logo

అప్రమత్తంగా ఉందాం.. అడ్డుకుందాం..!

అప్రమత్తంగా ఉండటంతో పాటు ముందుగానే ముప్పును పసిగట్టగలిగితే ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాంటి వాటిలో క్యాన్సర్‌ మొదటి వరుసలో ఉంటుంది.

Published : 04 Feb 2023 04:12 IST

- న్యూస్‌టుడే, గుజరాతీపేట(శ్రీకాకుళం)

జెమ్స్‌ ఆసుపత్రిలో క్యాన్సర్‌ విభాగంలోని రేడియేషన్‌ యంత్రం

అప్రమత్తంగా ఉండటంతో పాటు ముందుగానే ముప్పును పసిగట్టగలిగితే ఎన్నో వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు. అలాంటి వాటిలో క్యాన్సర్‌ మొదటి వరుసలో ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి.. ఇలా ఎన్నో కారణాలతో క్యాన్సర్‌ బాధితులు ఏటేటా పెరుగుతున్నారు. పురుషుల కంటే మహిళలను మరింతగా వేధిస్తోంది. రొమ్ము, గర్భాశయ ముఖ క్యాన్సర్లతో ఎక్కువగా బాధపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. శనివారం ‘ప్రపంచ క్యాన్సర్‌ దినం’ సందర్భంగా జిల్లాలో ఈ వ్యాధి పరిస్థితి, అందుబాటులో వైద్యసదుపాయాలు, నిపుణుల సూచనలతో  ‘న్యూస్‌టుడే’ కథనం..

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్యాన్సర్‌ వైద్య నిపుణుల లేరు. ఇక్కడ కేవలం నిర్ధారణ పరీక్ష(సూది మందు పరీక్ష) మాత్రమే చేస్తున్నారు. వ్యాధి నిర్ధారణ జరిగితే బాధితులను చికిత్స కోసం విశాఖలోని కేజీహెచ్‌కు పంపిస్తున్నారు. ప్రయివేట్‌ పరంగా చూస్తే శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలులోని జెమ్స్‌ ఆసుపత్రిలో క్యాన్సర్‌ మెడికల్‌, సర్జికల్‌, రేడియేషన్‌ అంకాలజీ వైద్యనిపుణులు ఉన్నారు. క్యాన్సర్‌ బాధితులకు శస్త్రచికిత్సలు కూడా చేస్తున్నారు.

మూడేళ్లలో 21,711 మందికి చికిత్స..

జిల్లాలో పొగాకు నమలడం, అడ్డపొగాకు పీల్చడం, మారిన జీవనశైలి తదితర కారణాలతో ఎక్కువ మంది క్యాన్సర్‌బారిన పడుతున్నారని నిపుణులు చెబుతున్నారు. బాధితులకు ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వం, నెట్‌వర్కు ఆసుపత్రుల్లో ఉచితంగా వైద్యసేవలందిస్తున్నారు. మూడేళ్లలో ఆరోగ్యశ్రీ ద్వారా జిల్లాలోని వివిధ ఆసుపత్రుల్లో 21,771 మంది చికిత్స చేయించుకున్నట్లు జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ పొగిరి ప్రకాశ్‌ తెలిపారు. చికిత్స అవసరమైన నేరుగా తెల్ల రేషన్‌ కార్డు తీసుకుని ఆసుపత్రికి వెళ్తే వైద్యసేవలందిస్తారని, వినియోగించుకోవాలని కోరుతున్నారు.


ప్రాథమిక దశలోనే గుర్తించాలి..

పొగాకుతో చేసే వస్తువుల వినియోగంతో శరీరంలోని ప్రధాన అవయవాలు దెబ్బతిని వివిధ క్యాన్సర్లు వస్తున్నాయి. పొగ తాగేవాళ్లతో పాటు ఆ పొగ పీల్చేవారికి ప్రమాదం ఉంటుంది. వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తిస్తే మందులతో తగ్గించవచ్చు. రెండు, మూడు దశలకు వెళ్లాక నిర్ధారణ జరిగితే తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయాలి. ఎవరికైనా అనుమానం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సంప్రదించాలి.

డాక్టర్‌ సాయికిరణ్‌, సర్జికల్‌ అంకాలజిస్ట్‌, జెమ్స్‌ ఆసుపత్రి


వంశపారపర్యంగానూ రావొచ్చు..

ఇటీవల చాలా మందికి మహిళలు బిడ్డలకు పాలు ఇవ్వకుండా పట్టుపాలు పడుతున్నారు. బిడ్డకు స్తన్యం ఇస్తే రొమ్ము క్యాన్సర్‌ బారిన పడకుండా ఉంటారు. వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంది. మహిళల్లో బలహీనమైన రోగ నిరోధక వ్యవస్థ, గర్భనిరోధక మాత్రలు ఎక్కువగా తీసుకోవడం, యుక్తవయస్సుకు ముందే శృంగారంలో పాల్గొనడం వంటి కారణాలతో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్‌ వస్తుంది. దీనికి నివారించాలంటే యుక్తవయస్సు రాగానే తల్లిదండ్రులు ఆడపిల్లలకు ‘కెరోవాక్‌’ వ్యాక్సిన్‌ వేయిస్తే మంచిది.

 డాక్టర్‌ దానేటి శ్రీధర్‌, సంతాన సాఫల్య వైద్యనిపుణులు, మెడికవర్‌ ఆసుపత్రి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని