logo

నాటిన మొక్కలు 1,780.. ఇప్పుడున్నవి 348

ఉపాధి పథకంలో భాగంగా రహదారులకు ఇరువైపులా 26 పంచాయతీల పరిధిలో 1,780 మొక్కలు నాటగా క్షేత్రస్థాయిలో 348 ఉన్నాయని సామాజిక తనిఖీ బృందాలు గుర్తించినట్లు ప్రజావేదికలో వెల్లడించారు.

Published : 04 Feb 2023 04:12 IST

సామాజిక తనిఖీల్లో గుర్తింపు

మాట్లాడుతున్న డ్వామా పీడీ చిట్టిరాజు

లావేరు, న్యూస్‌టుడే: ఉపాధి పథకంలో భాగంగా రహదారులకు ఇరువైపులా 26 పంచాయతీల పరిధిలో 1,780 మొక్కలు నాటగా క్షేత్రస్థాయిలో 348 ఉన్నాయని సామాజిక తనిఖీ బృందాలు గుర్తించినట్లు ప్రజావేదికలో వెల్లడించారు. లావేరులో శుక్రవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 2021-22లో ఉపాధి  పథకం కింద వేతనదారులకు వేతనాల చెల్లింపు, పంచాయతీరాజ్‌ శాఖ, సామాజిక నర్సరీలు, ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా 748 పనులకు సంబంధించి రూ.19.73 కోట్లు ఖర్చు చేశారు. వీటిపై వారం పాటు గ్రామాల్లో డీఆర్‌పీలు తనిఖీలు చేపట్టారు. ఆయా వివరాలను ప్రజావేదికలో పంచాయతీల వారీగా వివరాలు వెల్లడించారు. మండలంలోని నాలుగు గ్రామ సచివాలయాలకు సంబంధించి కిటీకీలు, తలుపులు ఏర్పాటు చేయకుండా రూ.7.80 లక్షల మేర బిల్లులు చెల్లించారు. క్షేత్రస్థాయిలో కిటీకీలు, తలుపులు ఏర్పాటు చేయలేదు. బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లకు వచ్చిన సిమెంట్‌, ఇసుక కనిపించలేదు. దీనిపై మండల ఇంజినీరింగ్‌ అధికారి ఎల్‌.అప్పన్న మాట్లాడుతూ సిమెంట్‌, ఇసుక ఇతర పనులకు వినియోగించినట్లు తెలిపారు. సచివాలయాలకు త్వరలో కిటీకీలు, తలుపులు అమరుస్తామని చెప్పారు. 26 పంచాయతీల్లో వ్యయం చేసిన మొత్తంలో రూ.23,42,312 మేర వ్యత్యాసం వచ్చినట్లు గుర్తించి ప్రజావేదికలో వెల్లడించారు. దీనికి సంబంధించి రూ.45,500 రికవరీ చేయాలని ఆదేశించారు. మస్టర్లలో దిద్దుబాట్లు, బినామీ మస్టర్లు వేసి నిధులు ఉపసంహరించినట్లు కనుగొన్నారు. డ్వామా పీడీ మాట్లాడుతూ గ్రామాల్లో వారం రోజుల్లో మొక్కలు నాటాలని ఆదేశించారు. ఉపాధి విజిలెన్స్‌ అధికారి లవరాజు, పర్యవేక్షణాధికారి కె.వి.వి.ప్రసాద్‌, ఏపీడీ శైలజ, జడ్పీటీసీ సభ్యుడు సీతంనాయుడు, ఎంపీపీ ప్రతినిధి బాలకృష్ణ, ఏపీవోలు ఆర్‌.సత్యవతి, శ్రీనువాసులనాయుడు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని