logo

నేర వార్తలు

విశాఖ నగరంలోని జాతీయ రహదారి జ్యోతినగర్‌ వద్ద రోడ్డు దాటుతున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ను లారీ ఢీకొనడంతో మృతి చెందాడు.

Published : 04 Feb 2023 04:12 IST

లారీ ఢీకొని కానిస్టేబుల్‌ మృతి

విఠల్‌రావు (పాత చిత్రం)

విశాఖపట్నం(మాధవధార), న్యూస్‌టుడే: విశాఖ నగరంలోని జాతీయ రహదారి జ్యోతినగర్‌ వద్ద రోడ్డు దాటుతున్న పోలీస్‌ కానిస్టేబుల్‌ను లారీ ఢీకొనడంతో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పొందూరు మండలం గోకర్లపల్లి గ్రామానికి చెందిన కంచరాన విఠల్‌రావు(35) విశాఖ కమిషనరేట్‌ కంట్రోల్‌ రూంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. కళింగనగర్‌లో నివాసముంటున్నారు. శుక్రవారం మధ్యాహ్నం ద్విచక్ర వాహనాన్ని జ్యోతినగర్‌ వద్ద నిలిపి జాతీయ రహదారి దాటి అవతలికి మూత్ర విసర్జనకు వెళ్లారు. తిరిగి వాహనం వద్దకు వచ్చేందుకు రోడ్డు దాటుతుండగా ఓ లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో లారీ వెనుక చక్రాలు విఠల్‌రావు తల, కాళ్లపై నుంచి వెళ్లిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. శరీరం గుర్తుపట్టలేనంతగా ఛిద్రమై పోవడంతో చనిపోయింది ఎవరనేది గుర్తించలేకపోయారు. ఫోన్‌ కూడా విరిగిపోయింది. ఆ సిమ్‌కార్డును వేరే ఫోన్‌లో వేసి, బంధువులతో మాట్లాడాక మృతి చెందిన వ్యక్తి కానిస్టేబుల్‌ విఠల్‌రావుగా గుర్తించగలిగారు. అతడి సోదరుడు కె.సన్యాసిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎయిర్‌పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన లారీ, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు: విఠల్‌రావుకు భార్య, మూడేళ్లు,  మూడు నెలల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య బాలింత కావడంతో పొందూరు మండలం వి.ఆర్‌.గూడెంలో అమ్మగారి ఇంటి వద్దనే ఉంటోంది. భర్త మృతి చెందిన విషయాన్ని ఆమెకు కుటుంబ సభ్యులు తెలపలేదు. విఠల్‌రావు పండగకు వెళ్లి భార్య, కుమారులతో సంతోషంగా గడిపాడని, ఇప్పడు ప్రమాదంలో మృతి చెందడంతో ఆమె తట్టుకోలేదని వారు కన్నీరుమున్నీరుగా విలపించారు.


కూరగాయలు కొనుగోలు చేస్తుంటే దూసుకొచ్చిన మృత్యువు!
రోడ్డు ప్రమాదంలో విశ్రాంత ఉపాధ్యాయుడి దుర్మరణం

అనంతరావు

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: పర్లాఖెముండి ఠాణా పరిధిలోని పొడ్డుణి కూడలి వద్ద శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిల్లాకు చెందిన ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు దుర్మరణం పాలయ్యారు. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతపట్నం మేజర్‌ పంచాయతీలోని ప్రశాంతి నగర్‌కు చెందిన గుంపు అనంతరావు(64) ఉదయం గుసాని సమితి కొర్సండ గ్రామంలోని బంధువుల ఇంట శుభకార్యానికి వెళ్లారు. సాయంత్రం ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తూ పొడ్డుణి కూడలి వద్ద ఆగారు. రహదారి పక్కన ఉన్న దుకాణంలో కూరగాయలు కొనుగోలు చేస్తుండగా అటువైపుగా వస్తున్న వ్యాన్‌ వేగంగా వచ్చి ఢీకొంది. ఘటనలో తీవ్రంగా గాయపడిన స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


కడుపునొప్పి తాళలేక వివాహిత ఆత్మహత్య

జలుమూరు, న్యూస్‌టుడే: జలుమూరు మండలంలో కొండపోలవలస గ్రామానికి చెందిన తర్ర వేణమ్మ(24) గురువారం రాత్రి బలవన్మరణానికి పాల్పడింది. వేణమ్మ తరచూ కడుపునొప్పితో బాధపడుతుండేదని, ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోవడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని పోలీసులు, స్థానికులు తెలిపారు. ఈమెకు భర్త, కుమారై, కుమారుడు ఉన్నారు. వేణమ్మ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌.ఐ. పారినాయుడు తెలిపారు. శవపంచనామా అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని