logo

చెరువులకు గర్భశోకం..!

టెక్కలి సమీపంలో ఉన్న 312 ఎకరాల విస్తీర్ణంలోని మినీ రిజర్వాయరు మదన గోపాలసాగరం ఆక్రమణల చెరలో చిక్కుకుంది. మూడు వైపుల నుంచి చెరువు గర్భాన్ని ఆక్రమిస్తున్నారు.

Published : 05 Feb 2023 03:04 IST

ఆక్రమణలతో   బక్కచిక్కుతున్న సాగునీటి వనరులు


రావివలసలోని కుమ్మరిగుంట చెరువు గర్భంలో వెలిసిన పంట పొలాలు

* టెక్కలి సమీపంలో ఉన్న 312 ఎకరాల విస్తీర్ణంలోని మినీ రిజర్వాయరు మదన గోపాలసాగరం ఆక్రమణల చెరలో చిక్కుకుంది. మూడు వైపుల నుంచి చెరువు గర్భాన్ని ఆక్రమిస్తున్నారు. ఏడాది కిందట కొంతమంది ఇక్కడ మట్టి పోసి చదును చేస్తుండగా వంశధార శాఖ అధికారులు అడ్డుకున్నారు. అయినా కొద్ది రోజుల్లోనే పంట పొలంగా మార్చేశారు.

* టెక్కలి పట్టణానికి సమీపంలో ఉన్న తొలుసూరుపల్లి గ్రామంలో భూముల ధరలకు డిమాండ్‌ రావడంతో కబ్జాదారుల కన్ను ఇక్కడి చెరువులపై పడింది. గ్రామ సమీపంలో ఉన్న దుంపల, లక్ష్మీచెరువుతో పాటు గ్రామ ప్రారంభంలో ఉన్న మరొక దాన్ని కబ్జా చేసేశారు.

* రావివలస పంచాయతీ పరిధిలో ఉన్న 22 చెరువులు పూర్తిగా పూర్వ వైభవాన్ని కోల్పోయాయి. గర్భాలను ఆక్రమిస్తూ పంట పొలాలుగా మార్చేశారు. గతంలో ఓసారి తొలగింపునకు మార్కింగ్‌ చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.  

* వేములవాడ సమీపంలో 211 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న దాలిచెరువు, పెద్దరోకళ్లపల్లి సమీపంలోని 107 ఎకరాల్లో ఉన్న భద్రాక్షి ట్యాంకు ఆక్రమణలకు గురవుతున్నాయి. సర్వే చేసి ఆక్రమణలు తొలగించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.

న్యూస్‌టుడే, టెక్కలి పట్టణం: టెక్కలిలో సాగునీటి చెరువులు ఆక్రమణ చెరలో చిక్కుకుని రోజురోజుకూ బక్కచిక్కుతున్నాయి. వేలాది ఎకరాలకు ప్రధాన ఆయువుగా ఉన్న చెరువులు క్రమేణా తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. ఏటా చొచ్చుకొస్తున్న ఆక్రమణలతో గర్భశోకాన్ని అనుభవిస్తున్నాయి. టెక్కలి మండలంలో వంశధార ఎడమ ప్రధాన కాలువ ఆయకట్టును మినహాయిస్తే అధికశాతం పంట పొలాలకు సాగునీటి చెరువులే ఆధారం. మండలంలో రెవెన్యూ రికార్డుల ప్రకారం 281 చెరువులు ఉండగా వీటి విస్తీర్ణం సుమారు 2,480 ఎకరాలు ఉంది. వీటికింద 25 వేల ఎకరాల పంట భూములు ఆధారపడి ఉన్నాయి. సమీప గ్రామాల ప్రజలు వ్యవసాయంతో పాటు ఇతర ప్రజావసరాలకూ వీటినే వినియోగిస్తున్నారు. ఇటు రెవెన్యూ, అటు వంశధార అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల ఆక్రమణలు పెచ్చుమీరుతున్నాయి. 

హద్దులు మీరుతున్నారు..

పదేళ్ల కిందట ఉపాధి పథకంలో భాగంగా మండలంలోని ప్రధాన చెరువుల హద్దులను అధికారులు నిర్ణయించారు. సర్వే అధికారులు నిర్ణయించిన హద్దుల్లో ఉపాధి వేతనదారులతో ట్రెంచ్‌ల తవ్వకాలు జరిపి గట్లు కూడా వేశారు. అక్కడికి కొద్ది నెలల్లోనే మళ్లీ పాత పరిస్థితే ఎదురైంది. గట్లు చదును చేసిన ఆక్రమణదారులు హద్దుల్ని దాటి లోపలకు చొచ్చుకెళ్లారు. ప్రస్తుతం జరుగుతున్న రీసర్వేలోనైనా చెరువుల ఆక్రమణలను గుర్తించి వాటిని తొలగించాలని రైతులు కోరుతున్నారు. ఈ చర్యల వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరిగి ఆయకట్టుకు మరింత ఉపయోగంగా ఉంటుందని కోరుతున్నారు.

తొలుసూరుపల్లి వద్ద చెరువును కప్పేసి చేపట్టిన  నిర్మాణాలు


రీసర్వేలో గుర్తిస్తాం... సాగునీటి వనరులైన చెరువుల ఆక్రమణలను ఉపేక్షించం. వీటిపై తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న రీసర్వే పూర్తయితే స్పష్టత వస్తుంది. ఇది పూర్తయ్యాక అన్నిచోట్లా తొలగింపు చర్యలు చేపడతాం.

కిశోర్‌, ఇన్‌ఛార్జి తహసీల్దారు, టెక్కలి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని