన మృతి చెందిన అనంతరం సర్పంచి కారణంగా నాకు దివ్యాంగ, వితంతు, వృద్ధాప్య పింఛన్లలో ఏ ఒక్కటీ అందడం లేదు. బతుకు భారమవడంతో సమీప గ్రామాల్లో చిన్నారుల ఆరోగ్యానికి ఉపయోగపడే వనమూలికలు, వేర్లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నా. సర్పంచిని ప్రశ్నిస్తే నా భర్త పేరిట అంత్యోదయ కార్డు ఉండటంతో పింఛను అందదని చెబుతున్నారు. నా భర్త బతికి ఉన్నప్పుడు ఇచ్చిన పింఛను ఇప్పుడు ఎందుకు అందడం లేదని’ కన్నీరుమున్నీరయ్యారు. వృద్ధురాలి ఆవేదనను గమనించిన ఎంపీపీ కె.దీప, మామిడివలస ఎంపీటీసీ సభ్యుడు జి.రాంబాబు అధికారులతో మాట్లాడతామన్నారు. ఈ విషయమై ఎంపీడీవో ఎం.రవీంద్రబాబు మాట్లాడుతూ సంప్రదించగా ఆమెకు పింఛను అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని